e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home మెదక్ ప్రగతి పరీక్షలో చిట్కుల్‌ గెలుపు

ప్రగతి పరీక్షలో చిట్కుల్‌ గెలుపు

  • అభివృద్ధిలో గ్రామం దూకుడు
  • పల్లె ప్రగతిలో ఉత్తమ గ్రామంగా ఎంపిక
  • పాలకవర్గం, అధికారుల పనితీరుపై కలెక్టర్‌ ప్రశంసలు
  • 13 ఎకరాల్లో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు
  • పారిశుధ్యం, పచ్చదనంలో ఆదర్శం
  • రాక్‌ గార్డెన్‌లో సందర్శకుల కోలాహలం

ఒకప్పుడు సమస్యలతో సతమతమవుతున్న ఆ గ్రామాన్ని ‘ప్రగతి’ మలుపు తిప్పింది. అరకొర వసతులతో అల్లాడుతున్న గ్రామస్తుల జీవితాల్లో ‘పల్లెప్రగతి’ కార్యక్రమం కొత్త వెలుగులు నింపింది. గతుకుల దారులతో అతుకుల జీవనం గడిపిన పల్లె వాసులు ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆస్వాదిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామం ఇతర గ్రామాలకు ఇప్పుడు ఆదర్శంగా మారింది. గ్రామాన్ని కలెక్టర్‌ హనుమంతరావు సందర్శించి మెచ్చుకున్నారు. వైకుంఠధామంతో ఆఖరి మజిలీ కష్టాలు తీరాయి. పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది.

ప్రగతి పథంలో చిట్కుల్‌ గ్రామం శరవేగంగా దూసుకెళ్తున్నది. ప్రతి నెలా ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ప్రగతి పనులు జోరందుకున్నాయి. పంచాయతీ పాలకవర్గం నిరంతరం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుండడంతో చిట్కుల్‌ సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా మారింది. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలకు ప్రతి రోజూ ట్యాంకర్‌ ద్వారా నీరు పోసి సంరక్షిస్తుండడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామంలో సీసీరోడ్లను నిర్మించడంతో బురదదారుల నుంచి ఉపశమనం కలిగింది. నగరాలకు తీసిపోని మాదిరిగా రాక్‌గార్డెన్‌ ప్రజలకు ఆరోగ్యాలను పంచుతున్నది. ఎమ్మెల్యే సహకారంతో అటు పంచాయతీ పాలకవర్గం, ఇటు అధికారుల సమన్వయంతో గ్రామాన్ని హరితమయంలా తయారుచేశారు. జిల్లా అధికారులు బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు 13ఎకరాల స్థలం కేటాయించడంతో అక్కడ చిట్టడవి తయారు కాబోతున్నది. దాదాపు రూ.100కోట్ల విలువైన స్థలం ప్రకృతి పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అందరి మన్ననలకు కారణం అవుతోంది. త్వరలో రాష్ట్ర అధికారులు సైతం ఈ గ్రామాన్ని సందర్శించనున్నట్లు సమాచారం. గ్రామంలో 14 వార్డులతో 1610 ఇండ్లు ఉండగా.. అందులో 5596 మంది జనాభా నివసిస్తున్నారు. మిషన్‌ భగీరథ ట్యాంకు 1, ప్రైమరీ స్కూళ్లు 2, జడ్పీహెచ్‌ఎస్‌ 1, గురుకుల బాలికల పాఠశాల 1 ఉన్నది. పల్లె ప్రకృతి వనంలో 4200 మొక్కలను నాటారు. నర్సరీలో 12,600 మొక్కలను పెంచుతున్నారు.

- Advertisement -

సీసీ కెమెరాలతో నిఘా..
చిట్కుల్‌ గ్రామం దినదినాభివృద్ధి చెందుతుండడంతో వేగంగా కాలనీలు ఏర్పాటవుతున్నాయి. గ్రామ పరిధిలో పరిశ్రమలు కూడా వెలిశాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. గ్రామ పరిధిలో సర్పంచ్‌ 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటింటికీ ‘మిషన్‌ భగీరథ’తో శుద్ధజలాన్ని అందిస్తున్నారు. ప్రతి కాలనీలో వీధి దీపాలను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో వెలుగులు నింపుతున్నారు. చిట్కుల్‌ ప్రాథమిక పాఠశాల జిల్లా స్థాయిలో ఉత్తమ పాఠశాలలో ఒకటిగా ఉంది. ఉన్నత పాఠశాల మండల స్థాయిలో ఆదర్శంగా నిలిచింది. గ్రామ పరిధిలో ఉన్న గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో వందలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందుతున్నాయి. గ్రామ పరిధిలోనే నిర్మాణమవుతున్న 150 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. సర్పంచ్‌ నీలం మధు తన తల్లిదండ్రుల పేరున వచ్చిన రైతుబీమా నగదు రూ.10లక్షలు గ్రామానికి విరాళంగా అందజేశారు. జిల్లా అధికారులు చిట్కుల్‌ గ్రామ పంచాయతీని పల్లె ప్రగతి ఉత్తమ గ్రామంగా గుర్తించి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు పంపారు.

అభివృద్ధిలో పరుగులు..
పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామం పల్లె ప్రగతి అమలులో అగ్రస్థానంలో నిలిచింది. పచ్చదనం పెంపులోనూ, పారిశుధ్యం నిర్వహణలోనూ చిట్కుల్‌ ముందుంది. నర్సరీ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, డంపింగ్‌ యార్డు, పార్కులు, వాకింగ్‌ ట్రాకులు, వైకుంఠధామం ఏర్పాటుతో ప్రజలకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి వచ్చాయి. శివుడి గుట్టలో ఏర్పాటు చేసిన రాక్‌గార్డెన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పచ్చటి లాన్‌ మధ్యలో మహాశివుడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాళ్లు, రప్పలతో ఉన్న శివుడి గుట్ట ఇప్పుడు సందర్శనీయ స్థలంగా మారింది.

చిట్కుల్‌ అభివృద్ధే నా లక్ష్యం..
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో అన్ని వనరులు, మౌలిక వసతులు సమకూరాయి. హరితహారంలో వేలాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. పారిశుధ్య విషయంలోనూ రాజీ పడట్లేదు. రాక్‌గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామస్తుల సహకారం ఎప్పటికీ
మరువలేను.

  • నీలం మధు ముదిరాజ్‌, చిట్కుల్‌ సర్పంచ్‌

అందరి సహకారంతో ముందుకెళ్తున్నం…
రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అభివృద్ధి పనులను గ్రామంలో నిర్వహిస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పాలక మండలి సహకారంతో విజయవంతం చేశాం. జిల్లా అధికారుల సూచనల మేరకు హరితహారం, పారిశుధ్యం పనులు చేపట్టాం. పల్లె ప్రకృతి వనం సుందరంగా తీర్చిదిద్దడంతో జిల్లా అధికారులు ప్రశంసిస్తున్నారు. కలెక్టర్‌ స్వయంగా గ్రామాన్ని సందర్శించి పాలక మండలితో పాటు కార్యదర్శిని సత్కరించడం మేం చేసిన సేవలకు గుర్తింపుగా భావిస్తున్నాం.

  • పంచాయతీ కార్యదర్శి కవిత
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana