e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home మెదక్ దాశరథి కలలు సాకారం

దాశరథి కలలు సాకారం

దాశరథి కలలు సాకారం
  • నాడు రాష్ట్రంలో కరువు కాటకాలు.. నేడు పసిడి పంటలు
  • దాశరథి ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అంటే.. నేడు సీఎం కేసీఆర్‌ ‘నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణంగా మార్చారు..
  • ధాన్యం దిగుబడిలో దేశంలోనే రాష్ర్టానికి మొదటి స్థానం
  • త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం
  • ఇకపై ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • దాశరథి జయంతి ఉత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్‌, జూలై 22 : నాడు కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లిన తెలంగాణ… నేడు పసిడి పంటల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దాశరథి కృష్ణమాచార్యులు జయంతి ఉత్సవాల్లో సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుస్తక పఠనంతో సమాజంపై అవగాహన వస్తుందని, ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందన్నారు. ప్రతి మనిషి నిత్య విద్యార్థే అన్నారు. మంచి పద్యాన్ని, కవిత్వాన్ని, గేయాన్ని వింటున్నప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుందన్నారు. దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల గురించి, భూస్వాముల పరిపాలన గురించి, పేదల కోసం ఒక కవిగా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడారని కొనియాడారు.

దాశరథి పీడిత ప్రజల పక్షాన పోరాడి జైల్లో కఠిన శిక్షలు అనుభవించారని, జైలు గోడల మీద బొగ్గుతో పద్యాలు రాసి స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం పోరాడారన్నారు. దాశరథి కలలు కన్న తెలంగాణ నేడు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ముందుకెళ్తుందన్నారు. దాశరథి రాసిన ఆ చల్లని సముద్ర గర్భం… అనే పాట సీఎం కేసీఆర్‌కు చాలా ఇష్టమని, సమయం దొరికినప్పుడు పాడి వినిపిస్తారన్నారు. ఒక నాడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, మత్తళ్లు దూకుతున్న చెరువులు, ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుందని తెలిపారు. దాశరథి కలలు కన్న తెలంగాణను నేడు సీఎం కేసీఆర్‌ నిజం చేశారన్నారు. నాడు దాశరథి ‘నా తెలంగాణ..కోటి రతనాల వీణ’ అంటే.. నేడు సీఎం కేసీఆర్‌ ‘నా తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణి’గా మార్చారన్నారు. కోటి 25 లక్షల ఎకరాల పంట పండే విధంగా తెలంగాణ మారిందన్నారు. 3 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. పేదరికం, అస్పృశ్యత తొలగించాలనే ఉద్దేశంతో ‘దళితబంధు’ అనే పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అన్నివర్గాల ప్రజలను కాపాడుకుంటూ, కుల వృత్తులను ప్రోత్సహిస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచే విధంగా ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు.

- Advertisement -

ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం..
త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ ధృడ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 64 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించి భర్తీ చేసినట్లు తెలిపారు. ఇక నుంచి ఏటా క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు అవగాహన లేకుండా ఖాళీల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వివిధ కారణాలతో అన్ని రకాల ఖాళీలు ఒకే రకంగా ఉండవని, కొన్ని ఉద్యోగాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ అయితే, కొన్ని ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారని తెలిపారు. త్వరలోనే వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వస్తున్నందున, రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ను మంత్రి కోరారు. దానికి అవసరమైన సహాయ సహకారాలు ఆర్థిక శాఖ తరపున అందిస్తానన్నారు. అనంతరం గ్రంథాలయ అభివృద్ధి కోసం శాశ్వత సభ్యత్వాలను పొందిన సభ్యులకు సభ్యత్వ కార్డులను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషావేత్త్త నలిమెల భాస్కర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, ఏఎంసీ చైర్మన్లు పాల సాయిరాం, రాగుల సారయ్య, కాముని శ్రీనివాస్‌, వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు రంగాచారి, అంజయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

దాశరథి సాహసి: దేశపతి శ్రీనివాస్‌
ఈ సందర్భంగా సీఎం ఓఎస్‌డీ, కవి దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దాశరథి కవిత్వం చాలామంది కవులకు ప్రేరణ కలిగించిందని, తెలంగాణ చారిత్రక అస్థిత్వాన్ని తెలుగు సాహిత్యంలో అత్యద్భుతంగా ప్రతిష్టించిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు అని అన్నారు. ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అనే అద్భుతమైన వ్యాక్యం తెలంగాణకు ఇచ్చిన వ్యక్తి దాశరథి అన్నారు. జైల్లో శిక్షను అనుభవిస్తూ జైలు గోడల మీద బొగ్గుతో ఈ వ్యాక్యాలు రాశాడని గుర్తుచేశారు. నిజాం రాజును సాహసికంగా తన కవిత్వంతో ప్రశ్నించారన్నారు. ఈ సందర్భంగా దాశరథి రాసిన పలు కవితలు, గేయాలను, గీతాలను పాడి ఆలపించారు.

ఉద్యమాల గడ్డ సిద్దిపేట : అయాచితం శ్రీధర్‌
అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ.. కవులు, కళాకారులు, ఉద్యమాలకు పుట్టినిల్లు సిద్దిపేట గడ్డ అన్నారు. ఆరు దశాబ్దాల కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారన్నారు. సొంతింటిని ఎలా నిర్మించుకుంటామో, అంత మంచిగా జిల్లా గ్రంథాలయ సంస్థ భవనాన్ని నిర్మించడానికి మంత్రి హరీశ్‌రావు చాలా కృషి చేశారన్నారు.

ఆయిల్‌పామ్‌ తోటలను ప్రోత్సహిద్దాం

జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల పెంపకాన్ని ప్రోత్సహిద్దామని, సెరికల్చర్‌ – మల్బరీ తోటలు, వరి వెదసాగు లక్ష్యమేర సాగుచేసేలా పనిచేద్దామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రం సిద్దిపేటలోని తన నివాసంలో గురువారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురస్తున్నాయన్నారు. ఇప్పటికే 1.20 లక్షల ఎకరాల వరిసాగుచేశారని, అదనంగా మరో లక్ష ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ వానకాలంలో 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటి వరకు 1100 ఎకరాల్లో రైతులు ప్లాంటేషన్‌ కోసం డీడీలు తీసి ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు తెలిపారు.

సెరికల్చర్‌ జిల్లాలో 1100 ఎకరాల్లో చేపడుతున్నారని, మరో 400 ఎకరాల్లో చేపట్టాలని, రాయితీ వివరాలు తెలిపి రైతులను ప్రోత్సహించాలని ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి సూచించారు. సహకార, ఆగ్రో కేంద్రాల ద్వారా నేరుగా గ్రామాలకు ఎరువుల పంపిణీ జరుపాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆగస్టు నెలాఖరులోపు కంది పంట వేసుకునే అవకాశం ఉందని, ఇప్పటికే జిల్లాలో 40వేల ఎకరాల్లో పంట వేశారని, మరో 10 వేల ఎకరాల్లో కంది సాగుచేసేలా వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతుబంధు సమితి నాయకులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. పంటల నమోదు కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలన్నారు. జిల్లాలో 11 మంది వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్లకు పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చామన్నారు. డిసెంబర్‌ నాటికి 5 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు పెంపు సాగు లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ సురేందర్‌రెడ్డిని ఫోన్‌లైన్‌లో మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌, వ్యవసాయ అధికారులు పరమేశ్వర్‌, గీత, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దాశరథి కలలు సాకారం
దాశరథి కలలు సాకారం
దాశరథి కలలు సాకారం

ట్రెండింగ్‌

Advertisement