శనివారం 04 ఏప్రిల్ 2020
Medak - Jan 10, 2020 , 11:52:12

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సేవలు మెరుగు

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సేవలు మెరుగు

మెదక్ మున్సిపాలిటీ : సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు సేవలు మెరుగుపడుతున్నాయని డీసీఆర్‌బీ సీఐ చందర్‌రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు జిల్లా పెట్రోల్ కార్స్ అధికారులకు రోజు వారి విధుల నిర్వహణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డయల్ 100, పాయింట్ బుక్ తనిఖీ, ఎంవో అఫెండర్స్ తనిఖీ తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో అంతే వేగంగా కొత్త తరహా ఆర్థిక సామాజిక నేరాలు కూడా పెరుగుతున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉద్ధేశించినదే సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఈ పెట్రోల్ కార్స్ వ్యవస్థ అని అన్నారు. ఇందులో భాగంగా పెట్రోల్ కార్స్ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉంటూ వృత్తి పట్ల అంకితభావం కలిగి సమన్వయంతో వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు. అలాగే డయల్ 100కి వచ్చే కాల్స్‌కి త్వరితగతిన ఘటనా స్థలానికి చేరుకొని ప్రజలకు తక్షణమే సాయం అందించాలన్నారు. టీఎస్‌సీవోపీ యాప్‌ను ప్రతి అధికారి ఉపయోగించాలని, అందులో ఉన్న ఫ్యూచర్స్‌పై ఐటీ సిబ్బంది వివరించడం జరిగిందన్నారు. అలాగే పెట్రోల్ కార్స్ అధికారులు క్రమశిక్షణ, సమయపాలన, విధుల పట్ల నిబద్ధత, విధేయత కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్‌ఐ ప్రభాకర్, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పెట్రోల్ కార్స్ సిబ్బంది పాల్గొన్నారు.

పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి
తూప్రాన్ రూరల్ : ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి రాజిరెడ్డి సూచించారు. తూప్రాన్ పట్టణంలోని కేఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో గురువారం సాయంత్రం పీవో, ఏపీవో, ఓపీవోల శిక్షణా కార్యక్రమంలో వారు పాల్గొని పోలింగ్ సిబ్బంది నిర్వర్తించాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నందున పీవోలు, ఏపీవోలు ఒక రోజు ముందుగానే తూప్రాన్‌కు చేరుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన సామగ్రి, బ్యాలెట్ బాక్స్‌లతో మధ్యాహ్నం ఒంటి గంటలోపే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవోతో పాటు మరో ముగ్గురు ఎన్నికల సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహిస్తున్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఆధార్, ఓటర్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటింగ్‌కు రావాలన్నారు. లేకపోతే ఓటు హక్కును కోల్పోతారని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పీవోలు, ఏపీవోలతో పాటు ఇతర పోలింగ్ అధికారులు పాల్గొన్నారు.


logo