e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home మెదక్ యువనేతకు హరిత కానుక

యువనేతకు హరిత కానుక

  • మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు మొక్కనాటి బహుమానం
  • నేడు ఉమ్మడి మెదక్‌ జిల్లా అంతటా ‘ముక్కోటి వృక్షార్చన’
  • మొక్కలు నాటనున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
  • పాల్గొననున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు, ప్రజలు
  • మొక్కలు నాటి ముందుగా శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి
  • సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ మెదక్‌/ సిద్దిపేట, జూలై 23:టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు ఉమ్మడి మెదక్‌ జిల్లా సిద్ధమవుతున్నది. జన్మదిన వేడుకల సందర్భంగా ‘ముక్కోటి వృక్షార్చన’ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పాల్గొని మొక్కలను నాటనున్నారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు శనివారం సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు సిద్ధమవుతున్నారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ‘ముక్కోటి వృక్షార్చన’ చేపట్టనున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున మొక్కలు నాటనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు, అభిమానులను కోరారు. మంత్రి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి 3 కోట్ల మొక్కలు నాటి మంత్రి కేటీఆర్‌కు కానుకగా ఇవ్వనున్నారు.

ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన ప్రొటెం చైర్మన్‌…
కేటీఆర్‌కు ముందస్తుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో శుక్రవారం లయన్స్‌క్లబ్‌ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.

- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో..
ముక్కోటి వృక్షార్చనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో మొక్కలు నాటనున్నారు. ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు తమ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మొక్కలు నాటనున్నారు. అందోలు-జోగిపేట మున్సిపల్‌ పరిధిలో 5వేలు, అందోలు మండలంలో 10వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. మునిపల్లి మండలంలో 30వేలు, రాయికోడ్‌లో 20వేలు, పుల్కల్‌లో 30వేలు, హత్నూరలో 20వేలు, వట్‌పల్లిలో 20వేల మొక్కలను నాటనున్నారు. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ నియోజకవర్గంలోని పోతులబొగూడ, బిజిలీపూర్‌, జోగిపేట, చౌటకూరు, కోడూరు తండా, గొంగ్లూర్‌, మునిపల్లి, బుధేరాలో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మొక్కలు నాటనున్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో మొత్తం 30వేల మొక్కలు నాటనున్నారు. నారాయణఖేడ్‌ మండలంలో 6వేలు, సిర్గాపూర్‌ మండలంలో 5వేలు, మనూరులో 6వేలు, నాగల్‌గిద్దలో 5వేలు, కల్హేర్‌లో 5వేల మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌లోని అర్బన్‌ ఫారెస్టు, కల్హేర్‌ మండలంలోని కృష్ణాపూర్‌లో మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాలరెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు పాల్గొనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 20వేలకుపైగా మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి, సదాశివపేట ముక్కోటి వృక్షార్చనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ పాల్గొని మొక్కలు నాటుతారని టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు మొక్కలు నాటనున్నారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ తదితరులు మొక్కలు నాటనున్నారు. పటాన్‌చెరు నియోకవర్గంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతోపాటు కేటీఆర్‌ అభిమానులు, పలు స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నాయి.

సిద్దిపేట జిల్లాలో…
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో శనివారం 15 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రతి మండలంలో 50వేల నుంచి లక్ష మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటేందుక గుంతలు తీసే కార్యక్రమం చేపట్టారు. హరితహరంలో భాగంగా జిల్లాలో పెద్దఎత్తున మొక్కలు నాటుతుండగా, ప్రత్యేకంగా మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజున జిల్లాలో ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.

మెదక్‌ జిల్లాలో..
మెదక్‌ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటలకు మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేస్తారు. మెదక్‌ పట్టణంలోని వివిధ వార్డుల్లో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలో ముక్కోటి వృక్షార్చనను పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాకిట సునీతాలక్ష్మారెడ్డి పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. జిల్లాలో జడ్పీ చైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతశేఖర్‌గౌడ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మెదక్‌ జిల్లాలోని 21 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో మూడు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతి గ్రామ పంచాయతీలో 500 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విరివిగా మొక్కలు నాటండి: హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌
రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలను మొక్కలు నాటి జరుపుకోవాలన్నారు. నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌, ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలన్నారు. మంత్రి కేటీఆర్‌ ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana