లెండి.. మేల్కోండి!

- నేడు వివేకానందుడి జయంతి
- ఇది ఉరుకుల పరుగుల జీవితం
- ప్రణాళికతో వెళ్తేనే బంగారుమయం
ఓ యువతా లెండి.. మేల్కోండి. గమ్యం చేరే వరకూ విశ్రమించకండి. ఉరకలు వేసే వయసులో.. పరుగులు తీసే మనసుతో ఉన్నతమైన లక్ష్యం కోసం పరుగెత్తండి. ఎన్ని ఓటములెదురైనా, మరో గెలుపు కోసం లేచి నిలబడండి. విశ్వాంతరాళాన్ని ఛేదించే మేధస్సుతో అద్భుతాలు సృష్టించండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి..
సోదర సోదరీమణులారా.. స్వామి వివేకానందుడు అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ‘సోదర సోదరీ మణులారా’ అనే సంబోధనతో ఆయన ప్రారంభించిన ప్రసంగం పాశ్చాత్య ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. అమ్మ మార్గదర్శకత్వంలో అంతులేని జిజ్ఞాసతో ఆధ్యాత్మిక మర్మాలను ఆకళింపు చేసుకుని, స్వామి వివేకానందగా ఎదిగాడు. ‘మనుషులను తీర్చిదిద్దడమే నా పని’ అని ప్రకటించి, మనుషులను తీర్చిదిద్దే పనికే తన జీవితాన్ని అంకితం చేశాడు. ‘ప్రపంచమే పెద్ద వ్యాయామశాల. మనల్ని మనం మరింత దృఢంగా తీర్చిదిద్దునేందుకు ఇక్కడకు వచ్చాం’. అంటూ మానవ జన్మ ప్రయోజనాన్ని ఉద్బోధించిన మహనీయుడు. యువశక్తిపై అపారమైన విశ్వాసం గల ఆయన తన బోధనలతో యువకుల్లో నూతనోత్సాహాన్ని నింపాడు. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం, 1995 నుంచి వివేకానందుడి జయంతిని ‘జాతీయ యువజన దినోత్సవం’గా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా నిలుస్తున్న ‘యువతరం’పై ప్రత్యేక కథనాలు..
మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ప్రధానమైనవి. వీటిలో యవ్వనం చాలా కీలకమైనది. ఉక్కు నరాలు.. ఇనుప కండరాలు.. విశ్వాంతరాళాన్ని ఛేదించే మేధస్సు యవ్వనానిది. అందుకే ‘యువతరం’ అన్నారు. కడలి అడుగును స్పృశించాలనీ, నింగిని తాకి పరవశించాలనే తపన ఈ తరానిది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి వారిది. ఇలాంటి విలువైన వయసులో సక్రమంగా పయనిస్తే భవిష్యత్ బంగారు మయమవుతుంది. లేకుంటే అయోమయంగా మారుతుంది. ఇలాంటి యువత సన్మార్గంలో పయనించాలని దిశానిర్దేశం చేసిన మహానుభావుడే స్వామి వివేకానంద.
మంచిర్యాల అర్బన్/ఆసిఫాబాద్ జన్కాపూర్/బెల్లంపల్లి టౌన్, జనవరి 11
బీకాం చదివి.. సాగు బాట..
ఆసిఫాబాద్ జన్కాపూర్, జనవరి 11 : ఆసిఫాబాద్ మండలం రాజూరకు చెందిన లొనారె ధర్మయ్య-సావిత్రీబాయి దంపతుల కుమారుడు ఈశ్వర్ బీకాం పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే సాగుబాట పట్టాడు. తమకున్న 15 ఎకరాల భూమిని జీవనాధారంగా చేసుకున్నాడు. నాలు గేళ్లుగా నూతన పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. 12 ఎకరాల్లో పత్తితోపాటు అంతర పంటగా కంది వేస్తున్నాడు. ఎకరాకు 10-15 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నాడు. ఎకరాకు పెట్టుబడి రూ.20 వేలు పోగా, రూ.35 వేల వరకు ఆదాయం వస్తున్నది. కందులు 20 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. పెట్టుబడికి రూ. 40 వేలు పోగా, రూ.80 వేల వరకు ఆదాయం వస్తున్నది. మిగతా రెండు ఎకరాల్లో కూరగాయలు, ఎకరంలో మక్క వేశాడు. కూరగాయలతో నెలకు రూ.15 వేలు, మక్క పంట ద్వారా రూ. 5వేల వరకు లాభం వస్తుందని తెలిపాడు.
గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి..
సోన్, జనవరి 11 : నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్లలో 2016లో తొమ్మిది మంది సభ్యులు సేవా సంఘం ఏర్పాటు చేశారు. యువతకు విజ్ఞానాన్ని అందించేందుకు గ్రంథాలయాన్ని నెలకొల్పారు. రోజూ దినపత్రికలతోపాటు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచారు. నిరుద్యోగ యువతీయువకులకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రెండేండ్ల నుంచి కుట్టు మిషన్, ఎలక్ట్రీషియన్ వంటి శిక్షణను అందిస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరిస్తున్నారు.
సంపాదన కొంత పేదలకు..
మంచిర్యాల అర్బన్, జనవరి 11 : తన సంపాదనలో కొంత మొత్తాన్ని ప్రతి నెలా సమాజ సేవకు వెచ్చిస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నాడు నార్ల మహేందర్స్వామి. ఈయన స్వగ్రామం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి. పాఠశాల స్థాయి నుంచే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అప్పుడే ఎన్సీసీ కెడెట్‌గా పర్యావరణ రక్షణ, దేశభక్తి కార్యక్రమాల్లో పాలుపంచుకునేవాడు. తన బతుకుదెరువు కోసం తండ్రి సహాయంతో అంబులెన్స్‌ను కొనుగోలు చేసిన మహేందర్.. వీలైనంత వరకు పేద వారికి లోకల్‌గా ఉచిత సేవలు అందిస్తుంటాడు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి పట్టణాలకు పేద రోగిని తరలిస్తే కేవలం పెట్రోల్ చార్జీలు మాత్రమే తీసుకుంటాడు.
శభాష్.. నరేశ్..
ఆసిఫాబాద్ జన్కాపూర్, జనవరి 11 : ఆసిఫాబాద్ మండలం రాజూరకు చెందిన లొకండే కుమార్-ప్రేమ దంపతుల రెండో కుమారుడు నరేశ్ డిగ్రీ (కామర్స్) పూర్తి చేశాడు. సమయం వృథా చేయడం ఎందుకని తమకున్న తొమ్మిదెకరాల్లో సా గు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏడున్నర ఎకరాల్లో పత్తి వేస్తున్నాడు. ఎకరాకు 10-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, ఎకరాకు ఖర్చులకు పోను రూ.35 వేల వరకు ఆదాయం వస్తుందని నరేశ్ చెబుతున్నాడు. అలాగే రెండు ఎద్దులు, ఆవు, లేగదూడ ఉందని, వాటి మేత కోసం ఎకరన్నరలో జొన్నలు సాగు చేస్తున్నట్లు తెలిపాడు. ఖాళీ సమయాల్లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
సమాజానికి ‘చేయూత’
కడెం, జనవరి 11 : నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమ ద్దిపడగలో దాదాపు 40 మంది యువకులు పేదలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శం గా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు 2011, సెప్టెంబర్ 17న 20 మంది యువకులతో ‘చేయూత’ యువజన సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంఘం అభివృద్ధి కోసం ప్రతినెలా చిట్టీలను కొనసాగి స్తూ, జమ చేసిన డబ్బులను ఆపదలో ఉన్న వారికి సహా యం చేస్తున్నారు. శ్రమదానం చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేయడం, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో క్రీడా స్ఫూర్తిని నిలపడం చేస్తున్నారు.
వివేకానందుని ఆశయాలతో..
నిర్మల్ టౌన్, జనవరి 11 : నిర్మల్ పట్టణంలోని గాంధీచౌక్‌కు చెందిన మిత్రులందరూ కలిసి 2005లో వివేకానంద సేవా సమితిని ఏర్పాటు చేసుకున్నారు. పాఠకుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఏటా పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు అందజేస్తున్నారు. అవగాహన ర్యాలీలు, 2కే రన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరికి అధ్యక్షుడిగా కూన రమేశ్‌తో పాటు 20 మంది సభ్యులు పని చేస్తున్నారు.
ఆకలి తీర్చే అన్న ఉస్మాన్..
బెల్లంపల్లి టౌన్, జనవరి 11 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ తెలంగాణ బేకరీ నిర్వాహకుడు ఎస్కే ఉస్మాన్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తనకున్నదాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. తన బేకరీ వద్ద ప్రతి గురువారం యాచకులు, అనాథలకు అన్నం పెడుతున్నాడు. వికలాంగులకు చేతికర్రలు, పేద వృద్ధులకు దుప్పట్లు, స్వెట్టర్లు అందించడం చేస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు అందించాడు.