సోమవారం 30 మార్చి 2020
Medak - Jan 12, 2020 , 00:45:26

పల్లెలు పరిశుభ్రతతో కళకళలాడాలి

పల్లెలు పరిశుభ్రతతో కళకళలాడాలి

అల్లాదుర్గం : మండలంలోని పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని మండల ప్రత్యేక అధికారి బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుధాకర్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని వెంకట్రావుపేట, రెడ్డిపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. పచ్చదనం, పరిశుభ్రత ఎల్లవేళలా ఇలాగే ఉండాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి పనిని సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గ్రామాలను ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. గ్రామాల్లో నిత్యం ఉపాధి కూలీలు, మహిళా సంఘాలు గ్రామస్తులతో కలిసి శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, ఇంకుడుగుంతల నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎక్కడైనా చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేసి నీరు పోసి సంరక్షించాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్‌రెడ్డి, ఏపీవో పుణ్యదాస్‌, సర్పంచ్‌ బాలమణి, మాజీ సర్పంచ్‌ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


logo