మంగళవారం 31 మార్చి 2020
Medak - Jan 10, 2020 , 11:52:59

అంతర్మథనంలో కాంగ్రెస్, బీజేపీ

అంతర్మథనంలో కాంగ్రెస్, బీజేపీ

మెదక్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో అఖండ విజయం సాధించే దిశగా గులాబీ దండు దూసుకుపోతున్నది. ఎన్నికలు ఏవైనా గెలుపు మనదేనన్న ఆత్మవిశ్వాసం గులాబీ నేతల్లో బలంగా ఉన్నది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మెతుకు సీమ ప్రజలు పట్టం కట్టబెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగనున్నది. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని నేతలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో పోటీ పడలేమని భావించిన కాంగ్రెస్, టీడీపీలు పోటీకి వెనుకంజ వేస్తున్నాయి. బడా నాయకులు పత్తా లేకుండా పోయారు... ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి అసలు పట్టించుకోవడం లేదు... అని ఆ పార్టీకి చెందిన ముఖ్యకార్యకర్తలే చర్చించుకుంటున్నారు. దీంతో దిక్కుతోచక తలో దారి వెతుక్కుంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీకి చెందిన రా్రష్ట్ర నాయకుడు మూడుసార్లు మెదక్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన బట్టి జగపతి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో వందలాది మంది అనుచరులు, నాయకులు , కార్యకర్తలతో గులాబీ గూటికి చేరారు. దీంతో కాస్తోకూస్తో కాంగ్రెస్‌కు ఉన్న పట్టు తూడిచిపెట్టుకుపోయింది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారికి మొత్తం పార్టీకి సంబంధించిన బీఫాంలను అప్పగించినట్లు తెలుస్తున్నది. డీసీసీ అధ్యక్షుడిని కాదని కాంగ్రెస్ పార్టీ బీఫాంల పంపిణీ మెదక్ పట్టణంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారులుగా చలామణి అవుతున్న ఇద్దరు నేతలకు అప్పగించినట్లు సమాచారం. రెండో రోజు సైతం కాంగ్రెస్, బీజేపీల నుంచి చెప్పుకోదగ్గ నామినేషన్లు రాలేదు. ఇదిలావుండగా బీజేపీలో సైతం వర్గ పోరు కొనసాగుతున్నది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌ల మధ్య పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే శశిధర్‌రెడ్డి మెదక్ దరిదాపుల్లోకి రావడం లేదని పార్టీ వర్గాలు బహిరంగంగా చర్చించుకోవడం విశేషం. కాంగ్రెస్ పార్టీలో యువనాయకులుగా ఉన్న బట్టి ఉదయ్, గోదల సాయి సైతం టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఇద్దరికీ మొదటి జాబితాలోనే టికెట్లు ఖరారు చేయడంతో ఆ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మెదక్‌లో ఇప్పటికే 11వార్డులకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసిన జాబితాను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విడుదల చేశారు.

రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి..
రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలలో సైతం కాంగ్రెస్, బీజేపీలకూ అభ్యర్థులు దొరకడం కష్టతరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. రెబల్ అభ్యర్థుల కోసం గోతికాడి నక్కలా చూస్తూ వారికే బీఫాంలు కేటాయించేలా అంతర్గతంగా ప్రతిపక్షాలు ఆరా తీస్తున్నాయి. రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపిక కోసం ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అభివృద్ధికే పట్టంకట్టనున్న తూప్రాన్ మున్సిపాలిటీ ఓటర్లు..
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్న తూప్రాన్ మున్సిపాలిటీలో అభివృద్ధికే పట్టంకట్టేందుకు ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అభ్యర్థి ఎవరైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు ఖాయంగా ఉంది. ఇక్కడ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎలక్షన్‌రెడ్డిలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికకు సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్, బీజేపీలో అంతర్మథనం..
మున్సిపల్ ఎన్నికల ముఖ చిత్రంలో మునుపెన్నడూ లేని రాజకీయ వాతావరణం నెలకొంటున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పటిష్టమైన నాయకత్వం వంటి సానుకూల అంశాలు గులాబీ పార్టీకి ఉన్నాయి. ఇటువంటి వాతావరణంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలలో అంతర్మథనం కొనసాగుతున్నది. దాదాపు ఇదే పరిస్థితి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో నెలకొన్నది. గులాబీ పార్టీలో టికెట్ నాకంటే నాకని పోటీపడుతుండగా మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న నాయకులు పోటీ చేసి ఓటమిని మూటగట్టుకోవడం ఎందుకని పోటీకే జంకుతున్నారు.


logo
>>>>>>