బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 04, 2020 , 00:24:56

మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం

మెరుగైన వైద్యం ప్రభుత్వ లక్ష్యం

మందమర్రి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'లో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావుకు అందించిన 108 అంబులెన్స్‌ను స్థానిక మార్కెట్‌లో మంగళవారం మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భా గ్యలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ సమాన ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రభుత్వం దవాఖానలను ఆధునీకరిస్తూ కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యలు కల్పిస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనలో సర్కారు దవాఖానలకు ఆదరణ పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్‌, మందమర్రి జడ్పీటీసీ వేల్పుల రవి, టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు జే రవీందర్‌, మేడిపల్లి సంపత్‌, కొంగల తిరుపతి రెడ్డి, రావికంటి వెంకటేశ్వర్లు, ఈశ్వర్‌, తోట సురేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష..

మందమర్రి(రామకృష్ణాపూర్‌) : మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లోని టీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలు, కౌన్సిలర్లు సమన్వయంతో అభివృద్ధికి కృషిచేయాలని విప్‌ సుమన్‌ సూచించారు. మందమర్రిలోని సింగరేణి సీఈఆర్‌ క్లబ్‌, క్యాతన్‌పల్లిలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో సమన్వయ కర్తలు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులతో మున్సిపాలిటీల అభివృద్ధిపై వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు చేయించి, పేదలకు నామమాత్రపు ధరకే అందిస్తామన్నారు. అలాగే ఓసీతో పాటు సోలార్‌ ప్లాంట్లలో స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలిపారు. మందమర్రిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పనులను త్వరగా పూర్తిచేయిస్తామన్నారు. అలాగే 8 కమ్యూనిటీ భవనాలను(ఒక్కో భవనానికి రూ.50 లక్షలు) నిర్మించనున్నట్లు తెలిపారు. మహిళలు సూచించిన ప్రదేశాల్లోనే బతుకమ్మ ఘాట్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లను త్వరలోనే పూర్తిచేసి, అర్హులకు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌ ప్రభాకర్‌రావు, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్మన్‌ జంగం కళ, కమిషనర్లు గద్దె రాజు, వెంకటనారాయణ, తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo