మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Nov 04, 2020 , 00:25:16

దండారీ సంబురం

 దండారీ సంబురం

దండేపల్లి: చచోయ్‌ ఇట్‌ కోలారా.., దేనే దేనారా.., రేలా.. రేలా... లాంటి ఆటపాటల నడుమ.. పద్మల్‌పురికాకో ఆలయం వేదికగా మంగళవారం దండారీ ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్‌పురి కాకో ఆలయంలో అంగరంగవైభవంగా కొనసాగాయి. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం బుర్కపెల్లి, రాజ్‌గడ, మర్కగూడ.., తలమడుగు మండలంలోని నందిగామ, గాదిగూడ మండలంలోని లోకారికి చెందిన గిరిజనులు సుమారు 300 మందికి పైగా ఆలయానికి చేరుకున్నారు. . 

గోదావరి తీరంలో పుణ్యస్నానాలు..

ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా గోదావరి తీరానికి కాలినడకన చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, జలాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. 

నైవేద్యాలు..

ఇందులో భాగంగా పద్మల్‌పురికాకోకు మహిళలు అతి పవిత్రతో నైవేద్యాలు తయారు చేశారు. పాయసంతో పాటు పెసర్లు, మినుములు, బబ్బెర్లను రుబ్బి చేసిన గారెలను అమ్మవారికి సమర్పించారు. దంచిన బియ్యంతో తయారు చేసిన అరిసెలను అందించారు.

అలరించిన గుస్సాడీ నృత్యాలు..

ఆలయ ఆవరణలో గుస్సాడీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నెత్తిన నెమలిపించంతో తయారు చేసిన టోపి, కళ్లద్దాలు, భుజాన జింక తోలు, నడుము కు, కాళ్లకు గజ్జెలు, చేతిలో కోల పట్టుకొని తప్పెట గూళ్ల వాయిద్యాలు, డప్పు చప్పళ్ల నడుమ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా మహిళలు బొట్టు పెట్టి గుస్సాడీల ఆశీర్వాదం తీసుకున్నారు. 


logo