e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021

వదలని వాన..

మూడు రోజులుగా జోరుగా వర్షం
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు
పొంగి పొర్లుతున్న వాగులు, ఒర్రెలు
పలు చోట్ల రాకపోకలకు అంతరాయం

మంచిర్యాలటౌన్‌, జూలై 22 : రెండు రోజులుగా మంచిర్యాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బుధవారం మొదలైన వర్షం గురువారం రోజంతా కురియడంతో పట్టణం అతలాకుతలమైంది. పలు చోట్ల వర్షపు నీరు పెద్ద ఎత్తున ఇండ్ల మధ్యన చేరి చెరువులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడిం ది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన సీతారామ కాలనీ, బృం దావన్‌ కాలనీ, తిలక్‌నగర్‌, హమాలీవాడ, ఎన్టీఆర్‌ నగర్‌, పాతమంచిర్యాల, వడ్డెరకాలనీ, ఏసీసీ ప్రాంతాల్లో వర్షపు నీటి తో జనం ఇబ్బంది పడ్డారు. పలు వార్డుల్లో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. గోదావరి నదికి సమీపంలో ఉండే ఎన్టీఆర్‌ నగర్‌లో లోతట్టు ప్రాంతాల్లో నిర్మించుకున్న గుడిసెల్లోకి నీరు వచ్చిచేరింది. మరోవైపు రాళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
ఉప్పొంగిన చామనపల్లి వాగు
వేమనపల్లి, జూలై 22 : మండలంలోని చామనపల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమున్న వారు నెన్నెల మండలం నుంచి బెల్లంపల్లికి వెళ్తున్నారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. రైతులు కూడా ఇండ్లకే పరిమితమయ్యారు.
కోటపల్లి మండలంలో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు..
కోటపల్లి, జూలై 22 : కోటపల్లి మండలంలో వాగులు, ఒర్రెలలో వరద ప్రవాహం పెరిగింది. సరస్వతీ బ్యారేజ్‌ గేట్లు ఎత్తి వేయడంతో పాటు గోదావరి నది, ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఎదుల్లబంధం గ్రామం సమీపంలోని తుంతుంగా చెరువు మత్తడి ప్రవాహంతో నది అవతల ఉన్న పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని నక్కలపల్లికి వెళ్లే దారిలో ఉన్న లోతొర్రె ఉప్పొంగడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
సుద్దాల వాగుపై తెగిన తాత్కాలిక వంతెన..
చెన్నూర్‌ రూరల్‌, జూలై 22 : చెన్నూర్‌ మండలంలో సుద్దాల వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. కమ్మరిపల్లి, సుద్దాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కత్తరశాల, సుబ్బరాంపల్లి, సంకారంలోని వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. సుందరశాల గ్రామం సమీపంలోని సరస్వతీ (అన్నారం బ్యారేజ్‌)లో భారీగా వర్షపు నీరు చేరడంతో అధికారులు 45 గేట్లను ఎత్తి నీటిని వదిలారు. దీంతో బ్యారేజ్‌ కింద ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్‌ సీఐ ప్రమోద్‌ రావు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి నది వైపు, అన్నారం బ్యారేజ్‌ వైపు గాని ఎవరూ వెళ్ల వద్దని సూచించారు. ఇబ్బందులెదురైతే 100కు డయల్‌ చేసి, పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్‌, జూలై 22 : మండల కేంద్రంతో పాటు, అన్ని గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌, స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువ ప్రాంతం, గోదావరి పరిసరాల్లో ప్రజలెవరూ వెళ్ల వద్దని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గూడెం వద్ద గోదారమ్మ పరవళ్లు…
దండేపల్లి, జూలై 22 : దండేపల్లి మండలంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కడెం ప్రాజెక్టు నుంచి 16 గేట్లు ఎత్తేయడంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది. గూడెం గోదావరికి పవిత్ర స్నానాలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గుడిరేవు వద్ద గోదావరి వద్ద స్థానికులకు 15కిలోల భారీ చేప చిక్కింది.
తెగిన ముత్యంపేట-రెబ్బెన్‌పెల్లి తాత్కాలిక రోడ్డు..
ముత్యంపేట-రెబ్బెన్‌పెల్లి తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో గతేడాది తాత్కాలిక రోడ్డను ఏర్పాటు చేశారు.
ఎడతెరిపి లేని వర్షం
