శనివారం 23 జనవరి 2021
Mancherial - Dec 14, 2020 , 02:58:06

టీకాకు రెడీ...

టీకాకు రెడీ...

  • తొలి విడుత పంపిణీకి రంగం సిద్ధం
  • ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం
  • వైద్యారోగ్య శాఖ నుంచి విధి విధానాలు
  • పర్యవేక్షిస్తున్న జిల్లా వైద్యాధికారి
  • జిల్లా, మండల స్థాయిలో  కమిటీల ఏర్పాటు
  • రెండు రోజులపాటు  ఆరోగ్య సిబ్బందికి శిక్షణ
  • మొదట ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే వ్యాక్సిన్‌

కరోనా నివారణ టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించింది. వ్యాక్సిన్లను నిల్వ చేసేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తుండగా, వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నది. మొదట వైద్య సిబ్బందికి, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేయాలని నిర్ణయించి సర్కారుకు నివేదిక అందించింది.

- మంచిర్యాల, నమస్తే తెలంగాణ 

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : కొవిడ్‌ టీకా అందించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మొదట ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు టీకా ఇవ్వనున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు జాబితా సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 3400 మంది సిబ్బంది ఉండగా, 1200 మంది వరకు ప్రైవేట్‌ హాస్పిటళ్లలో పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరందరికీ ఈ టీకా అందిస్తారు. కరోనా వైరస్‌ తీవ్ర రూపం దాల్చిన క్రమంలో వైద్యులు ముందుండి ప్రాణాలకు తెగిం చి సేవలు అందించారు. చాలామంది వైద్యులు కొవిడ్‌ బారి న పడి తిరిగి కోలుకుని విధులు నిర్వర్తించారు. ఈ క్రమం లో మొదటగా వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వీరితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది జాబితాను ఆయా శాఖ ఉన్నతాధికారులు నేరగా ప్రభుత్వానికి నివేదించారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలో వసతులు కల్పించడంతో పాటు ప్రైవేట్‌ హాస్పిటళ్ల సేవలను సైతం వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యాక్సిన్‌ నిల్వలకు ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పీహెచ్‌సీలతో పాటు ఇతర దవాఖానల్లో ఉన్న మౌలిక వసతులపైన చర్చించారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత అన్ని చోట్లా నిల్వ చేయడం చాలా ముఖ్యం. అందుకే వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు ఫ్రీజర్లు అవసరం ఉంటుంది. పీహెచ్‌సీల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. వీటితో పాటు ఏరియా దవాఖానలు, ప్రభుత్వ జనరల్‌ హాస్పిటళ్లలోనూ ఇవి ఉన్నాయి. ఇక ప్రైవేట్‌ దవాఖానల్లో సైతం ఫ్రీజర్‌లు ఉంటాయి. వ్యాక్సిన్‌ నిల్వ చేసేందుకు భారీగా ఈ ఫ్రీజర్‌ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫ్రీజర్‌లు కొన్ని వ్యాక్సిన్‌లకే సరిపోతాయి. కరోనా వ్యాక్సిన్‌ మైనస్‌ డిగ్రీల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజర్‌లు 24 గంటలు ఆన్‌ చేసి ఉంచాలి. వాటికి విద్యుత్‌ సరఫరా కూడా నిరంతరం ఉండాలి.  ఇలా అన్నింటిపైనా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

జిల్లా స్థాయిలో కమిటీలు..

ఈ కరోనా వ్యాక్సిన్‌ అమలు కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. దీనికి డీఎంఅండ్‌హెచ్‌వో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కో ఆర్డినేషన్‌ కమిటీ, ఎంపీపీ అధ్యక్షతన మండల కో ఆర్డినేషన్‌ కమిటీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన మున్సిపల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్‌ కమిటీ, టాస్క్‌ఫోర్స్‌ కమిటీలకు అనుబంధంగా జిల్లా స్థాయిలో ఉన్న కమిటీలు సమన్వయంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తూ అన్ని జిల్లాలకు ఆదేశాలు పంపించింది. జిల్లా స్థాయి కమిటీలు ఏ విధంగా పనిచేస్తాయనే విషయంతో పాటు టీకా పంపిణీ ఎలా జరుగుతుందనే విషయంలో రాష్ట్ర కమిటీలు పర్యవేక్షిస్తాయి. 

రెండు రోజుల పాటు శిక్షణ

ఈ టీకాకు సంబంధించి అన్ని విషయాలు సమగ్రంగా వివరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టీకా నిల్వలు, సరఫరాతో పాటు ఆరోగ్య సిబ్బందికి ఇచ్చేందుకు ఈ శిక్షణ అందిస్తారు. డీఎంఅండ్‌హెచ్‌వో, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పాటు కార్యాలయ వైద్యాధికారులు, ఇమ్యునైజేషన్‌ అధికారులకు శిక్షణ పూర్తి చేస్తారు. అనంతరం మి గతా వైద్యులకు సైతం శిక్షణ అందిస్తారు. ఇలా టీకా వచ్చే సమయానికి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. టీకా వేసుకున్న వారి ఆధార్‌ నంబర్‌, సెల్‌ఫోన్‌ నంబర్లను ఇంటర్నెట్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. టీకా పంపిణీకి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో నీరజ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల సిబ్బంది జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించారు.logo