శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Nov 19, 2020 , 01:59:31

రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలు పూర్తి చేయాలి

రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలు పూర్తి చేయాలి

  • నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు 
  •  కలెక్టర్‌ భారతీ హోళికేరి 

హాజీపూర్‌ : రైతు వేదికలు, కల్లాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం, అలసత్వం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తేదారులు, అధికారులను మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ ప్రకాశ్‌, డీఈ, ఏఈ, సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రైతు వేదికల నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం, ఆలస్యం చేస్తున్న అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. పనుల నిర్వహణ, ఎఫ్‌టీవో, ఎంఎఫ్‌ రికార్డుల నమోదు అలసత్వం వల్ల గుత్తేదారులకు నిధులు అందడం లేదని, దీంతో వారు పనులు నిలిపివేశారని తెలిపారు.

పనులు పూర్తి చేసిన గుత్తేదారులకు నిధులను త్వరగా విడుదల చేయాలని, ఇప్పటి వరకు జరిగిన పనులపై సమగ్ర నివేదిక అందించాలన్నారు. రోజువారీగా చేపట్టిన పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన పారిశుధ్య నిర్వహణ, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ  పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమా వేశంలో జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. 


logo