బుధవారం 03 మార్చి 2021
Mancherial - Dec 07, 2020 , 01:31:08

కల్యాణం.. అరుదైన ఘట్టం

కల్యాణం.. అరుదైన ఘట్టం

  • తాండూర్‌ మండలంలో మామిడి చెట్లకు పెండ్లి
  • తొలికాత సమయంలో చేయడం ఆచారం

తాండూర్‌ : దేవతలకు చేసే కల్యాణాలు అందరికీ తెలిసినవే. కానీ తాండూర్‌ మండలంలో మామిడి చెట్లకు వివాహం (పెండ్లి) చేస్తారు. ఇలా చేస్తే ఆ తోటలోని చెట్లు విరగకాసి యజమానికి ఫలసమృద్ధి కలుగుతుందని విశ్వాసం. తోట పెట్టిన తర్వాత మొదటి ఫలసాయం (మొదటిసారి కాతకు) వచ్చినప్పుడు ఆ తోట యజమాని చెట్లకు కల్యాణం చేస్తారు. ఇందుకోసం తోటలో ఎదురెదురుగా ఉన్న రెండు చెట్లను ఎంపిక చేసుకుంటారు.

కాత కాసిన చెట్టుకు మాత్రమే లగ్గం చేస్తారు. ఇక మామిడి చెట్లను లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఒక చెట్టును విష్ణుమూర్తిగా, మరోదాన్ని లక్ష్మీదేవిగా అలంకరిస్తారు. వేదమంత్రాలు ఒకవైపు, బాజాభజంత్రీలు మరోవైపు.. తోటలో ప్రతిధ్వనిస్తూ చూసేవారికి కంటికి ఇంపుగా ఉంటుంది. ఈ కల్యాణం దంపతులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. మంగళసూత్రాన్ని చెట్టుకు కట్టడంతో వేడుక అందంగా మారుతుంది. వచ్చిన అతిథులంతా చెట్లపై తలంబ్రాలు చల్లి మురిసిపోతారు. ముత్తైదువులను, ఆడపడచులను తప్పనిసరిగా పిలుచుకుంటారు. వీలైతే ఊరందరినీ పిలిచేవారూ ఉన్నారు. చెట్ల పెండ్లి తంతు ముగియగానే విందుభోజనం. పెండ్లితంతు నిర్వహించిన ఆ రెండుచెట్ల పండ్లు, కాయలను పంచిపెడతారు. ఈనాటికీ తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో ఈ కల్యాణం చేయకుండా తోట యజమాని కాయలను తెంపి తినడు. కాతకు వచ్చిన మొదటి సంవత్సరం మాత్రమే ఈ వేడుక చేస్తారు.

ఇలాంటి అరుదైన కల్యాణ ఘట్టానికి తాండూర్‌ మండలం అచ్చలాపూర్‌ గ్రామం వేదికగా మారింది. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేదపండితులు అప్పాల శ్యాంప్రణీత్‌ శర్మ అవధాని, గ్రామ పురోహితుడు నరహరి శర్మ ఆధ్వర్యంలో కల్యాణ కర్త అయిన వెన్నంపల్లి సత్యనారాయణ, వినోద దంపతులు ఆదివారం తమ మామిడి తోటలోని చెట్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది అతిథులు విచ్చేసి జరిగిన వేడుకను ఆసక్తిగా తిలకించి, కార్తీకవన భోజనాలు ఆరగించారు.


VIDEOS

logo