e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home మెదక్ గజ్వేల్‌లో క్రీడాహబ్‌

గజ్వేల్‌లో క్రీడాహబ్‌

  • 20 ఎకరాల్లో ఏర్పాటుకు స్థల పరిశీలన
  • రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఆడేలా గజ్వేల్‌ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్నది సీఎం ఆకాంక్ష
  • ముందుగా ఫుట్‌బాల్‌ అకాడమీ ఏర్పాటు
  • ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి

గజ్వేల్‌, జూలై 23: గజ్వేల్‌లో క్రీడాహబ్‌ ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసినట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం గజ్వేల్‌ పట్టణంలోని రింగురోడ్డు సమీపంలో, మినీ స్టేడియం పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ అన్వర్‌తో కలిసి క్రీడాహబ్‌ ఏర్పాటుకు పరిశీలించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ యువతీయువకులకు చక్కని విద్యనందించడానికి మహిళ, బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌లను నిర్మించారని, స్థానిక యువతీయువకులను అన్ని క్రీడల్లోనూ నైపుణ్యవంతంగా తీర్చిదిద్దడానికి 20 ఎకరాల్లో క్రీడాహబ్‌ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. స్థానిక క్రీడాకారుల కోరిక మేరకు మంత్రి హరీశ్‌రావు క్రీడాహబ్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని, ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు క్రీడాహబ్‌ ఏర్పాటు చేయాలని విన్నవించామన్నారు.

సీఎం కేసీఆర్‌ ఇందుకు స్పందిస్తూ సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డిని వెంటనే ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అలాగే, రాష్ట్ర క్రీడలశాఖ గజ్వేల్‌లో క్రీడాహబ్‌కు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్‌ రింగురోడ్డు సమీపంలో, అలాగే మినీస్టేడియం పరిసరాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించినట్లు వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే క్రీడాహబ్‌ పనులను ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్‌ కొండపోచమ్మ ప్రాజెక్టుతో పాటు ఆలయాల అభివృద్ధితో గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని, క్రీడాహబ్‌ ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనుందన్నారు.

- Advertisement -

రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడేలా గజ్వేల్‌ క్రీడాకారులను తీర్చిదిద్దుతాం ..

  • సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి
    రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడేలా గజ్వేల్‌ క్రీడాకారులను తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్‌ ప్రాంతంలో చక్కని ప్రతిభ కలిగిన అన్ని విధాల క్రీడాకారులున్నారని, వారిలో మరింత నైపుణ్యాన్ని పెంపొందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడేలా చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ కోరిక అన్నారు. అందుకోసమే గజ్వేల్‌లో క్రీడాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులున్నారన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సాట్స్‌ ద్వారా కృషి చేస్తుందన్నారు. ఇండియా బ్యాడ్మింటన్‌ హబ్‌గా తెలంగాణ పేరు గడించిందని, 25 రాష్ర్టాలకు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు హైదరాబాద్‌లో శిక్షణ పొందారన్నారు. అలాగే, వరంగల్‌కు చెందిన నాగపురి రమేశ్‌ జాతీయ అథ్లెటిక్‌ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులు తెలంగాణలో శిక్షణ పొందినవారేనన్నారు. గజ్వేల్‌ ప్రాంత క్రీడాకారులను కూడా అదేస్థాయిలో తయారు చేయడానికి క్రీడాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొదటగా ఫుట్‌బాల్‌ అకాడమీని ఏర్పాటు చేస్తామని, తర్వాత కబడ్డీ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, హాకీ, క్రికెట్‌ తదితర కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాహబ్‌ను జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించే రీతిలో నిర్మిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేయనున్నారని, దాంతో గజ్వేల్‌ను క్రీడాహబ్‌గా మార్చడంతో పాటు క్రీడాకారుల హాస్టల్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకియోద్దీన్‌, స్థానిక కౌన్సిలర్లు బబ్బూరి రజిత, రహీం, గుంటుకు శిరీష రాజు, శ్యామల మల్లేశం, చందన రవి, విద్యారాణి శ్రీధర్‌, నాయకులు నవాజ్‌మీరా, క్రీడాకారులు కనకయ్య, గణేశ్‌, నగేశ్‌, వర్మ, శివ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana