e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home మెదక్ మస్తుగా మత్స్యం

మస్తుగా మత్స్యం

  • చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
  • సిద్దిపేట జిల్లాలో 1472 చెరువుల్లో 4.13 కోట్లు
  • మెదక్‌ జిల్లాలో 1636 చెరువుల్లో 5.33 కోట్ల విత్తనం..
  • వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రక్రియ

మిషన్‌ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. చెరువే గ్రామానికి ఆదెరువు.. చెరువులు నిండితే వివిధ కులవృత్తుల వారికి జీవనోపాధి. మంచి పంటలు పండుతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, చెక్‌డ్యాంలు చాలా వరకు పొంగిపొర్లాయి. గోదావరి జలాలతో రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసేందుకు మత్స్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటీవల టెండర్లు సైతం పిలిచి, ఫైనల్‌ చేసే దశలో ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే చేప పిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతుంది. వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ సిద్దిపేట జిల్లాలోని 1,472 చెరువులతో పాటు రిజర్వాయర్లలో మొత్తం 4.13కోట్ల చేపపిల్లలను వదలనున్నారు. మెదక్‌ జిల్లాలో 1,636 చెరువుల్లో 5.33 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

సకాలంలో వర్షాలు..
నిండుకుండలా జలవనరులు సకాలంలో మంచి వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు గోదావరి జలాలతో నిండుకుండలా మారాయి. సిద్దిపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో చేపలు పెంచి, నీలి విప్లవాన్ని సృష్టించనున్నారు. అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా ఉన్న సిద్దిపేట జిల్లాను చేపల పెంపకంలోనూ రాష్ట్రానికి ఆదర్శంగా మార్చి మత్స్య, ముదిరాజ్‌, చేపల పెంపకందారుల జీవితాలకు జవసత్వాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. కొద్ది రోజులుగా చెరువులు, చెక్‌డ్యాంల్లో వర్షం నీళ్లు వచ్చి చేరడంతో అవన్నీ ఇవాళ పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చెరువుల్లో చేపపిల్లలు వదులాలని మత్స్యశాఖ అధికారులకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు జిల్లా మత్స్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో చేప పిల్లలను వదులడానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో జిల్లాలో నిండిన చెరువుల్లో చేప పిల్లలను వదిలే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలో 2020-21వ ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 1,352 చెరువులతో పాటు రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ, తపాస్‌పల్లి, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్లలో మొత్తం 3 కోట్ల 72 లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ చేపలతో 17,745 టన్నుల చేపల ఉత్పత్తి వచ్చింది. వీటిలో ప్రధానంగా రొయ్య, బొచ్చరవ్వ, బంగారుతీగ, మ్రిగాల్‌ జాతికి చెందిన చేపపిల్లలతో పాటు ఇతర జాతికి చెందిన చేపలున్నాయి.

- Advertisement -

సిద్దిపేట జిల్లాలో 4.13కోట్ల చేపపిల్లలు..
సిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది 1,472 చెరువులతో పాటు రంగనాయక, కొండపోచమ్మ, తపాస్‌పల్లి, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్లతో పాటుగా శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులో మొత్తం 4.13కోట్ల చేపపిల్లలను వదిలేందుకు ఇటీవల టెండర్లను పిలిచారు. ఈ ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికారులున్నారు. నాలుగేండ్ల నుంచి జిల్లాలో చేపపిల్లల వదిలిన వివరాలు చూస్తే 2017-18లో 1,448 చెరువు, కుంటల్లో 3.08కోట్లు, 2018-19లో 1,446 చెరువులు, కుంటల్లో 3.30కోట్లు, 2019-20లో 780 చెరువుల్లో 2.48కోట్లు, 2020-21లో 1,352 చెరువులతో పాటు రంగనాయక రిజర్వాయర్‌, కొండపోచమ్మ, తపాస్‌పల్లి, తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్లలో మొత్తం 3.72కోట్ల చేపపిల్లలు వదిలారు. ఈ జిల్లాలో 278 మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో మొత్తం 20,351 మంది సభ్యులున్నారు. చేపపిల్లలను వదులడంతో వీరికి ఎంతో ఉపాధి దొరుకుతుంది. ఈ సంఘాలను బలోపేతం చేసి వందశాతం రాయితీపై జిల్లాలో చేపల పెంపకాన్ని చేపట్టారు. భారీ ఎత్తున చేపలు పెంచడంతో పాటు వాటిని మత్స్యకారులు అమ్ముకునేలా సిద్దిపేట, గజ్వేల్‌, తొగుట, హుస్నాబాద్‌, దుబ్బాక, దౌల్తాబాద్‌, చేర్యాలలో చేపల మార్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చేపలను ఎప్పటికప్పుడు అమ్ముకునే వీలు కల్పించింది. దీంతో మత్స్యకారులు తమ ప్రాంతాల్లోనే చేపలు విక్రయించే ఏర్పాట్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తున్నది.

కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌లోకి చేపపిల్లలు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్లు మత్స్యకారులకు వరమైంది. గోదావరి జలాలతో మొన్నటి వేసవిలో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలను నింపారు. గోదావరి జలాలతో పాటుగా ఈ సారి వర్షాలు కూడా సకాలంలో కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నిండడంతో కొన్ని ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్నాయి. ఏడాది పొడవునా నీళ్లు ఉండనున్నాయి. మత్స్యకారులకు చేతినిండా పని ఉండనున్నది. జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా, ఈ రిజర్వాయర్‌లో 14 లక్షల 35 వేల చేపపిల్లలను వదులనున్నారు. రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ 3 టీఎంసీల సామర్థ్యం కాగా, ఈ రిజర్వాయర్‌లో 13 లక్షల 20 వేల చేపపిల్లలను విడుదల చేసేందుకు మత్య్సశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో లక్షా 78 వేలు, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టులో 9లక్షల 88వేల చేపపిల్లలను వదులనున్నారు. ము ఖ్యంగా పెద్ద చెరువుల్లో 2కోట్ల 43లక్షల చేపపిల్లలు, చిన్న చెరువుల్లో కోటీ 70లక్షలు చేపపిల్లలను వదులుతారు. పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో కట్ల, రవ్వ, మ్రిగాల జాతికి చెందిన 80ఎంఎం నుంచి 100ఎంఎం సైజు ఉ న్న పిల్లలు, చిన్న చెరువుల్లో 35ఎం ఎం, 40ఎంఎం సైజు కలిగిన కట్ల, రవ్వ, బంగారు తీగ, బొచ్చలను వదులుతారు.

మెదక్‌ జిల్లాలో..
మెదక్‌ జిల్లాలో 270 మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో 15,700 మంది సభ్యులున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 1,636 చెరువుల్లో 5.33 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ జిల్లాలో చాలా వరకు చెరువులు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. వనదుర్గ, పోచారం పాజెక్టులు నిండాయి. హల్దీవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు నిండాయి. ఈ జిల్లాలో గతేడాది 1211 చెరువుల్లో 4.23 కోట్ల చేపపిల్లలను వదిలారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana