e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు కరోనాకు దూరంగా దండేపల్లిలోని ఏడు గ్రామాలు

కరోనాకు దూరంగా దండేపల్లిలోని ఏడు గ్రామాలు

కరోనాకు దూరంగా దండేపల్లిలోని ఏడు గ్రామాలు

కట్టుబాట్లే అసలైన ఆయుధం
గూడేల్లో ఏ ఒక్కరికీ సోకని వైరస్‌
మాస్కులు, భౌతిక దూరం నిబంధనలు పాటింపు
కలిసొచ్చిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి
స్ఫూర్తిగా నిలుస్తున్న గిరిజన పల్లెలు

కరోనా కట్టడిలో మంచిర్యాల జిల్లాలోని పలు పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఊరూవాడా కలిసికట్టుగా సాగి వైరస్‌కు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలతో పాటు స్వీయ నియంత్రణ పాటిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాయి. ఇందులో దండేపల్లి మండలంలోని జైతుగూడ, దమ్మన్నపేట, తట్రపోషగూడెం, బిల్కుగూడెం, కంచరబాయి, సామగూడెం, నాయికపుగూడ గ్రామాలు ఉన్నాయి. కలిసికట్టుగా తీర్మానాలు చేసుకొని ముందుకు సాగగా, ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, జీవనశైలిని ఆయుధంగా చేసుకొని కరోనాను జయించిన ఈ గిరిజన పల్లెలు ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తున్నాయి.

  • దండేపల్లి, మే 21

ఎక్కడ విన్నా… ఎక్కడ చూసినా..కరోనా కన్నీటి గాథలే..పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మహమ్మారి ప్రతాపం చూపుతున్నది. కొవిడ్‌ కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అది తన పని తాను చేసుకుంటూ పోతున్నది. కానీ కొన్ని గిరిజన గూడేలకు కరోనా భయపడుతున్నది. ఊరి పొలిమేరల్లోకి వెళ్లడానికి ససేమిరా అంటున్నది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని జైతుగూడ, దమ్మన్నపేట, తట్రపోషగూడెం, బిల్కుగూడెం, కంచరబాయి, సామగూడెం, నాయికపుగూడ గామాలు కరోనాకు దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలతో మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ శభాష్‌ అనిపించుకుంటున్నాయి… – దండేపల్లి, మే 21

సమన్వయంతో నియంత్రణ..

గ్రామం తట్రపోషగూడెం(రాజుగూడ జీపీ)
కుటుంబాలు 34
జనాభా 143

రాజుగూడ జీపీ పరిధిలోని అటవీ ప్రాంతానికి అతి సమీపంలోనే తట్రపోషగూడెం ఉంటుంది. అటవీ ఉత్పత్తులపై ఆధారపడే వీరు బయటి ప్రాంతాలతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకోరు. అత్యవసర సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. గిరిజన పెద్దలు చెప్పిన కట్టుబాట్లను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమీపంలోని సంతలకు వారానికి ఒకసారి వెళ్లి అన్ని సరుకులను తెచ్చుకుంటారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటున్న మాకు స్వచ్ఛ వాతావరణమే మేలు చేస్తున్నదని, కరోనా సోకకపోవడానికి అదే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.

కఠిన నిబంధనలు అమలు..

గ్రామం దమ్మన్నపేట(మామిడిపెల్లి జీపీ)
కుటుంబాలు 70
జనాభా 280

మామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో అందరూ గిరిజనులే. కరోనా మొదటి, రెండో దశ నుంచి కఠిన నిబంధనలు అమలు చేశారు. గూడెమంతా ఏకతాటిపై వచ్చి ఊరి నుంచి బయటికు వెళ్లకుండా, బయటివారు లోనికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. గుంపులు గుంపులుగా ఒకచోట చేరకపోవడం, కూరగాయలకు, నిత్యావసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకపోవడం, ఉన్నదాంట్లో సర్దుకుపోవడం చేశారు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడం, స్నానం చేశాకనే ఇంటిలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశామని గ్రామ పటేళ్లు తెలిపారు.

బంధువులను రానివ్వట్లేదు..

