e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home మెదక్ అటవీ మార్గంలో చిరుతల సంచారంతో వణుకు

అటవీ మార్గంలో చిరుతల సంచారంతో వణుకు

  • గుంపులుగా రోడ్డు దాటుతున్న అడవి పందులు
  • ప్రమాదాల బారిన వాహనదారులు
  • ప్రయాణంలో జాగ్రత్తలు తప్పనిసరి
  • సాయంత్రం తర్వాత అప్రమత్తత ముఖ్యం
  • మెదక్‌-రామాయంపేట, చేగుంట-వల్లూర్‌ మార్గంలో తిరుగుతున్న వన్యప్రాణులు
  • అటవీ ప్రాంత ప్రజలకు ఫారెస్ట్‌ అధికారుల హెచ్చరికలు

రామాయంపేట, జూలై 25: మెదక్‌ జిల్లాలోని పలు అటవీ ప్రాంతాల్లో ప్రమాణం ప్రమాదకరంగా మారింది. అడవి పందులు అకస్మాత్తుగా గుంపులు గుంపులుగా రోడ్డపైకి వస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా రామాయంపేట్‌-మెదక్‌ మార్గంలోని అటవీ ప్రాంతాల్లో అడవి పందులతోపాటు చిరుతలు సంచరిస్తుండడంతో సాయంత్రమైతే ఆ మార్గంలో వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. ప్రధానంగా టూవీలర్‌పై వెళ్లడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. రామాయంపేట నుంచి అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్‌, పాతూర్‌ వరకు అడవి ఉండడంతో ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటామోననే ఆందోళన కలుగుతుంది.

ప్రభుత్వ చర్యలతో..
అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండడంతో సత్ఫలితాలు ఇస్తున్నది. అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు ఉన్న అడవులు అంతరించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నది. దీంతో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతున్నది. ఇటీవల కాలంలో అడవి పందులు, చిరుతలు, దుప్పులు మెదక్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తారస పడుతున్నాయి. గత మంగళవారం మెదక్‌ జిల్లా కేంద్రం నుంచి రామాయంపేటకు వస్తుండగా వాహనదారులకు అడవి పందులు గుంపులు గుంపులుగా రోడ్డు దాటుతూ కనిపించాయి. వాటిని వాహనదారులు ఫొటోలు తీశారు. మూడు నెలల క్రితం అడవిలో చిరుత, దుప్పులు సంచరించగా, అటవీశాఖ సిబ్బందికి సీసీ కెమెరాల ఫుటేజీల్లో చిరుత ఆనవాళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

- Advertisement -

చిరుత ఆనవాళ్లను గుర్తించిన అటవీశాఖ సిబ్బంది అటవీ ప్రాంత గ్రామాలైన తొనిగండ్ల, లక్ష్మాపూర్‌, శమ్నాపూర్‌, ఝాన్సీలింగాపూర్‌ గ్రామాల ప్రజలను అలర్ట్‌ చేశారు. పశువుల కాపరులు అటవీ ప్రాంతానికి రావద్దంటూ హెచ్చరిక బోర్డులను పాతారు. గతేడాది చిరుత అడవిలో సంచరిస్తూ గ్రామ శివారులోకి వచ్చి పశువుల కొట్టాల్లో ఉన్న పశువులను ఎత్తుకెళ్లి చంపితిన్న ఘటనలు పలు జరిగాయి. మళ్లీ చిరుత ఆనవాళ్లు కనిపించడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఐదు రోజుల క్రితం చిన్నశంకరంపేట మండల ఖాజాపూర్‌ గ్రామ శివారులో చెరువులో చిరుత కళేబరం లభించడంతో సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ సిబ్బం ది అటవీ ప్రాంత గ్రామాల ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి హెచ్చరికలు చేస్తున్నారు. అడవిలోకి వెళ్లొద్దంటూ హెచ్చరిక బోర్డులు కూడా పాతారు.

వన్యప్రాణులకు అనుకూలంగా..
మూడు నాలుగు ఏండ్లుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంతాల్లో మొక్కలు, చెట్లు దట్టంగా పెరిగాయి. వన్యప్రాణులకు అనుకూలంగా వాతావరణం మారింది. వాటికి నీరు, ఆహారం దొరుకుతున్నది. ఎండకాలంలో అటవీశాఖ సిబ్బంది సాసర్‌పిట్లు ఏర్పాటు చేసి నీటిని అందిస్తూ అటవీ జంతువుల దాహం తీరుస్తున్నారు. దీంతో వాటి సంఖ్య పెరుగుతున్నది. అలాగే ప్రభుత్వం అడవి జంతువులను వేటాడకుండా, చెట్లు నరికివేతకు గురికాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటుడడంతో వన్యప్రాణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.

వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి..
అటవీ ప్రాంతాల్లో గతంలో తవ్వించిన కందకాలు వర్షాల మూలంగా పూడుకుపోయా యి. దీంతో అడవి జంతువులు రోడ్లపైకి, జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అటవీ మార్గంలో ప్రయాణించేటప్పుడు వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలి. జంతువులు రోడ్డు దాటే అవకాశం ఉంది కాబట్టి వేగంగా వెళ్లవద్దు. కందకాలను మళ్లీ తవ్విస్తాం. అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి అడవి జంతువుల సంచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాం. అడవుల్లోకి ఎవరూ వెళ్లవద్దు. ముఖ్యంగా అటవీ గ్రామ ప్రజలు, పశువుల, మేకల కాపరులు జాగ్రత్తలు వహించాలి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-నజియా తబుసుం, ఫారెస్టు రేంజర్‌, రామాయంపేట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana