కాళేశ్వరం జలం..కర్షకుడికి ఫలం

- లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
- పూర్తయిన డీపీఆర్ క్షేత్రస్థాయి సర్వే, అధికారులతో విప్ సుమన్ సమీక్ష
- బీడువారిన భూములకు త్వరలోనే జలసిరి
- పెరగనున్న మత్స్య సంపద.. పర్యాటక కేంద్రంగా అవకాశాలు
- ఆనందంలో అన్నదాతలు, ప్రజలు
చెన్నూర్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కాళేశ్వరం జలాలను ఎత్తిపోతల ద్వారా తెచ్చి, బీడుభూములకు జలసిరి అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్ సర్వే పనులు పూర్తవగా, ఎప్పటికప్పుడు నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో అన్నదాతలకు మంచిరోజులు రానుండగా, సాగుకు మహర్దశ పట్టనుంది. మత్స్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు పర్యాటక ప్రాంతంగా మారేందుకు దోహదపడనుంది.
చెన్నూర్, జనవరి 10 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. నియోజకవర్గానికి చుట్టూ ఆనుకొని గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై మేడిగడ్డ (లక్ష్మీ), అన్నారం(సరస్వతీ), సుందిళ్ల(పార్వతీ) బరాజ్‌లను నిర్మించడంతో గోదావరి, ప్రాణహిత నదుల బ్యాక్ వాటర్‌తో ఏడాదంతా నీటితో నిండుగా కళకళాడుతున్నాయి. ఈ బరాజ్‌ల బ్యాక్‌వాటర్ ద్వారా నియోజకవర్గంలోని లక్షకుపైగా ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంకల్పించారు. తాను అనుకున్నదే తడువుగా తన ఆలోచనను సీఎం కేసీఆర్‌కు వివరించారు. సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తన చర్యలను వేగవంతం చేశారు. ఈ పథకం కోసం అనేక సార్లు నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. దీంతో మొదటగా సర్వే పనుల కోసం రూ 6.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరు కావడంతో 2020 జూన్ 1న సర్వే పనులు ప్రారంభించారు. ఇటీవలనే సర్వే పనులు పూర్తి కాగా, ఈ పథకానికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను అధికారులు తయారు చేశారు. దీనిని సుమన్ ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుండడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు
గోదావరి నదిపై రెండు, ప్రాణహిత నదిపై ఒక్కటి ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కోటపల్లి మండలంలోని ఆల్గాం వద్ద గల ప్రాణహిత నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. దీని ద్వారా మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని 18 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా 30 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి శంకరాపూర్ చెరువును నింపుతారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ల ద్వారా 23 చెరువులను నింపి సాగునీరు అందించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకంతో 25 వేల పైచిలుకు ఎకరాలకు నీరు అందనుంది.
గోదావరిపై నర్సక్కపేట వద్ద ఎత్తిపోతల పథకం
చెన్నూర్ మండలంలోని నర్సక్కపేట వద్ద గోదావరిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. దీని ద్వారా అన్నారం(సరస్వతీ) బరాజ్ బ్యాక్‌వాటర్ నుంచి నీటిని సుమారు 16 కిలో మీటర్లు పైపు లైన్ ద్వారా 50 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి భీమారం మండలంలోని మద్దికల్ చెరువును నింపుతారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కాల్వల ద్వారా చెన్నూర్ మండలంలో 18, భీమారం మండలంలో 11, కోటపల్లి మండలంలో 9 గ్రామాల్లోని చెరువులను నింపుతారు. దీని ద్వారా చెన్నూర్, భీమారం, కోటపల్లి మండలాల్లోని దాదాపు 61 వేల పైచిలుకు ఎకరాలకు నీరు అందనుంది.
గోదావరిపై టేకుమట్ల వద్ద...
జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామం వద్ద గోదావరిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. దీనిద్వారా సుందిళ్ల(పార్వతీ) బరాజ్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని సుమారు 17 కిలోమీటర్లు పైపు లైన్ ద్వారా 53 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి మందమర్రి మండలంలోని పొన్నారం చెరువును నింపుతారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కాల్వల ద్వారా మందమర్రి మండలంలో 7, జైపూర్ మండలంలో 21 గ్రామాల చెరువులను నింపుతారు. ఫలితంగా మందమర్రి, జైపూర్ మండలాల్లోని దాదాపు 35 వేల పైచిలుకు ఎకరాలకు నీరు అందనుంది.
సమీక్షలు, క్షేత్రస్థాయి పరిశీలనలు
చెన్నూర్ నియోజకవర్గానికి సాగు నీరు అందించడానికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. పథకాన్ని రూపకల్పన చేసి ప్రయోజనాలను సీఎం కేసీఆర్‌కు వివరించి ఒప్పించారు. సర్వేకు నిధులు కూడా మంజూరు చేయించారు. సర్వే పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. నిర్దేశించిన సమయాని కంటే ముందే సర్వే పనులను చేయించారు. సర్వే పనులు పూర్తి కావడంతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ను అధికారులు తయారు చేశారు. ఈ డీపీఆర్‌ను ప్రభుత్వానికి త్వరలో సమర్పించనున్నారు.
చెన్నూర్ నియోజకవర్గం సస్యశ్యామలం
ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని గ్రామాల భూములకు సాగు నీరు అందనుంది. దాదాపు లక్షా పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందనుంది. చెరువుల కింద ఉన్న ప్రస్తుత ఆయకట్టుతోపాటుగా కొత్తగా మరి కొన్ని ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరు అందనుంది. దీని ద్వారా చెరువులను నింపనుండడంతో ఏడాదంతా నీటితో కళకళలాడనున్నాయి.
పథకాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం
చెన్నూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన పథకాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం. ఇప్పటికే సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్ కూడా తయారు చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పించి నిధుల మంజూరుకు కృషి చేస్తా. పథకం పూర్తయితే రైతులకు సాగు నీటి తిప్పలు తప్పుతాయి. రైతులు వాన కోసం ఎదురు చూడకుండా సాగు చేసుకోవచ్చు. లక్ష్యం మేరకు పూర్తి చేసి సాగు నీరు అందిస్తా.
- బాల్క సుమన్, ప్రభుత్వ విప్.
మూడు ఎత్తిపోతలు..
ప్రాణహితపై..
స్థలం : కోటపల్లి మండలం ఆల్గాం
బరాజ్ : లక్ష్మీ బ్యాక్ వాటర్
పైప్‌లైన్ : 18 కిలోమీటర్లు
ఎత్తు : 30 మీటర్లు
మొదటగా నింపే చెరువు : శంకరాపూర్
గ్రావిటీ ద్వారా నిండే చెరువులు : 23
సాగు నీరు (ఎకరాలు) : 25 వేలు
గోదావరిపై..
స్థలం : చెన్నూర్ మండలం నర్సక్కపేట
బరాజ్ : సరస్వతీ బ్యాక్ వాటర్
పైప్‌లైన్ : 16 కిలోమీటర్లు
ఎత్తు : 50 మీటర్లు
మొదటగా నింపే చెరువు : మద్దికల్
గ్రావిటీ ద్వారా నిండే చెరువులు : 38
సాగు నీరు (ఎకరాలు) : 61వేలు
గోదావరిపై..
స్థలం : జైపూర్ మండలం టేకుమట్ల
బరాజ్ : పార్వతీ బ్యాక్ వాటర్
పైప్‌లైన్ : 17 కిలోమీటర్లు
ఎత్తు : 53 మీటర్లు
మొదటగా నింపే చెరువు : పొన్నారం
గ్రావిటీ ద్వారా నిండే చెరువులు : 28
సాగు నీరు (ఎకరాలు) : 35వేలు
తాజావార్తలు
- నెల రోజుల వ్యవధిలో రెండు సినిమాలతో రానున్న నితిన్..
- కన్వీనర్ కోటాలో ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- ఏనుగుకు నిప్పు.. కాలిన గాయాలతో మృతి
- మార్కెటింగ్ శాఖలో 32 మంది ఉద్యోగులకు పదోన్నతి
- నలుగురు డైరెక్టర్లతో చిరు..ఫ్యాన్స్ కు క్లారిటీ
- 'కేజీఎఫ్ చాప్టర్ 2'కు యష్ పారితోషికం వింటే షాకే..!
- ఎస్ఈసీకి సీఎస్ ఆదిత్యానాథ్ మూడు పేజీల లేఖ
- కన్న తల్లిని కొట్టి చంపిన తనయుడు
- 24న వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- ట్రంప్ వాడే ‘రెడ్ బటన్’ తొలగించిన బైడెన్