గ్రామం సామగూడెం(కర్ణపేట జీపీ)
కుటుంబాలు 37
జనాభా 146

కర్ణపేట జీపీ పరిధిలో ఉన్న సామగూడెంలో అందరూ గిరిజన తెగకు చెందిన వారే. రెండు దశల్లోనూ కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. స్థానిక సర్పంచ్‌ మార్నేని రాజేశ్వరి, కార్యదర్శి సునీత ఆధ్వర్యంలో గూడెంలో శానిటైజ్‌ చేయడం, బ్లీచింగ్‌ చేయడం, ఉపాధి కూలీలకు మాస్కులు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు కొవిడ్‌ రాకుండా అడ్డుకున్నాయి. విందు, వినోదాలకు పూర్తిగా దూరంగా ఉండడం, బంధువులు ఆహ్వానించినా వెళ్లకపోవడం లాంటివి అమలు చేస్తున్నారు.

విందు, వినోదాలకు దూరం..

గ్రామం బిల్కుగూడెం(లింగాపూర్‌ జీపీ)
కుటుంబాలు 13
జనాభా 50

లింగాపూర్‌ జీపీ పరిధిలోని బిల్కుగూడెంలో నాయక్‌పోడ్‌ తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు. కొవిడ్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విందు, వినోదాలకు దూరంగా ఉంటున్నారు. ఎవరైనా విందు కార్యక్రమాలకు ఆహ్వానించినా వచ్చది లేదని తెగేచి చెబుతున్నారు. కరోనా రోగం తగ్గిన తరువాత కలుస్తామని, ఇప్పుడైతే వచ్చే పరిస్థితి లేదని తెలుపుతున్నారు. వైద్య బృందం, ఆశ కార్యకర్తలు సర్వేలకు వచ్చినప్పుడు స్పందించి ఉన్నది ఉన్నట్లు చెప్పడం, స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే జాగ్రత్త పడడంతో కరోనాకు దూరంగా ఉంటున్నామని ప్రజలు తెలుపుతున్నారు.

పల్లెవించిన క్రమశిక్షణ, ఐకమత్యం..

గ్రామం జైతుగూడ(రాజుగూడ జీపీ)
కుటుంబాలు 110
జనాభా 465

దండేపల్లి మండలంలోని రాజుగూడ జీపీ పరిధిలోని జైతుగూడ గ్రామం అడవికి దగ్గరగా ఉంటుంది. గ్రామంలో గోండ్లు, నాయకపోడ్‌, ప్రధాన్‌ పురోహిత్‌ తెగలకు చెందిన గిరిజనులు ఉంటారు. కరోనా మొదటి, రెండో దశలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజల క్రమశిక్షణ, ఐకమత్యం దరిచేరకుండా కాపాడాయి. మొదటి దశలో గూడేనికి ఎవరూ రాకుండా కంచెలు ఏర్పాటు చేసుకోవడం, కులదైవాలకు మొక్కులు చెల్లించడం, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించడం, విందు వినోదాలకు దూరంగా ఉండటం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని అవగాహన కల్పించుకోవడం వల్ల విముక్తి పొందారు. రెండో దశలో కూడా మొదటి దశ నియమాలుపాటిస్తూ రోజూ గ్రామంలో శానిటైజేషన్‌ తరచూ నిర్వహించడం, వైద్యాధికారులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివాటివి చేశామని సర్పంచ్‌ మర్సుకోల్ల లచ్చుపటేల్‌ తెలిపాడు.

జాగ్రత్తలే శ్రీరామరక్ష..

గ్రామం కంచరబాయి
కుటుంబాలు 35
జనాభా 200

మామిడిపెల్లి జీపీ పరిధిలోని కంచరబాయి గ్రామం రెండు దశల్లోనూ కరోనాను దగ్గరికి రానివ్వకుండా ఆదర్శంగా నిలుస్తున్నది. జాగ్రత్తలు పాటిస్తూ, గ్రామమంతా ఏకతాటిపై వచ్చి నిబంధనలను పాటిస్తున్నారు. కరోనా ఉధృత్తిని గమనించి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలు ఉపయోగపడ్డాయని గూడేనికి చెందిన పెద్దలు అంటున్నారు. రోగం రాకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకొని ముందుకు వెళుతున్నారు. ఇప్పటిదాక అయితే మా గూడెంలోకి రోగం రాలేదని తెలుపుతున్నారు. బయటి వ్యక్తులను ఎక్కువగా గూడెంలోకి రాకుండా కట్టడి చేస్తున్నారు.

ఆహారపు అలవాట్లు, జీవనశైలి..

