శనివారం 16 జనవరి 2021
Mancherial - Nov 28, 2020 , 00:47:58

నివర్‌ వణుకు

నివర్‌ వణుకు

  • తుఫాన్‌ ప్రభావంతో ముందస్తు చర్యలు

నిర్మల్‌/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : నిర్మల్‌ జిల్లాలో ఈ ఏడాది వానకాలంలో 1.07 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుతం పంట చేతికి వచ్చింది. సుమారు 1.56 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 192 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 143 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. వీటిలో ఇప్పటి వరకు 19,573 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యానికి క్వింటాల్‌కు మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్‌ రకానికి రూ.1888 చొప్పున చెల్లిస్తుండగా, సాధారణ రకానికి రూ.1868 చొప్పున చెల్లిస్తున్నారు. సుమారు 1600 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటి వరకు రూ.13.50 కోట్ల మేర చెల్లించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని కేంద్రం వారే చూసుకోగా, కాంటా చేయని ధాన్యాన్ని రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే సుమారు 3600 వరకు టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు జిల్లాలో 1.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 10 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి మార్కెట్‌కు విక్రయానికిరాగా, మిగతా పత్తి రైతుల వద్ద నిల్వ ఉంది. ఈ పత్తిని కూడా టార్పాలిన్లు కప్పి ఉంచారు. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు సీసీఐ కొనుగోళ్లు కూడా నిలిపివేశారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన టార్పాలిన్లను మార్కెటింగ్‌ శాఖ ద్వారా సరఫరా చేశారని, వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వారిని డీఆర్‌డీవో, డీసీవో, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల నుంచి నిత్యం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. రెండు రోజుల పాటు రైతులు కోతలు కోయవద్దని.. కోసిన ధాన్యం తమ కల్లాలలోనే ఉంచి తడవకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ ‘నమస్తే తెలంగాణ’తో పేర్కొన్నారు. 

ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 41 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 18 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 240 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. మరోవైపు జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 30 లక్షల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 8 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఇక మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 1.64 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 960 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 1.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 10.20 లక్షల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. 

తుఫాన్‌ గుబులు..

నివర్‌ తుఫాన్‌ వల్ల అకాల వర్షాలు కురుస్తాయని అధికారులు చేస్తున్న హెచ్చరిక రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం చాలా చోట్ల వరి కోతలు సాగుతున్నాయి. ధాన్యం అమ్మకాలు సైతం జోరందుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లో ధాన్యాన్ని రైతులు పెద్ద ఎత్తున నిల్వ చేశారు. మరోవైపు పత్తి సైతం చెట్ల మీదనే ఉంది. మొదటి విడుత పత్తి ఏరించిన రైతులు రెండో విడుత ఏరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తుఫాన్‌ ప్రభావం రైతులను ఆందోళనలకు గురి చేస్తోంది.

వ్యవసాయ శాఖ సూచనలు

నివర్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున పంట ఉత్పత్తులను రక్షించుకునేందుకు వ్యవసాయ శాఖ ముందుగానే అప్రమత్తమైంది. రెండు రోజుల పాటు వరి కోతలు కోయవద్దని అధికారులు రైతులను కోరుతున్నారు. ఎవరైనా కోతలు కోస్తే, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవద్దని, తమ పొలాల్లోనే నిల్వ చేయాలని చెబుతున్నారు. పొలాల్లో కూడా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని పేర్కొంటున్నారు. రైతులు వ్యవసాయ బావుల వద్ద ధాన్యం కుప్పులు ఉన్నైట్లెతే సాధ్యమైనంత మేరకు షెడ్ల కిందకు తరలించాలని సూచిస్తున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే ధాన్యం పేరుకుపోయింది. ఈ రెండు రోజుల్లో విక్రయించాల్సిన వారు ఎవరైనా ఉంటే మరో మూడు నాలుగు రోజులు ఆగితే మేలని చెబుతున్నారు. వరి ధాన్యం తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే లీటరుకు 50 గ్రాముల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పనలపై పిచికారీ చేయాలని చెబుతున్నారు.

నివర్‌తో పెరిగిన చలి..

నివర్‌ తుఫాన్‌ కారణంగా ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. నిన్న మొన్నటి వరకు అంతగా కనిపించని చలి తీవ్రత ఒక్కసారిగా ప్రభావం చూపుతోంది. రెండు రోజులుగా ఆకాశం మబ్బుపట్టి ఉంటోంది. శుక్రవారం అక్కడక్కడా జల్లులు పడ్డాయి. ఇటు చిరుజల్లులు, అటు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. చాలా చోట్ల ఉదయం 9 గంటల వరకు పొగమంచు పడుతున్నది. చేలు.. తదితర పనులకు వెళ్లే వారంతా చీకటి పడకముందే ఇండ్లకు చేరుకుంటున్నారు.