శనివారం 16 జనవరి 2021
Mancherial - Dec 04, 2020 , 01:41:39

ప్రాజెక్టులు నిండుగా.. సాగు పండుగ

ప్రాజెక్టులు నిండుగా.. సాగు పండుగ

  • వర్షాలకు నిండుకుండల్లా జలాశయాలు
  • గతేడాదికంటే పెరుగనున్న యాసంగి పంటల విస్తీర్ణం
  •  ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 
  • ఆనందంలో అన్నదాతలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : వర్షాలు విస్తారంగా కురియడంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా దర్శనమిస్తుండగా, యాసంగి పంటల సాగుకు భరోసా వచ్చింది. గతేడాదికంటే అదనంగా సాగయ్యే అవకాశముండగా, ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది యాసంగిలో 99,967.5 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 1,18,380 ఎకరాల్లో పంటలు వేసే అవకాశము న్నది. సుమారు 18,413 ఎకరాల్లో అదనంగా సాగు కానున్నది. ఇక గతేడాది వరి 77,376 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 1,10,380 ఎకరాల్లో సాగు కానున్నది. అంటే 33,004 ఎకరాల్లో అదనంగా పంటలు వేయనున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా నీరుండడంతో యాసంగి పంటలకు ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తం గా కోతల సీజన్‌ చివరి దశకు వచ్చింది. మరో పదిహేను రోజుల్లో యాసంగి సీజన్‌ ప్రారంభం అవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

ప్రాజెక్టులకు జలకళ..

నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు నుంచి 2019-20లో వానకాల సీజన్‌లో మంచిర్యాల జిల్లాలోని 42,147 ఎకరాలకు నీరు అందించారు. అదే యాసంగి సీజన్‌లో 41,747 ఎకరాలకు నీరందించారు. ఇక ఈ ఏడాది వానకాల సీజన్‌లో 44,952 ఎకరాలకు నీరందించారు. ఇప్పుడు యాసంగికి సైతం 42 వేల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మూడు మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు అన్నీ నిండుకున్నా యి. గొల్లవాగు ప్రాజెక్టు రిజర్వాయర్‌ లెవల్‌ 155.50 మీటర్లు కాగా, ప్రస్తుత లెవల్‌ 155 మీటర్లు ఉంది. 0.5675 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం కాగా, ఇప్పడు 0.50952 నీరు నిల్వ ఉంది. ర్యాలీవాగు రిజర్వాయర్‌ లెవల్‌ 151.500 మీటర్లు కాగా, ప్రస్తుత లెవల్‌ 151.300 మీటర్లు ఉంది. 0.41 టీఎంసీల నీరు నిల్వ సామర్థ్యం కాగా, ఇప్పడు 0.39 నీరు నిల్వ ఉంది. నీల్వాయి ప్రాజెక్టు రిజర్వాయర్‌ లెవల్‌ 124 మీటర్లు కాగా, ప్రస్తుత లెవల్‌ 123.900 మీటర్లు ఉంది. 0.85 టీఎంసీ నీరు నిల్వ సామర్థ్యం కాగా, ఇప్పడు 0.82 నీరు నిల్వ ఉంది.

గూడెం ఎత్తిపోతల కింద..

శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన గూడెం ఎత్తిపోతల పథకం కింద పెద్ద మొత్తంలో పంటలు సాగు కానున్నాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు కాగా, యాసంగిలో 2.5 టీఎంసీల నీరు విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని పంట పొలాలకు నీరందనున్నది. 30 నుంచి 42 డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద ఆయకట్టు మొత్తం సాగులోకి రానున్నది. దండేపల్లి మండలంలో 13 గ్రామాల్లో 11,202 ఎకరాలు, లక్షెట్టిపేట మండలంలో 22 గ్రామాల్లో 12,498 ఎకరాలు, మంచిర్యాల మండలంలో 13 గ్రామాల్లో 6,300 ఎకరాలు సాగు కానున్నాయి. పుష్కలంగా నీరు ఉండడంతో తమ పంటలకు ఇక ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

చెరువుల కింద జోరుగా..

ఈ ఏడాది చెరువుల కింద గరిష్ఠంగా సాగయ్యే అవకాశముంది. జిల్లావ్యాప్తంగా 890 చెరువులు ఉన్నాయి. ఇందులో చిన్న నీటి వనరులు 123 కాగా, పీఆర్‌ కుంటలు 767 వరకు ఉన్నాయి. ఇందులో మిషన్‌ కాకతీయ పథకం కింద మొదటి విడుతలో 147 చెరువులు, రెండో విడుతలో 152 చెరువులు, మూడో విడుతలో 81 చెరువు లు, నాలుగో విడుతలో 36 చెరువుల్లో పూడిక తీశారు. ప్రస్తుతం ఈ చెరువులన్నీ నిండుకున్నాయి. జిల్లాలో చెరువుల కిందనే 40 శాతం పైగా సాగు అవుతుంది. ఈ నేపథ్యంలో చెరువుల్లో పుష్కలంగా నీరుంది. ఏఐబీపీ పథకం కింది రూ. 22.09 కోట్లతో 8 చెరువులను పునరుద్ధరించాలని ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 7 చెరువులను పూర్తి చేశారు. ఒక చెరువుకు సంబంధించి పనులు సైతం పురోగతిలో ఉన్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని చెరువుల్లో 89 శాతం ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిండినట్లు ఇరిగేషన్‌ శాఖాధికారులు చెబుతున్నారు.