గ్రామం నాయికపుగూడ(మాకులపేట జీపీ)
కుటుంబాలు 33
జనాభా 240

మాకులపేట జీపీ పరిధిలో ఉన్న నాయికపుగూడలో నాయకపుతెగకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారు. ప్రకృతి ఒడిలో పచ్చని అడవి మధ్య నివసిస్తున్న వీరిని కరోనా ఇప్పటి వరకు ఏమి చేయలేకపోయింది. రోజువారి నిత్య శ్రా మికులైన వీరి ఆహారపు అలవాట్లు, జీవనశైలి కరోనా దరి చేరకుండా కాపాడగలుగుతున్నది. మొదటి, రెండు దశల్లో అధికారుల అవగాహనతో కరోనాతో పూర్తిగా దూరంగా ఉన్నారు. అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లి, తరువాత ఇంటి పట్టునే ఉంటున్నారు. వారానికి ఒకసారి సంతకు వెళ్లి, అన్ని సరుకులు ఒకేసారి తెచ్చుకుంటున్నారు.

బయటకు పోతలేం..

గూడెం వదిలి ఎక్కడికి పోతలేం. ఇంట్ల ఉన్నయే తింటున్నాం. సామాన్లు తేవడానికి పోరగాళ్లను పంపుతున్నాం. చిన్నతనం నుంచి రాగి సంకటి, జొన్న గట్క, ఎల్లిపాయకారం తిన్నోళ్లం, మాకు కరోనా ఏం చెయ్యది. పెద్ద పెద్ద రోగాలను చూసిన. అసలే భయపడద్దు. జాగ్రత్తగా ఉంటే ఏ రోగం మనకు రాదు.

  • మడావి జంగుబాయి, జైతుగూడ

బయటికీ వెళ్తలేం..

పొద్దుగాల్నే జంగల్‌కు పోతం. పొద్దు నడినెత్తిమీదికచ్చినంక వెదురు బొంగులతో ఇంటికత్తం. ఇంత తిని వీటితో తడకలు అల్లుతం. కావాలనుకున్నోళ్లు మా గూడేనికచ్చి కొంటరు. ఇగ, బయటకెళ్లే పనేముంది. వారంవారం అంగడికి(సంతకు) పోత. ఇంట్లకు సామాను, కూరగాయలు తెచ్చుకుంటా. బయటకెళ్లినపుడు మూతికి గుడ్డ కట్టుకుంటా.

  • గుడిపెల్లి ఇందరు, నాయికపుగూడెం

జొన్న రొట్టె, అంబలి మా బలం..

కరోనా రోగం రాకుండా రెండేల్ల నుంచి జాగ్రత్త పడుతున్నాం. తొలుత నుంచి మేం ఎక్కువగా అన్నం తినం. జొన్న అంబలి, జొన్న రొట్టెనే ఎక్కువగా తింటాం. మా పెద్దలు కూడా అవ్వే ఎక్కువగా తింటరు. ఇగ రోగం రాకుండా బయట లగ్గాలకు పోతలేం. లగ్గాలు కూడా చేస్తలేం. కరోనా రోగం తగ్గినంక ఆలోచన చేస్తం. – కుమ్రం అర్జు, సామగూడెం

లగ్గాలకు పోవుడు బంజేసినం..

యేడాది సంది కరోనా రోగం ఉందని లగ్గాలకు పోతలేం. బయటోళ్లను ఎవ్వరిని రానిత్తలేం. ఏదైనా నలుగురిని పిలిచే పండుగైతే మా గూడెపోళ్లనే రమ్మంటన్నం. అదిగూడా దూరం దూరం ఉండి జేసుకుంటన్నం. గూడెం మొత్తం కట్టడి జేసుకొని ఉంటన్నం. కరోనా ఇగ మాకు ఏం చేయదని ధైర్యంగా ఉన్నం. – ఊత్కూరి భీమయ్య, దమ్మన్నపేట

గిసోంటి రోగం నా జిందగిల సూడలే..

మా ఇంటోళ్లం పొద్దంతా పొలం పనులకెళ్తం. మా పోరగాళ్లు కరోనా రోగముందట మూతికి గుడ్డ కట్టుకోవాలి. దూరం దూరం ఉండాలని అంటున్నరు. అది దగ్గరదగ్గర ఉంటే అంటుకుంటదని జెప్పిన్రు. బయమేసింది. మా గూడేపోళ్లం మూతికి గుడ్డ కట్టుకుంటన్నం. మా పటేల్‌ కూడా డప్పు సాటింపుజేపిచ్చిండు. గప్పటి సంది జాగ్రత్తగా ఉంటన్నం. గిసోంటి రోగాన్ని నా జిందగిల సూడలే.

  • కొర్వెత భీం, కంచరబాయి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనాకు దూరంగా దండేపల్లిలోని ఏడు గ్రామాలు

ట్రెండింగ్‌

Advertisement