ఆదివారం 24 జనవరి 2021
Mancherial - Nov 12, 2020 , 02:03:30

దండారీ దరువు..

దండారీ  దరువు..

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  ఏజెన్సీలో పండుగ వాతావరణం 
  • ఆదివాసీ తండాల్లో వాయిద్యాల ప్రతి ధ్వనులు
  • డప్పు చప్పుళ్లతో మార్మోగుతున్న పల్లెలు
  • అతిథి గ్రామాల్లో బృందాల విడిది 
  • కొనసాగుతున్న  ప్రత్యేక పూజలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోండు గూడేలు బుధవారం దండారీ ఉత్సవాలకు వేదికయ్యాయి. సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా గుస్సాడీ కళాకారుల నృత్యాలతో పల్లెలు హోరెత్తాయి.  ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. సుబోయి, దండారీ, చాయిడాలి, డోడల్‌, దింసా నృత్యాలు, డప్పుల దరువు, గజ్జెల సవ్వళ్లతో పల్లెలన్నీ మార్మోగుతున్నాయి. చిన్నాపెద్దలంతా ఆటాపాటల్లో మునిగితేలారు. ఆరాధ్య దేవతలకు, దండారీ సామగ్రికి ప్రత్యేక పూజలు చేశారు. కోలాటాలతో సందడి చేశారు.

 - నమస్తే బృందం


ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో బుధవారం దండారీ సంబురాలు అంబరాన్నంటాయి. సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా గుస్సాడీ కళాకారుల నృత్యాలతో తండాలు హోరెత్తాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌, నార్నూర్‌, బోథ్‌, గుడిహత్నూర్‌, ఉట్నూర్‌ నిర్మల్‌ జిల్లాలోని దస్తురాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి, మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలాల్లో వేడుకలు జరిగాయి. మెడలో రుద్రాక్షలు, చంకలో జంతు చర్మం, నెత్తిపై నెమలి ఈకల టోపీ, ముఖానికి మసి, ఒంటినిండా బూడిద, నడుం నుంచి మోకాళ్ల వరకు వస్త్రధారణతో గోండులు గుస్సాడీ వేషధారణలో ఆకట్టుకున్నారు. ర్యాలీగా తరలి వస్తున్న గుస్సాడీలకు అతిథ్యాన్నిచ్చేందుకు ఆయా గ్రామాల్లో పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దేవతలకు, వాయిద్యాలకు, నెమలిటోపీలకు ఆదివాసులు ప్రత్యేక పూజలు చేశారు. అతిథులుగా విచ్చేసిన గుస్సాడీ బృందాలకు ఆయా చోట్ల ఘన స్వాగతం పలికారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. డప్పు చప్పుళ్లు, గజ్జెల సవ్వళ్లతో దండారీ బృందాలు ఆకట్టుకున్నాయి. వాయిద్యాల ధ్వనులతో పల్లెలన్నీ మార్మోగాయి.

- బోథ్‌/సిరికొండ/భీంపూర్‌/నార్నూర్‌/ఉట్నూర్‌రూరల్‌/గుడిహత్నూర్‌/ దస్తురాబాద్‌/కెరమెరి/కాసిపేటlogo