బుధవారం 27 జనవరి 2021
Mancherial - Dec 03, 2020 , 00:45:58

మట్టి తరలింపుపై అధికారుల విచారణ

మట్టి తరలింపుపై అధికారుల విచారణ

  • బయటపడ్డ అక్రమాలు
  • రూ.14.5 లక్షల జరిమానా, వాహనాల సీజ్‌
  • మంచిర్యాల జిల్లా మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారుల వెల్లడి

కాసిపేట : కాసిపేట మండలం సోమగూడెం(కె) గ్రామ సమీపంలోని డంపింగ్‌ యార్డ్‌ పక్కన గల భూముల నుంచి మట్టి అక్రమ తరలింపుపై బుధవారం జిల్లా మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. నేషనల్‌ హైవే రహదారి పనుల నిర్మాణం కోసం 2 ఎకరాల్లో మట్టి తరలింపు కోసం అనుమతులు ఇవ్వగా, అందులో అక్రమాలు చోటుచేసుకున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తవ్వకాలు చేపట్టిన ప్రాంతంలో భారీ గుంతలు చేశారని, అనుమతి పొందిన భూమి కాకుండా పక్క భూముల్లో కూడా తవ్వకాలు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు మైనింగ్‌ ఏడీ బాలు, ఎంఆర్‌ఐ సులోచన, మైనింగ్‌, రెవెన్యూ, సర్వే అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. అనుమతి తీసుకున్న దానికంటే భారీగా గుంతలు చేసినట్లు, పక్క భూముల నుంచి కూడా అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత మట్టి తరలింపుదారులకు రూ.14.5 లక్షల జరిమానా విధించారు. అలాగే జేసీబీలు, లారీలను సీజ్‌ చేస్తున్నట్లు వివరించారు. జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్‌ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్‌, సర్పంచ్‌ సపాట్‌ శంకర్‌, ఉప సర్పంచ్‌ కనుకుల రాకేశ్‌, టీఆర్‌ఎస్‌ ఉపాద్యక్షుడు అగ్గి సత్తయ్య, భూక్యా రాంచందర్‌, గ్రామ అధ్యక్షుడు చింతల భీమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, మర్రి సంతోష్‌, స్థానికులు ఉన్నారు.  


logo