ఆదివారం 24 జనవరి 2021
Mancherial - Dec 24, 2020 , 23:53:33

ప్రైవేట్‌ బ్యాంకర్లు, ఫైనాన్సర్ల వేధింపులతో ఒకరి ఆత్మహత్య

ప్రైవేట్‌ బ్యాంకర్లు, ఫైనాన్సర్ల వేధింపులతో ఒకరి ఆత్మహత్య

కాసిపేట : మండలంలోని కోనూర్‌ పంచాయతీలోని నగరం గ్రామానికి చెందిన తీర్ధాల భాస్కర్‌(51) ప్రైవేట్‌ బ్యాంకర్లు, ప్రైవేట్‌ ఫైనాన్సర్ల వేధింపులతో గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు సూ సైడ్‌ నోట్‌ కథనం మేరకు... భాస్కర్‌ గురువారం తెల్లవారుజామున నగరం గ్రామ శివారులో ఉండే తన పొలం వద్దకు వెళ్లి వస్తానని వెళ్లి అక్కడే పురుగుల మందు తాగాడు. తన చావుకు గల కారణాలను సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. “నా కొడుకు వెంకటేశ్‌ ఏడు లారీలను ప్రైవేట్‌ బ్యాంకులు, ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో తీసుకున్నాడు. లాక్‌ డౌన్‌ కారణంగా లారీలు సక్రమంగా నడవకపోవడంతో నెల వారీ వాయిదాలు రూ.12 లక్షలు కట్టలేదు. దీంతో వాహనాలను సదురు బ్యాంక్‌, ప్రైవేట్‌ ఫైనాన్స్‌ నిర్వాహకులు తీసుకువెళ్లారు. 

అంతటితో ఆగకుండా ప్రతి రోజూ ఇంటికి వస్తూ నీ కొడుకే కదా.. డబ్బులు కట్టాలంటూ తీవ్రంగా వేధించారు. సమయం ఇవ్వాలని కోరినా నిన్ను, నీ కుటుంబాన్ని బజారుకీడుస్తామని  అవమానించారు. అందుకే చనిపోతున్నాను. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తనకు బతుకాలని ఉన్నా.. తనను చంపారని, తన చావుకు కారణమైన ఓ బ్యాంక్‌ మేనేజర్‌ హరీశ్‌, నిర్వాహకులు సతీశ్‌, రాకేశ్‌, ఫైనాన్సియర్‌ ఉద్యోగులు శ్రీధర్‌, నరేశ్‌లపై చర్యలు తీసుకోవాలి.” అని సూసైడ్‌ నోట్‌లో రాశారు. మృతిని కుటుంబ సభ్యులు భాస్కర్‌ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భాస్కర్‌ మండలంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నా రు. భాస్కర్‌ రెండు సూసైడ్‌ నోట్‌లు రాశాడు. ఒకటి పేపర్‌పై మరొకటి తన షెర్ట్‌ గుండె వద్ద ప్యాకెట్‌పై రాశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవాపూర్‌ ఎస్‌ఐ దేవయ్య తెలిపారు.


logo