ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 24, 2020 , 02:00:24

సద్దులకు వేళాయే....

సద్దులకు వేళాయే....

  • నేడు పెద్ద బతుకమ్మ  ఊరూరా ఆడిపాడనున్న ఆడబిడ్డలు
  • పూలవనం కానున్న పల్లెలు, పట్టణాలు
  • వేడుకలకు పూర్తయిన ఏర్పాట్లు
  • శుక్రవారం కళకళలాడిన మార్కెట్లు
  • కరోనా నిబంధనలు పాటించాలని  అధికారుల సూచనలు 

సద్దులకు వేళయింది.. నేటి పెద్ద బతుకమ్మ సంబురాలకు ఊరూవాడా ముస్తాబైంది.. ఎనిమిది రోజులపాటు ఆటాపాటలతో హోరెత్తిన వేడుక, శనివారం అంబరాన్నంటనున్నది.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆడిపాడేందుకు మహిళలు సిద్ధం కాగా, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయాచోట్ల వేదికలను సిద్ధం చేయడంతో పాటు చెరువులు, కుంటల వద్ద బారికేడ్లు, లైటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి బతుకమ్మ ఆడాలని సూచిస్తున్నది.

- మంచిర్యాల కల్చరల్‌/తాండూర్‌

మంచిర్యాల కల్చరల్‌/తాండూర్‌ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మను శనివారం ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే మహిళలంతా పూలను తెచ్చి ఏర్పాట్లు చేసుకున్నారు. 
ఇళ్లల్లో సందడి..కొండంత పండుగ కావడంతో ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు పుట్టింటికి చేరుకున్నారు. నేడు మమతానురాగాల బతుకమ్మ పేర్చి ఆడిపాడుతారు. ఏడాదికి సరిపడా ఆనందాన్ని మూటగట్టుకొని తిరిగి వెళ్తారు. 
రద్దీగా మార్కెట్లు.. సద్ద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. ఉదయం నుంచే అటు విక్రయదారులు, ఇటు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి.  ప్రధాన చౌరస్తాలు పూల జాతరను తలపించాయి. 
పూర్తయిన ఏర్పాట్లు..
సద్దుల పండుగ కోసం అన్ని జిల్లాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.  ఆయా చోట్ల పిచ్చిమొక్కలను తొలగించి, బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా స్థలాలను చదును చేశారు. చెరువులు, కుంటల వద్ద నిమజ్జనానికి లైటింగ్‌తోపాటు బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు, రాళ్లవాగు, పోచమ్మ చెరువుతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.