మెదక్ రూరల్, సెప్టెంబర్ 21: మాతా, శిశుసంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పోషకాహార ఇబ్బందులు కలుగకుండా గర్భిణులు, బాలింతలు సంతులిత ఆహారం తీసుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే వారికి గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్న భోజనం వంటివి అందజేస్తున్నారు. కాగా, పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు గుర్తించడానికి అంగన్వాడీల ఆధ్వర్యంలో ఇప్పటికే మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రోత్ మానిటరింగ్ చేశారు. వైద్యసిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ నెల 30వరకు చేపట్టే కార్యక్రమాలు
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు పరిశీలించి, వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లల ను గుర్తిస్తారు. వారికి సరైన ఆహారం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తారు. కిశోర బాలికలకు ఆరోగ్యసంబంధ అంశాలపై అవగాహన, గర్భిణులు, బాలింతలు, పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తారు. పెరటి తోటల పెంపకంపై అవగాహన, అంగన్వాడీకేంద్రాల ఆవరణలో గార్డెన్లు ఏర్పాటు, ఇంట్లో ఉండే వ్యర్థాలను వినియోగించి సేంద్రియ పద్ధతిలో పెరటి తోటల పెంకంపై అవగాహన కల్పిస్తారు. కిచెన్ గార్డెన్ ఉన్నట్లయితే కొత్త కూరగాయలు, ఆకు కూరలు, ఔషధ మొక్కలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తారు.
పిల్లల ఎత్తు, బరువులపై నివేదిక..
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తును కొలుస్తున్నారు. ఆయా వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్రోత్ మానిటరింగ్ సర్వే యాప్లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా 5 ఏండ్ల లోపు చిన్నారుల వివరాలు ఎత్తు, బరువు తెలిసే అవకాశం ఉంటుంది. తక్కువ బరువు, ఎత్తు ఉండి పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అలాగే, చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు.
చిన్నారులపై ప్రత్యేక దృష్టి..
చాలా కాలంగా ఇంటివద్దే పోషకాహారం పొందిన చిన్నారుల్లో ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకే పోషణ మాసం నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ నెలలో ప్రతి కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం, న్యూట్రీగార్డెన్ డ్రైవ్, యోగా, పోషణమేళా, ప్రదర్శన, నిర్వహిస్తున్నాం. పోషకాహార లోపం ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.