కన్నెపల్లి : కన్నెపల్లి, భీమిని మండలాల్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారాయి. వర్షంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేదు.
ఇండ్లల్లోకి చేరిన వరద..
జన్నారం, జూలై 22: మండల కేంద్రంలో పొనకల్‌ వాగు ఉప్పొంగడంతో బుడుగజంగాల కాలనీలోని ఇండ్లల్లోకి నీరు చేరింది. పొనకల్‌ సర్పంచ్‌ జక్కు భూమేశ్‌, ఎంపీవో రమేశ్‌ పరామర్శించి వారిని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు. తిమ్మాపూర్‌లోని చెరువులో వరదనీరు ఎక్కువగా చేరడంతో దాని పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో వరదనీరు వచ్చి చేరే ప్రమాదం ఉన్నందున సర్పంచ్‌ జాడి గంగాధర్‌ జేసీబీతో కాలువను తీయించి కాలనీకి రాకుండా చర్యలు తీసుకున్నారు.
కొత్తపేట చెరువుకు గండి..కొత్తపేట చెరువుకు గండిపడింది. వరద పొలాల్లో నుంచి ప్రవహించడంతో విద్యుత్‌ మోటర్లు కొట్టుకుపోయినట్లు సర్పంచ్‌ లావణ్య తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం…
కాసిపేట, జూలై 22 : మండలంలో గురువాపూర్‌ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగులో నీటి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మారావుపేట చెరువు తూము పక్కన పెద్ద గుంత పడిందని, కట్ట తెగే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కోమటిచేను సల్పాలవాగు ప్రాజెక్ట్‌ కాలువ నీరు రోడ్డుకు ఆనుకొని ఉన్న పొలాలకు చేరడంతో నీట మునిగాయి.
మత్తడి దుంకిన నస్పూర్‌ ఊరచెరువు
సీసీసీ నస్పూర్‌, జూలై 22 : సీసీసీ నస్పూర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డ్రైనేజీలు, కాలువల్లోని వరద రోడ్లపై ప్రవహించింది. నస్పూర్‌ సీతారాంపల్లి చెరువు మత్తడి దుంకింది. సీతారాంపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న రోడ్‌ డ్యామ్‌ వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది.
నాలుగు గ్రామాలకు నిలిచిన రాక పోకలు
నెన్నెల, జూలై 22 : నెన్నెల సమీపంలోని లంబాడీతండా వద్ద ఎర్రవాగు వరద ప్రవహించడంతో కల్వర్టు పై నుంచి రాక పోకలు నిలిచిపోయాయి. దీంతో నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. జంగాల్‌పేట పంచాయతీలోని దమ్మిరెడ్డిపేట గ్రామస్తులు ఎటూ వెళ్లకుండా వాగులు ఉప్పొంగుతున్నాయి. లంబాడీతండా, మన్నగూడెం, జంగాల్‌పేట, కోనంపేట గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయినవి. మండలంలో 34 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తెలిపారు.
మందమర్రి మున్సిపాలిటీలో..
మందమర్రి జూలై 22 : మందమర్రి మున్సిపాలిటీలో పలు కాలనీలలో గల రోడ్లు బురదమయమయ్యాయి. మార్కెట్‌, పాత బస్టాండ్‌, యాపల్‌, అంగడిబజార్‌, పాలచెట్టు ఏరియాలోని దుకాణాలు వెలవెల బోయాయి. సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులకు గురయ్యారు.
శ్రీరాంపూర్‌ ఓసీపీలో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం
శ్రీరాంపూర్‌, జూలై 22: శ్రీరాంపూర్‌ ఓసీపీలో బుధవారం, గురువారం 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. శ్రీరాంపూర్‌ ఓసీపీపై నిల్వ ఉన్న బొ గ్గు నిల్వలు 7500 వేల టన్నుల బొగ్గును గురువారం జైపూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి తరలించారు. ఓసీపీ మట్టి తవ్వకం తరలింపు పనులు నిలిచిపోయాయి. రోజుకు 80 వేల క్యూ బిక్‌ మీటర్ల మట్టి(ఓబీ) రవాణాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాలతో ఓసీపీ క్వారీలోకి వాహనాల రాక పోకలు పూర్తిగా స్తంభించి పోయాయి. దీంతో కార్మికుల ఓసీపీలో పూర్తి స్థాయి మెయింటనెన్స్‌ పనులకే పరమితమయ్యారు. ఉపరితలంలోని బొగ్గు నిల్వలు కూడా పూర్తిగా అయిపోయాయి.
కేకే ఓసీలో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం..
మందమర్రి రూరల్‌, జూలై 22 : వరుసగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. 16వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి 1లక్ష, 80వేల టన్నుల మట్టితీత పనులకు ఆటంకం కలిగిందని ఓసీ ప్రాజెక్టు అధికారి రమేశ్‌ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement