శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 25, 2020 , 04:53:20

కనుల పండువగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కనుల పండువగా సద్దుల బతుకమ్మ వేడుకలు

  • ఆడిపాడిన మహిళలు
  • మారుమోగిన ప్రధాన కూడళ్లు
  • కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించిన ఆడబిడ్డలు
  • వాగులు, చెరువుల్లో నిమజ్జనం..  
  • గౌరమ్మ తల్లికి వీడ్కోలు ఉత్సవాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు  

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ‘సద్దుల’ సంబురం అంబరాన్నంటగా, పుడమి తల్లి పూల శోభతో పులకించింది. ఆడబిడ్డలు అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ హోరెత్తించగా ఊరూ.. వాడ మారుమోగింది. అనంతరం వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేసి ‘పోయిరా.. గౌరమ్మా.. పోయిరావమ్మా’ అంటూ వీడ్కోలు పలికిన మహిళా లోకం తిరిగి ఇంటి బాట పట్టింది.

- మంచిర్యాల,నమస్తే తెలంగాణ/ఆసిఫాబాద్‌

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి బతుకమ్మలను అందంగా పేర్చిన మహిళలు.. సాయంత్రం ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. అనంతరం వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. పోయిరా బతుకమ్మ..పోయిరావమ్మా..అంటూ వీడ్కోలు పలికారు.గౌరీదేవీ పసుపును పుస్తెలకు అంటించుకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ‘కొత్తసిబ్బి.. పాత సిబ్బి’ అంటూ సత్తులు పంచుకున్నారు. కోటపల్లి మండల కేంద్రంలో నిర్వహించి న బతుకమ్మ వేడుకల్లో  ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. దండేపల్లి, నెల్కి వెంకటాపూర్‌, లక్ష్సెట్టిపేట పట్టణంలోని మహాలక్ష్మివాడ, మంచిర్యాల, నస్పూర్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొని మహిళలకు బహుమతులు అందించారు. బెల్లంపల్లిలోని ఏఏంసీ గ్రౌండ్‌, కాల్‌టెక్స్‌ చౌరస్తా, పోచమ్మ చెరువు వద్ద నిర్వహించిన వేడుకలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తిలకించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పలు మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా, కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించారు.                        - మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ఆసిఫాబాద్‌