ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 24, 2020 , 02:00:21

సింగరేణి కార్మికులకు అందిన సొమ్ము

సింగరేణి కార్మికులకు అందిన సొమ్ము

  • వేతనాలు, దసరా అడ్వాన్స్‌, లాభాల వాటా, మార్చి నెల సగం జీతం జమ
  • మరో పది రోజుల్లో దీపావళి బోనస్‌..
  • ఆనందంలో కుటుంబాలు
  • దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎండీ శ్రీధర్‌

సింగరేణి కార్మికులకు దసరా పండుగ ముందే వచ్చింది. సీఎం కేసీఆర్‌ సర్కారు నిర్ణయించిన మేరకు 28 శాతం లాభాల వాటాతో పాటు దసరా అడ్వాన్స్‌, ఈ నెల వేతనం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నెలలో నిలిపేసిన సగం జీతం కూడా యాజమాన్యం అందించింది. ప్రతి ఒక్కరికీ రూ. 60 వేల నుంచి రూ. 1.20 లక్షల దాకా రాగా, మరో 10 రోజుల్లో దీపావళి బోనస్‌ రూ.68,500 కూడా ఇవ్వనున్నది. సింగరేణి వ్యాప్తంగా 43,500 మందికి లాభం చేకూరనుండగా, సర్వత్రా  హర్షం వ్యక్తమవుతున్నది.

- మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌)


 శ్రీరాంపూర్‌ : సింగరేణి కార్మికులకు అక్టోబర్‌లో మూడు విధాలా బెనిఫిట్స్‌ చేతికందడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నెలలో నిలిపివేసిన సగం జీతం, నెల వారి వేతనం, దసరా అడ్వాన్స్‌ రూ.25 వేలు, సింగరేణి సంస్థ లాభాల్లో 28 శాతం వాటా డబ్బులు ఇప్పటికే కార్మికుల ఖాతాల్లో జమయ్యాయి. మరో 10 రోజుల్లో దీపావళి బోనస్‌ రూ.68,500 చేతికందుతుండడంతో సింగరేణి వ్యాప్తంగా దసరా, దీపావళి పండుగలు ముందే వచ్చినట్లయింది. ప్రతి కార్మికుడికీ సుమారు రూ.60 వేల నుంచి 1.20 లక్షల రూపాయల అందనున్నాయి.  సింగరేణి వ్యాప్తంగా 43,500 మంది కార్మికులకు లాభం చేకూరనుంది. కార్మికుల ఖాతాల్లో జమయ్యాయి. సింగిరేణికి వచ్చిన లాభాలు రూ.993 కోట్లల్లో కార్మికుల వాటాగా రూ.278.28 కోట్లు(28 శాతం) శుక్రవారం కార్మికులకు చెల్లించారు గత సంవత్సరం రూ.1766 కోట్లలో కార్మికులకు రూ.494.48 కోట్లు 28 శాతంగా కార్మికులకు చెల్లించారు. సింగరేణి సంస్థ 1999 -2000 సంవత్సరంలో మొదటగా రూ.300 కోట్లతో ప్రారంభమై ప్రతి యేటా లాభాలు సాధిస్తూ  దేశంలోనే ప్రభుత్వరంగ పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సింగరేణి లాభాల్లో  10 శాతం నుంచి 16 శాతం వరకు  కార్మికులకు చెల్లించారు.  తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ 16 శాతమున్న లాభాల వాటాను ప్రస్తుతం 28 శాతానికి పెంచి ఇచ్చారు. బొగ్గు రవాణా గతేడాది కన్నా తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లోనూ లాభాలు తగ్గడంతో సింగరేణి వ్యాప్తంగా ఈ సారి లాభాలు తగ్గాయి.  అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాభాల వాటా 28 శాతం చెల్లించేలా కృషిచేయడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 

ఒకే నెలలో డబ్బులందడం సంతోషంగా ఉంది..


కరోనా ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొన్నప్పటికీ సింగరేణిలో లాభాల వాటాను తగ్గించకుండా ఇవ్వడం సంతోషంగా ఉంది. దసరా అడ్వాన్స్‌, లాభాల వాటా ఖాతాల్లో జమ చేశారు. పది రోజుల్లో దీపావళి బోనస్‌ కూడా వేస్తరట. పండుగ ఖర్చులుపోనూ మిగిలిన డబ్బుతో బ్యాంకు రుణాలు కడుత. సీఎం కేసీఆర్‌ కృషి వల్లే లాభాల్లో వాటా పెరిగింది. లాభాల వాటా చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయించాలి. పెర్క్స్‌పై ఐటీ ఎత్తి వేయాలి.

 - జక్కుల సాగర్‌, బదిలీ వర్కర్‌, శ్రీరాంపూర్‌ ఏరియా