e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు నయా నీల్వాయి

నయా నీల్వాయి

‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు
అడుగడుగునా అభివృద్ధి.. సుందరంగా ప్రకృతి వనం
పూర్తయిన డంప్‌యార్డు, రైతువేదిక, వైకుంఠధామం
100 శాతం మరుగుదొడ్లు, 472 ఇంకుడు గుంతల నిర్మాణం
రోడ్లన్నీ పరిశుభ్రం.. సీజనల్‌ వ్యాధులకు దూరం
విద్యుత్‌ దీపాల వెలుగులో కళకళలాడుతున్న వీధులు

మంచిర్యాల, జూలై 30, నమస్తే తెలంగాణ : ‘పల్లె ప్రగతి’తో నీల్వాయికి కొత్త శోభ వచ్చింది. ప్రకృతి వనం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. పారిశుధ్య కార్యక్రమాలతో వీధులన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. రైతు వేదిక, డంప్‌ యార్డు, వైకుంఠధామం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలో నిర్మాణంతో ఇబ్బందులు తొలగిపోయాయి. విద్యుత్‌ దీపాల వెలుగులో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. ప్రజల సహకారంతో సర్కారు నిర్దేశించిన కార్యక్రమాలన్నీ పూర్తి చేయగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ సహకారం, గ్రామస్తుల భాగస్వామ్యంతో మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 1980 సంవత్సరానికి పూర్వమే ఇది గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇక్కడ మొత్తం జనాభా 3,532 కాగా, 1,864మంది స్త్రీలు, 1,668 మంది పురుషులు ఉన్నారు. 809 నివాస గృహాలు కాగా, 918 కుటుంబాలు జీవిస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు, 472 వ్యక్తిగత ఇంకుడు గుంతలను నిర్మించారు. గ్రామంలో వన నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేసి సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో రెండు ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. మొత్తం 240 మొక్కలు నాటారు. వాటిలో 216 (90 శాతం) బతికి ఉన్నాయి. సీసీ రోడ్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అహర్నిశలూ కృషి చేస్తున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను సమకూర్చడంతో ప్రతి రోజూ ఇంటి నుంచి తడి,పొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో 8 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వారికి ఏడాదికి రూ.8 లక్షల 16 వేల జీతం చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతరాలకు ఒకేసారి డబ్బు చెల్లించి కొనుగోలు చేశారు. గ్రామంలో చెత్త సేకరణకు నాలుగు సైకిల్‌ రిక్షా బండ్లు ఉన్నాయి. తడి, పొడి చెత్త సేకరణ కోసం 1,618 బుట్టలు పంపిణీ చేశారు.

- Advertisement -

ఆహ్లాదకరం.. పల్లె ప్రకృతి వనం
గ్రామాల సుందరీకరణలో భాగంగా పల్లె ప్రకృతి వనం పేర ఆహ్లాదకర వాతావరణంలో పార్కును ఏర్పాటు చేశారు. బెంచీ లు, మొక్కలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. నీడనిచ్చే, పూల మొక్కలు, ఔషధ మొక్కలు తెచ్చి ప్రకృతి వనంలో ఏర్పాటు చేశారు. రోడ్డు వెంబడి వెళ్లేవారిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. వాటిని చూస్తూ, అందులో చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. పారిశుధ్య సిబ్బంది తడి,పొడి చెత్తను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తున్నారు. చెత్తను వేరు చేసే సెగ్రిగేషన్‌ (కంపోస్టు) షెడ్డును నిర్మించారు. పారిశుధ్యంలో భాగంగా గ్రామంలో నా లుగు పాడుబడ్డ బావులను కూల్చివేశారు. దహన సంస్కారాల సమస్య తీర్చేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలా న్ని గుర్తించి రూ.12.50 లక్షలతో శ్మశాన వాటికను నిర్మించారు.

రైతు వేదికలు.. మెరుస్తున్న రోడ్లు.. జిగేల్‌మంటున్న వీధిలైట్లు..
రైతులకు సమస్త సమాచారం అందించేలా రైతు వేదికలను ఏర్పాటు చేశారు. విత్తనాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షలు, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఈ రైతు వేదిక ఉపయోగపడుతున్నది. గ్రామంలో కొత్తగా సిమెంట్‌ రోడ్లను నిర్మించారు. రవాణా సౌకర్యం మెరుగుకు చర్యలు తీసుకున్నారు. రోజూ పారిశుధ్య సిబ్బంది వీధులు, మురుగుకాలువలను శుభ్రం చేయడం, చెత్తను సేకరిస్తుండడంతో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. వీధి దీపాల వెలుగుల్లో నీల్వాయి గ్రామం జిగేల్‌మంటున్నది. పల్లె ప్రగతిలో భాగంగా కొత్తగా 16 విద్యుత్‌ స్తంభాలు వేశారు. విరిగిపోయిన, వంగిన 2 స్తంభాలను తొలగించారు. 125 మీటర్ల విద్యుత్‌ లూజ్‌ లేన్లను సరిచేశారు. సుమారు 6 వేల మీటర్ల థర్డ్‌ లేన్‌ వైరును బిగించారు. ఊరిలో గతంలో 182 విద్యుత్‌ బల్బులు ఉండగా, ప్రస్తుతం 262 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. రాత్రిపూట విద్యుత్‌ దీపాల వెలుగులు పగటిని తలపిస్తున్నాయి. గతంలో రాత్రి బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడ్డ గ్రామస్తులు ప్రస్తుతం అవసరాల నిమిత్తం యథేచ్ఛగా వెళ్తున్నారు.

పచ్చదనం, శుభ్రతపై ప్రత్యేక దృష్టి..
గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. ఇంటిం టికీ మొక్కలు అందించి, నాటి సంర క్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వనంలోని పార్కును అందంగా తీర్చిదిద్దాం. మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లిస్తున్నాం. దోమల నివారణకు ఫాగింగ్‌ చేయిస్తున్నాం.

  • కొక్కుల వెంకటనారాయణ, పంచాయతీ కార్యదర్శి, నీల్వాయి

అన్ని సౌలతులూ చేసిన్రు
రోజూ పొద్దుగాల్నె పంచాయతీ సిబ్బంది రోడ్లన్నీ సాపు చేస్తున్నరు. చెత్త కోసం మైకుల్లో చెబుతున్నరు. ట్రాక్టర్ల తీసుకపోయి ఊరవతల డంప్‌యార్డుల పడేస్తున్నరు. నీళ్ల తిప్పలు లేకుంటా చేసిన్రు. రోగాలు రాకుంట పౌడర్లు చల్లిస్తున్నరు. సీసీ రోడ్లు వేసిన్రు. ఇప్పుడు మా ఊరు మస్తు మంచిగైంది.

  • అబ్దుల్‌ ఖాన్‌, గ్రామస్తుడు, నీల్వాయి

సమష్టి కృషితోనే..
గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి సహకారంతో నీల్వాయిని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాం. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాం. ఎప్పటికప్పుడు డంప్‌యార్డులకు తరలించడం, మురుగు కాలువలు శుభ్రం చేయడంవంటివి చేయిస్తున్నాం. సర్కారు నిధులతో అన్నీ సమకూర్చుకున్నాం.

  • రుద్రభట్ల స్వర్ణలత, జడ్పీటీసీ, నీల్వాయి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana