శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Jan 10, 2021 , 00:12:32

అసామాన్యుడి కళాయాత్ర

అసామాన్యుడి కళాయాత్ర

కశ్మీర్‌ టూ కన్యాకుమారి

  • లైవ్‌ డ్రాయింగ్‌లో పోచన్న అసాధారణ ప్రతిభ
  • సంస్కృతీ సంప్రదాయాల ప్రత్యక్ష చిత్రీకరణే లక్ష్యం 
  • ఇప్పటికే 15 రాష్ర్టాల్లో ముగిసిన పర్యటన
  • కష్టాలను దాటుకుని.. కన్నీళ్లను దిగమింగుకుంటూ ముందుకు  
  • అద్భుతమైన కళతో ప్రముఖుల నుంచి ప్రశంసలు
  • నేడు చెన్నూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శన

చెన్నూర్‌ టౌన్‌, జనవరి 9 : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌కు చెందిన ఏల్పుల లచ్చక్క, రాజయ్య కుమారుడు పోచన్న విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. డిగ్రీలో బీకాం (బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌) ఫైనలియర్‌ వరకు చదివి, అనంతరం 2007-2011లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ పెయింటింగ్‌)ను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరి పూర్తి చేశాడు. తర్వాత 2012-2014 వరకు మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఎంఎఫ్‌ఏ పెయింటింగ్‌) పూర్తి చేశాడు. ఐకేఎస్‌వీవీ ఖైరాగైర్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఎమ్‌ఎఫ్‌ఏ పట్టాపొందాడు. పోచన్న తమ్ముడు సాగర్‌ ఐటీఐ (ఎలక్ష్రీషియన్‌) పూర్తిచేశాడు.

లక్ష్యం కోసం ఆరాటం..

పెయింటింగ్‌లో పీజీ పూర్తయ్యాక ఓ కార్పొరేట్‌ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా చేరాడు. బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగిన బుద్ధుడిలా పోచన్న తన లక్ష్యాన్ని ఆ స్కూల్‌లోనే మార్చుకున్నాడు. ‘జీతమే జీవితం కాదని, ఏదో సాధించాలి’ అని, ఆర్టిస్ట్‌ కోర్సు అంటే బొమ్మలు గీస్తూ పొట్ట నింపుకోవడం కాదని ఆలోచించాడు. తను నేర్చుకున్న ‘ఫైన్‌ఆర్ట్స్‌' విద్యను క్షేత్రస్థాయిలోకి వెళ్లి అభ్యసించి తనను తాను నిరూపించుకోవాలని, తన బాటలో పయనమయ్యే బీఎఫ్‌ఏ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని కాంక్షించాడు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలని నిర్ణయించుకొని, ‘కశ్మీర్‌ టూ కన్యాకుమారి యాత్ర’ను 2017 డిసెంబర్‌లో ప్రారంభించాడు. భారతీయ సంస్కృతిని తన కళ ద్వారా ప్రజలకు చాటి చెప్పాలనుకుంటున్నాడు. వివిధ రాష్ర్టాల్లో ఉండే సంస్కృతీ సంప్రదాయాలు, కట్టూబొట్టు, పండుగల నేపథ్యంలో ధరించే దుస్తులు (వేషధారణ), ఆచార వ్యవహారాలను చూస్తూ ‘లైవ్‌ డ్రాయింగ్‌' గీస్తున్నాడు. అక్కడికక్కడే చిత్రీకరించి వారికి బహూకరించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఆర్థికంగా లేకున్నా ఆత్మసంతృప్తితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 15 రాష్ర్టాల్లో తన పర్యటనను ముగించాడు. హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఒడిశా, కేరళ,  ఆంధ్రప్రదేశ్‌లలో పోచన్న పర్యటించాడు. మిగతా రాష్ర్టాల్లోనూ తిరిగి తన కళను ప్రదర్శించాలనుకుంటున్నాడు. మిత్రుల సహకారం, గురువులు, తోచిన వారు చేసే సాయంతో తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాడు. మన రాష్ట్రంలో పర్యటించిన తర్వాత తన అనుభవాన్ని, గీసిన చిత్రాలను పుస్తక రూపంలో ముద్రించి ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలల్లో అందుబాటులో ఉంచాలని ఆశిస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవహేళనలు, సూటిపోటి మాటలను దిగమింగాడు. ఉద్యోగం చేసుకోక, పిచ్చోడిలా దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడంటూ బంధువులే నిస్సహాయతకు గురిచేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తను కట్టుబట్టలు, కళకు సంబంధించిన పెన్నులు, పెన్నిళ్లు, కాగితాలను ఒక బ్యాగులో సర్దుకొని ప్రయాణిస్తుంటాడు. ఓ పూట తింటూ, మరో పూట పస్తులుంటూ, ఎండనకా, వాననకా లక్ష్యసాధన కోసం పరితపిస్తున్నాడు. బస్టాండులు, ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడు. తప్పని స్థితిలో బాత్‌ రూమ్‌లకు వెళ్లినప్పుడు దేవుడి మీద భారం వేసి బ్యాగును బస్టాండులోనే ఉంచి వెళ్లిన రోజులు చాలా ఉన్నాయి. మరో రాష్ట్రంలో దూరంగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఫోన్‌లో క్షేమ సమాచారం అడిగిన కొన్ని సందర్భాల్లో కళ్లల్లో నీళ్లు తిరిగేవని తన బాధను వెల్లబోసుకున్నాడు. దాతలు సాయం చేస్తే తన లక్ష్యం సులువవుతుందని కోరుతున్నాడు. చెన్నూర్‌లో మాత్రం తన సైకిల్‌ మీదే కలియదిరుగుతూ అక్కడక్కడా ఆగి ప్రత్యక్షంగా చిత్రీకరిస్తుంటాడు. తన సైకిల్‌ పైనా ‘లైవ్‌ డ్రాయింగ్స్‌', కళాయాత్ర’ అని రాసి ఉండడం గమనార్హం.

యాదికచ్చినప్పుడు బాధయితది

మా కొడుకు ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఉంటడో తెల్వదు. ఎక్కడుంటడో, ఏం తింటడో యాదికచ్చినప్పుడల్లా మస్తు బాధనిపిస్తది. మీ కొడుకు బొమ్మలేసుకుంట పిచ్చోనిలెక్క తిరుగుతున్నడని తెలిసినోళ్లు అన్నప్పుడు దుఖఃమచ్చేది. ఏదన్న పనిసేసి నాలుగు పైసలు సంపాయించుమంటే ఇంటలేడు. అన్ని రాష్ర్టాలు తిరిగచ్చినంక ఉద్యోగం చేస్తనంటున్నడు. ఆని కోరిక జెల్దిన నెరవేరాలని దేవున్ని కోరుకుంటున్న. మాకేమో కూలికి పోకుంటే ఎల్లదాయె.      

- రాజయ్య, పోచన్న తండ్రి

నేడు లైవ్‌ డ్రాయింగ్‌ చిత్రాల ప్రదర్శన

చెన్నూర్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటలకు ‘లైవ్‌ డ్రాయింగ్‌' చిత్రాల ప్రదర్శన ఇవ్వనున్నట్లు నిర్వాహకుడు ఏల్పుల పోచన్న ఒక ప్రకటనలో తెలిపారు. 15 రాష్ర్టాల్లో కళాయాత్ర చేశానని, ఆయా ప్రాంతాల్లోని వేషభాషలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను ‘లైవ్‌ డ్రాయింగ్‌' చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో స్వగ్రామం చెన్నూరులో ఉన్నానని, ఆదివారం తన చిత్రాలను ప్రదర్శిస్తున్నాని, ఔత్సాహికులు, కళా ప్రేమికులు రావాలని కోరారు.logo