e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home మెదక్ తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు

సంగారెడ్డి, ఆగస్టు 1: ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో సంగారెడ్డిలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అన్ని వీధుల నుంచి బోనాలతో వెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, సౌండ్‌ బాక్సులు, అమ్మవార్ల పాటలతో ఆలయాలు సందడిగా మారాయి. ఉదయం నుంచి పట్టణంలోని దుర్గమ్మ, ప్రధాన రహదారిపై ఉన్న నల్ల పోచమ్మ, హస్తబల్‌ ఫల పరిశోధన కేంద్రంలో కొలువుదీరిన రేణుకా ఎల్లమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బోనాలు, వైవేద్యాలను సమర్పించేందుకు వరుస క్రమంలో చిన్నా పెద్దలు బారులు తీరారు. పట్టణ ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా బోనాల వెంట ఫలహారం బండి ఉండడం, భక్తులకు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పించారు. ఎస్పీ రమణ కుమార్‌ ఆదేశాలతో డీఎస్పీ బాలాజీ నాయక్‌ పర్యవేక్షణలో పోలీసులు వాహనాలతో గస్తీ నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బోనాలకు ప్రాముఖ్యత: వెన్నవరం భూపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, ఆగస్టు 1: బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తున్నదని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్‌లోని ఓల్డ్‌ ఆర్సీపురం రాయసముద్రం చెరువు కట్టపై ఉన్న అమ్మవారి బోనాల వేడుకలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు పుష్పానగేశ్‌, సింధూఆదర్శ్‌రెడ్డిలతో కలిసి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి కుటుంబసభ్యులతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భెల్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన బోనాల వేడుకలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్లు, తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా అమ్మవారి ఆలయాల సన్నిధిలో నిర్వహించిన బోనాల వేడుకల్లో కార్పొరేటర్లు పుష్పానగేశ్‌, సింధూఆదర్శ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి వేర్వేరుగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు ఓల్డ్‌ ఆర్సీపురంలో ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. బోనాల వేడుకకు ప్రభుత్వం కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నదన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తున్నాయని తెలిపారు. గత ఏడాది కరోనా మహమ్మరి కారణంగా బోనాల వేడుకలను సాదాసీదాగా నిర్వహించినప్పటికీ ఈ ఏడాది ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉం డాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ అంజయ్య, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, కుమార్‌గౌడ్‌, మోహన్‌రెడ్డి, దేవేంద్రాచారి, పరమేశ్‌యాదవ్‌, లక్ష్మారెడ్డి, ఐలేశ్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
దర్శించుకున్న ఎమ్మెల్యే
పటాన్‌చెరు, ఆగస్టు 1 : బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా పలు ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ హారిక విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ సుప్రజా వెంకట్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్‌ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం మండలంలో
జిన్నారం, ఆగస్టు 1: జిన్నారం మండల వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆలయాల్లో భక్తులు బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఘటం ఊరేగింపుతో తీసుకెళ్లి సమర్పించారు.
అమీన్‌పూర్‌ మండలంలో
అమీన్‌పూర్‌, ఆగస్టు 1: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ, మండల పరిధిలో బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆషాఢమాస బోనాలను పురస్కరించుకుని వివిధ దేవాలయాలు ముస్తాబయ్యాయి. మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి పలు దేవాలయాలను దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మున్సిపల్‌ చైర్మన్‌కు ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అమ్మవారిని దర్శించుకున్నవారిలో జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నర్సింహాగౌడ్‌, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
అమ్మవారికి ఆర్డీవో ప్రత్యేక పూజలు
గుమ్మడిదల, ఆగస్టు 1: బొంతపల్లిలో జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాల పండుగను ఆర్డీవో మెంచు నగేశ్‌ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఫలహారం బండ్ల ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. సర్పంచ్‌ ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ నాగేందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సద్ది విజయభాస్కర్‌రెడ్డి ఆర్డీవోను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana