e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు..

జిల్లాలో విస్తారంగా వర్షాలు..

జిల్లాలో విస్తారంగా వర్షాలు..
  • జోరుగా ఎవుసం పనులు
  • లాగోడికి అక్కరకొచ్చిన రైతుబంధు డబ్బులు
  • ప్రభుత్వ సూచనల మేరకు పత్తి, కంది పంటలు సాగు చేస్తున్న రైతులు
  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 6,07,833 ఎకరాల్లో పత్తి సాగు
  • వరి వెద సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు
  • ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో సాగు

సిద్దిపేట, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వానకాలం సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వరినాట్లు జోరందుకున్నాయి. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలకు చెరువులు, చెక్‌డ్యాంలు నిండి మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద వస్తున్నది. రైతుబంధు డబ్బులు ముందే చేతికి అందడంతో రైతులకు లాగోడికి ఇబ్బందిలేకుండా పోయింది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోషంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. ప్రభుత్వ సూచన మేరకు రైతులు ఈ వానకాలంలో వరి, పత్తి, కంది, పెసర తదితర పంటలను సాగుచేస్తున్నారు. వరి నాట్లతో పాటు పత్తి ఇతర పంటల కలుపుతీత పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సిద్దిపేట జిల్లాలో…
బుధవారం వరకు సిద్దిపేట జిల్లాలో అన్నిరకాల పంటల కలిపి 2,84,113 ఎకరాల్లో సాగుచేశారు. వీటిలో వరి సాగు 53,256 ఎకరాలు, మొక్కజొన్న 56,459 ఎకరాలు, పత్తి 1,45,193 ఎకరాలు, కంది 28,444 ఎకరాలు, ఇతర పంటలు 761 ఎకరాల్లో వేశారు. ఆగస్టు రెండోవారం వరకు వరినాట్లు వేయనున్నారు. వెదజల్లే పద్ధ్దతి, డ్రమ్‌సీడర్‌ ద్వారా 3వేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు.

- Advertisement -

మెదక్‌ జిల్లాలో…
మెదక్‌ జిల్లాలో వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,19,475 ఎకరాల్లో సాగుచేశారు. 36,525 ఎకరాల్లో వరినాట్లు వేశారు. వెదజల్లే పద్ధ్దతిలో 890 ఎకరాలు, నర్సరీ దశలో (నార్లు) 91,924 ఎకరాల్లో సాగులో ఉంది. జొన్న 352 ఎకరాలు, పత్తి 69,490 ఎకరాలు, కంది 5697 ఎకరాలు, చెరుకు 309 ఎకరాలు, మక్కజొన్న 7522 ఎకరాల్లో సాగుచేశారు. 6,766 ఎకరాల్లో ఇతర పంటలను సాగుచేశారు.

సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో 6,40,288 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. వీటిలో వరి సాగులో భాగం గా నర్సరీలో (నార్లు) 84,850 ఎకరాలు, వెదజల్లే పద్ధ్దతిలో 26 ఎకరాలు, 13,518 ఎకరాల్లో నాట్లు వేశారు. జొన్నలు 3212 ఎకరాలు, కంది 94,550 ఎకరాలు, పెసర్లు 35,225 ఎకరాలు, మినుములు 14,397 ఎకరాలు, సోయాబీన్‌ 44,921, పత్తి 3,93,150 ఎకరాల్లో, చెరుకు 17,890 ఎకరాలు, మొక్కజొన్న 20,012 ఎకరాలు, ఇతర పంటలు 3,384 ఎకరాల్లో సాగు చేశారు.

ఉమ్మడి జిల్లాలో 6,07,833 ఎకరాల్లో పత్తి సాగు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వానకాలంలో ఇప్పటి వరకు 6,07,833 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 3,93,150 ఎకరాల్లో పత్తిని సాగుచేశారు. సిద్దిపేట జిల్లాలో 1,45,193 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 69,490 ఎకరాలు సాగుచేసినట్లు వ్యవసాయశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం పత్తి కలుపుతీత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పత్తుల కలుపుతీసే పనులు పూర్తయిన చోట అడుగు మందులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వం గతేడాది నుంచి పత్తి సాగును ప్రోత్సహిస్తున్నది. ఆ దిశగా రైతులను ప్రోత్సహించడంతో ఎక్కువ శాతం మంది పత్తిని సాగుచేస్తున్నారు.

వెద సాగులో మెదక్‌ ముందుకు…
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వరిలో వెదజల్లే పద్ధ్దతిని ప్రోత్సహిస్తుండంతో చాలామంది రైతులు ఆ దిశగా సాగుచేస్తున్నారు. ఈ విధానంలో ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా సుమారుగా 4వేల ఎకరాలు సాగు చేశారు. ఈ విధానంలో రైతులకు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కలిసి వస్తున్నది.

లక్షలాది ఎకరాల్లో పంటల సాగు..
ఈ వానకాలంలో సిద్దిపేట జిల్లాలో 5,30,576 ఎకరాలు, మెదక్‌ జిల్లాలో 3,21,650 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 7,40,845 ఎకరాల్లో అన్నిరకాల పంటలు సాగుకానున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలను ఎప్పటికప్పుడు క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులు నమోదు చేస్తున్నారు.

సాగు పనులు ముమ్మరమయ్యాయి..
వానకాలం సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో వెదజల్లే పద్ధతిలో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా మూడు వేల ఎకరాల వరకు సాగు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు అన్ని రకాల పంటలు కలిపి 2,84,113 ఎకరాల్లో సాగు చేశారు. వరి నాట్లు ముమ్మర మయ్యాయి. జిల్లాలో పత్తి పంటలను రైతులు బాగానే సాగు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని క్లస్టర్లలో తమ వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సేవలను అందిస్తున్నారు. రైతాంగానికి అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉంచారు. ప్రతి రైతు వేదికలో రైతుల సమావేశాలను నిర్వహిస్తున్నాం.
-శ్రావణ్‌కుమార్‌ (సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లాలో విస్తారంగా వర్షాలు..
జిల్లాలో విస్తారంగా వర్షాలు..
జిల్లాలో విస్తారంగా వర్షాలు..

ట్రెండింగ్‌

Advertisement