శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 25, 2020 , 04:53:17

నేడు దసరా సర్వం సిద్ధం

నేడు దసరా సర్వం సిద్ధం

దసరా అంటేనే భక్తి, భుక్తి, యుక్తి, శక్తి, ముక్తి సమ్మేళనం.. ఆధ్యాత్మికత, మానసిక వికాసం, శారీరక దారుఢ్యం, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రత్యేకతలు దసరా ఉత్సవాల వెనుక దాగి ఉన్నాయి. దుష్టశక్తులపై ఆదిపరాశక్తి సాధించిన విజయానికి సంకేతంగా, మానవాళి వికాసానికి  ఉత్సవాలను యేటా నిర్వహిస్తారు. నేడు(ఆదివారం) దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని కూడళ్ల వద్ద దహనానికి రావణాసురుడి ప్రతిమలను సిద్ధం చేశారు. ఆలయాలు, గనులపై పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.   

- మంచిర్యాల టౌన్‌/కాగజ్‌నగర్‌టౌన్‌

మంచిర్యాల టౌన్‌ : పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఆసరా చేసుకొని, ముల్లోకాలను పీడించసాగాడు. అతడి బాధల నుంచి విముక్తి కల్పించాలని దేవతలంతా త్రిమూర్తులకు మొరపెట్టుకున్నారు. త్రిమూర్తులు, మహిషాసురుడిని ఎదుర్కోవడం తమ వల్ల కాక, దుర్గామాతను వేడుకున్నారు. ఆమె తొమ్మిది రోజులపాటు భీకర పోరాటం చేసి పదో రోజున మహిషాసురిడిని వధిస్తుంది. నాటి నుంచి విజయదశమి ఆనవాయితీగా వస్తున్నది.

పాండవుల కథ..

మరో కథ ప్రకారం.. అరణ్య, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్న పాండవులు ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున హస్తినాపురానికి చేరుకోగా, ప్రజలు వేడుకలు చేసుకున్నారు. అదే కాల క్రమేణా విజయ దశమిగా మారిందని చెబుతారు. విజయదశమి వేడుకల్లో ఆయుధాలను, శమీ వృక్షాన్ని పూజించేది కూడా ఈ కథను అనుసరించే! అడవిలో సహజంగా పెరిగే శమీ వృక్షం కొమ్మలను తీసుకొచ్చి గ్రామ చావడి, కాలనీల్లో, ఆలయాల ఆవరణల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. తర్వాత అందరూ అక్షింతలతో కలిపి, ఆ ఆకులను తీసుకొని బంధువులకు, పెద్దలకు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.

సనాతన సంప్రదాయం..

తెలంగాణలో బతుకమ్మ, దసరాను ఘనంగా జరుపుకుంటారు. ఉపాధి, చదువు, ఇతర అవరాలరీత్యా ఎక్కడెక్కడో నివాసముండే వారంతా ఈ పండుగల కోసమని సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఆడబిడ్డలు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. పిండి వంటలు ఆరగిస్తారు. ఇదే రోజు పాల పిట్టను చూస్తే ఏడాది పొడవునా శుభం కలుగుతుందని విశ్వాసముండగా, గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లి పాలపిట్టను చూస్తారు.

ఆయుధ పూజ ప్రత్యేకం

దసరా రోజు యంత్రం, వాహన, పనిముట్లను పూలతో అలంకరించి, పూజలు చేస్తారు. ఇందుకోసం ఆలయాల వద్ద వాహనాల తో బారులు తీరుతారు. అర్చకులతో పూజలు చేయించుని, తృణ మో పణమో సమర్పిస్తారు. కాగా.. దసరా పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించునున్న వేడులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల ఆదిలాబాద్‌ జిల్లాల్లో వేడుకలు జరుగనున్నాయి. మంచిర్యాల జిల్లాలోని అన్ని గనులపై పూజలకు ఏర్పాట్లు చేశారు.