e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home మెదక్ రైతుల సేవలో వేదికలు

రైతుల సేవలో వేదికలు

  • అన్నదాతల అధ్యయన కేంద్రాలు
  • సాగు పద్ధతులను వివరిస్తున్న వ్యవసాయ అధికారులు
  • ఉమ్మడి జిల్లాలో 319 రైతు వేదికల ఏర్పాటు
  • సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణాలు
  • ఈ వేదికల్లోనే రైతుల సమావేశాలు
  • ఆకర్శణీయంగా.. చూడ చక్కని రైతు వేదికలు..
  • ఒక్కో రైతు వేదిక 2,046 చదరపు అడుగుల్లో

సిద్దిపేట, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ సర్కారు రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలను నిర్మించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 319 వేదికలు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి కాగా, ఈ వేదికల్లోనే సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రైతు వేదికలు అన్నదాతలకు అధ్యయన కేంద్రాలుగా మారుతున్నాయి. వ్యవసాయంలో నూతన సాగు పద్ధతులు.. మార్కెటింగ్‌ తదితర అంశాలను రైతులు తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఏ పంటలు వేయాలి? పంటలకు తెగుళ్లు? చీడ పురుగులు? తదితర వాటిని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. సర్కారు ఈ సారి వెద సాగును ప్రోత్సహిస్తుండగా, దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, రైతుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు.

“రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక వేదిక కావాలి.. ప్రతీ క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మించాలి.. ఆ వేదికల్లోనే రైతుల సమావేశాలు జరగాలి.. ఆ వార్త నేను వినాలి” అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 219 రైతు వేదికలను నిర్మించుకొని, వాటిలోనే రైతుల సమావేశాలు జరుపుకుంటున్నారు. రైతులకంటూ ఒక వేదిక ఉండడంతో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. వ్యవసాయంలో నూతన సాగు పద్ధతులు, మార్కెటింగ్‌, తదితర అంశాలను రైతులు తెలుసుకోగలుగుతున్నారు. తొలి రైతు వేదికను సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మిట్టపల్లిలో గత డిసెంబర్‌ 10న ప్రారంభించారు.

- Advertisement -

అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో నిర్మాణాలు పూర్తయినవి అయినట్లుగా దశల వారీగా రైతు వేదికలను మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రతి రైతు వేదికను వినియోగంలోకి తెచ్చారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికల్లో రైతుల సమావేశాలు నిర్వహించి, రైతులకు సాగు పద్ధతులను వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి వెద సాగును ప్రోత్సహిస్తుండగా, దీనిపై వ్యవసాయ శాఖ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వయంగా రైతు అవతారమెత్తి, పొలాల్లో దిగి, ‘మొలక’ను చల్లారు. రైతులు ఆ దిశగా ముందుకు కదులుతున్నారు. ఆయిల్‌ పామ్‌, మల్బరీ సాగులను ప్రోత్సహిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 319 రైతు వేదికలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మించింది. ప్రతీ క్లస్టర్‌కు ఒక ఏఈఓను నియమించింది. ఈ వానకాలం సాగు ప్రారంభమైన నాటి నుంచి రైతుల సమావేశాలు ఈ వేదికలోనే జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 127, మెదక్‌ జిల్లాలో 76, సంగారెడ్డి జిల్లాలో 116 మొత్తం 319 రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేసుకొని వినియోగంలోకి తెచ్చారు. జిల్లాకు చెందిన మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తి చేయించారు. జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు రైతు వేదికల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో నిర్మాణాలు అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగారు. ప్రస్తుతం రైతు వేదికలు రైతులకు ఎంతో మేలు కలుగుతున్నాయి. వ్యవసాయాధికారుల సమావేశాలు, రైతుల సమావేశాలు, రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఇలా రైతు వేదికలోనే జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ శాట్‌ యాప్‌ ద్వారా సాగుకు సమాయత్తం కార్యక్రమాన్ని నిర్వహించి దిశా నిర్దేశం చేస్తున్నారు.

రైతుల సమావేశాలకు అనువుగా..
సిద్దిపేట, మెదక్‌,సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రైతు వేదికలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. చినుకు పడిందంటే రైతుకు ఒక్కటే దిగులు ఉండేది. ఈ సారి ఏ పంట వేయాలో తెలియక సతమతమవుతుండే వారు. ఇవాళ రైతు వేదికలు నిర్మాణాలు చేసుకోవడం.. అక్కడ రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించి ఏ పంట వేస్తే ఎలా ఉంటుందో వివరించారు. అందుకు అనుగుణంగా ఇవాళ రైతులు సాగు బాట పట్టారు. ప్రతీ క్లస్టర్‌కు ఒక ఏఈఓను ప్రభుత్వం నియమించింది. ఈ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. క్లస్టర్‌ వారీగా నిర్మించిన రైతు వేదికల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి వ్యవసాయ సాగు పద్ధతిలో నూతన మెళకువలను తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఏ పంటలు వేయాలి? పంటలకు తెగుళ్లు? చీడ పురుగులు? తదితర వాటిని రైతులకు తెలియజేస్తున్నారు. రైతుల సమావేశాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతుబంధు సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఒక్కోరైతు వేదిక 2,046 చదరపు అడుగుల్లో..
ఒక్కో రైతు వేదికను 2,046 చదరపు అడుగుల్లో నిర్మించారు. రైతు వేదిక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.22 లక్షలు వెచ్చించారు. క్లస్టర్‌ పరిధిలోని రైతులు, రైతుబంధు సమితి సభ్యులు, గ్రామ, మండల కమిటీ కో-ఆర్డినేటర్లు అంతా ఒకే చోట కూర్కొని, చర్చించుకునేందుకు వీలుగా హాల్‌ను 1,496 చదరపు అడుగుల వీస్తీర్ణంలో నిర్మించారు. ఈ హాల్‌లో సుమారు 154 మంది వరకు రైతులు కూర్చోవచ్చు. హాల్‌తో పాటు రెండు గదులు, టాయిలెట్స్‌ నిర్మించారు. ఇందులో ఒక గదిలో వ్యవసాయ శాఖ అధికారికి కేటాయించారు. ఆ గదిలోనే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకునేలా కంప్యూటర్లు, టీవీలు ఏర్పాటు చేశారు. అవపరమైన ఫర్నిచర్‌ తదితర సౌకర్యాలను సమకూర్చారు. రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండి, నిరంతరం వారికి సూచనలు, సలహాలు, మర్కెటింగ్‌ తదితర అంశాల్లో తోడ్పాటును అందించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను రైతులకు చేరేలా చూస్తున్నారు.

చూడచక్కని రైతు వేదికలు ..
అన్నదాతకు దన్నుగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నది. రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పం. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతు ముంగిటనే కాంటాలు పెట్టి, ధాన్యం కొంటున్నది. ఇలా ఎన్నో పథకాలను ప్రశేశపెట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి జిల్లాలో నిర్మించిన రైతు వేదికలు ఎంతో చూడచక్కగా ఉన్నాయి. ఆయా క్లస్టర్లలో నిర్మించిన రైతు వేదికలను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, చెరువులు, రైతుల పంటపొలాలు, రైతు చిత్రాలు, రైతు వేదిక ఆవరణలో రైతు వనాలు, ఇలా ఎన్నో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana