శనివారం 28 నవంబర్ 2020
Mancherial - Oct 30, 2020 , 01:00:40

చిరుత చర్మం స్వాధీనం

చిరుత చర్మం స్వాధీనం

  • ఆరుగురి అరెస్ట్‌.. పరారీలో మరో ముగ్గురు

దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాయకపుగూడ-గోండుగూడ దారిలో గురువారం చిరుత చర్మాన్ని అమ్మేందుకు యత్నిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో ముగ్గురు పరారయ్యారు. పులి చర్మంతోపాటు బైక్‌, ఆటోను స్వాధీనం చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సతీశ్‌, టాస్క్‌ ఫోర్స్‌ సీఐ కిరణ్‌, దేవాపూర్‌ ఎస్‌ఐ దేవయ్య తెలిపారు.

 కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్మారావుపేట నాయకపుగూడ, పల్లంగూడ గోండుగూడ దారి మధ్యలో చిరుత పులి చర్మాన్ని అమ్మడానికి యత్నిస్తున్న ముఠాను రామగుండం టాస్క్‌ ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, దేవాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. చిరుత చర్మం, బైక్‌, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దేవాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితుల అరెస్ట్‌ చూపించి స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సతీశ్‌, టాస్క్‌ ఫోర్స్‌ సీఐ కిరణ్‌, దేవాపూర్‌ ఎస్‌ఐ దేవ య్య వివరాలు వెల్లడించారు. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం మంగి అటవీ ప్రాంతంలో ముఠా సభ్యులు చిరుతను చంపారు. దాని చర్మం ఒలిచి కాసిపేట మండలంలోని పల్లంగూడ గోండుగూడ గ్రామ అటవీ శివారులో దాచి ఉంచారు. ముఠా సభ్యులు చిరుత పులి చర్మా న్ని అమ్మకానికి పెట్టారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసు లు దాడి చేశారు.

అక్కడున్న సభ్యుల వద్ద ఉన్న సంచిలో వెతుకగా, చిరుత పులి చర్మం కనిపించింది. దానిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాసిపేట మండలం కోనూర్‌ తంగళ్లపల్లికి చెందిన గోపతి వంశీ, పల్లంగూడకు చెందిన సిక్రం గంగు, మందమర్రి పట్టణం విద్యానగర్‌కు చెందిన జూపాక దుర్గ ప్రసాద్‌, మందమర్రి పట్టణం మారుతీనగర్‌కు చెందిన షేక్‌ జమీల్‌, మహ్మద్‌ వాజిద్‌ ఖాన్‌, ఊరు మందమర్రికి చెందిన ఆవుల సాయికృష్ణను అరెస్ట్‌ చేశారు. తిర్యాణి మండలం సుంగాపూర్‌కు చెందిన పెంద్రం శంకర్‌, విద్యానగర్‌ మందమర్రికి చెందిన గాదె రాజు, హైదరాబాద్‌కు చెందిన గోపతి మురళి పరారీలో ఉన్నారు.

చిరుత పులి చర్మం స్వాధీనం చేసుకున్నారిలా.. 

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి సుంగాపూర్‌ గ్రామానికి చెందిన పెంద్రం శంకర్‌ కాసిపేట మండలం పల్లంగూడకు చెందిన సిక్రం గంగుకు ఫోన్‌ చేశాడు. తన దగ్గర చిరుత పులి చర్మం ఉందని,  విక్రయించి డబ్బులు పంచుకుందామని తెలిపాడు. వెంటనే గంగు తన స్నేహితుడు గోపతి రాజును సంప్రదించాడు. రాజు తన అన్న కొడుకు, హైదరాబాద్‌లో ఉండే గోపతి మురళికి సమాచారం అందించాడు. ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో సుంగాపూర్‌లోని పెంద్రం శంకర్‌ తన వద్ద ఉన్న పులి చర్మాన్ని గోపతి రాజు, గంగుకు అప్పగించాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మురళికి విషయం చెప్పారు. మురళి తనకు తెలిసిన మందమర్రికి చెందిన జూపాక ప్రసాద్‌, రాజుకు అమ్మాలని సూచించాడు. దీంతో మందమర్రి ప్రాంతానికి చెందిన ప్రసాద్‌, రాజు, వాజిద్‌, జమీల్‌, సాయి కృష్ణ తాము మొదట పులి చర్మాన్ని చూడాలన్నారు. గోపతి రాజు, సిక్రం గంగు పల్లంగూడ శివారు అడవిలో దాచి ఉంచిన పులి చర్మాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. బైక్‌ మీద పల్లంగూడ గోండుగూడ నుంచి ధర్మారావుపేట నాయకపుగూడ వైపు చర్మాన్ని తీసుకొని వెళ్తున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్‌ ఫోర్స్‌, దేవాపూర్‌ పోలీసులు నాయకపుగూడ వద్ద దాడి చేశారు. నిందితులను ఆపి తనిఖీ చేశారు. వారి నుంచి చిరుత పులి చర్మాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్‌, ఒక ఆటోను పట్టుకున్నారు.

కాసిపేట కోనూర్‌ తంగళ్లపల్లికి చెందిన గోపతి వంశీ, పల్లంగూడకు చెందిన సిక్రం గంగు, మందమర్రి విద్యానగర్‌కు చెందిన జూపాక దుర్గ ప్రసాద్‌, మందమర్రి మారుతీనగర్‌కు చెందినషేక్‌ జమీల్‌, మహ్మద్‌ వాజిద్‌ ఖాన్‌, ఊరు మందమర్రికి చెందిన ఆవుల సాయికృష్ణను అరెస్ట్‌ చేశారు. తిర్యాణి సుంగాపూర్‌కు చెందిన పెంద్రం శంకర్‌, విద్యానగర్‌ మందమర్రికి చెందిన గాదె రాజు, హైదరాబాద్‌కు చెందిన గోపతి మురళి పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిరుత పులి చర్మం, నిందితులను పట్టుకున్న విషయంలో ఎస్‌బీ సీఐ సతీశ్‌, టాస్క్‌ఫోర్స్‌ సీఐ టీ కిరణ్‌, దేవాపూర్‌ ఎస్‌ఐ దేవయ్య, టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌ఐలు లచ్చన్న, సీహెచ్‌ కిరణ్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంపత్‌కుమార్‌, రాకేశ్‌, భాస్కర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, ఓంకార్‌, వెంకటేశ్‌, శ్యామ్‌, సదానందం గౌడ్‌, మల్లన్నను రామగుండం సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.