శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 23, 2020 , 00:53:09

జిల్లాకు చేరుకున్న రెండు ‘108’ వాహనాలు

జిల్లాకు చేరుకున్న రెండు ‘108’ వాహనాలు

  • గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా అందించిన విప్‌ సుమన్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • మంచిర్యాల, చెన్నూర్‌ దవాఖానల నుంచి సేవలు
  • త్వరలోనే మందమర్రి దవాఖానకు.. అందుబాటులో అత్యాధునిక పరికరాలు
  • కరోనా నేపథ్యంలో వివిధ సేవలు 
  • జీవీకే ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో పర్యవేక్షణ

మంచిర్యాల అగ్రికల్చర్‌/చెన్నూర్‌ టౌన్‌ : కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్య తీసుకుంటున్నది. విస్తృతంగా కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తూ, వైరస్‌ సోకిన వారిని గుర్తించి సేవలందిస్తున్నది. కొన్ని సందర్భాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నవారిని అత్యవసరంగా తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే అత్యవసర సమయంలో ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముందుకువచ్చారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా గిఫ్ట్‌ ఏ స్మైల్‌ పేరిట క్విక్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను  అందించారు. మంచిర్యాల జిల్లాకు కూడా మూడు వాహనాలను స్థానిక శాసనసభ్యులు అందించారు. ఇందులో ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ రెండు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు ఒకటి చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాకు చేరుకున్నాయి. కాగా, ఒక్కో వాహనానికి ఎమ్మెల్యేలు సొంతంగా .రూ. 20. 50 లక్షలు చొప్పున వెచ్చించారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్‌ ప్రభుత్వ దవాఖానలకు ప్రస్తుతం ఈ వాహనాలు చేరుకున్నాయి. మరొకటి మందమర్రి ప్రభుత్వ దవాఖానకు త్వరలోనే రానుంది.

అత్యవసర సమయాల్లో..

కొవిడ్‌తో బాధపడుతున్న వారికే కాకుండా అత్యవసర సమయంలో వైద్య సేవలు ఈ వాహనం ద్వారా అందనున్నాయి. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, గుండె నొప్పి, పక్షవాతం, నీట మునగడం, వడదెబ్బ, ఆత్మహత్యాయత్నం, విష పదార్థాలు, ద్రవాలు తాగడం, పాము కాటు, ప్రమాదంలో ఉన్న గర్భిణులకు సేవలందించడం, అన్ని సీజనల్‌, మెడికల్‌ వ్యాధులు, సమీప ప్రాంతాల పరిధిలో ఏ ప్రమాదం జరిగినా ఈ సేవలు  ఉచితంగా అందనున్నాయి. 

అత్యాధునిక సౌకర్యాలు...

ఈ అంబులెన్సులో ఆక్సిజన్‌ సిలిండర్‌తో సహా అన్ని సైజుల ఆక్సిజన్‌ మాస్కులు, పెద్ద వారికి, చిన్న వారికి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రత్యేక బాక్స్‌, పురుగుల మందు తాగినా, నోట్లోనే ఉన్నా శ్వాస రావడానికి ఏమీ అడ్డులేకుండా చేసే పరికరం(చేతితోనే సెక్ష న్‌ ఆపరేటిస్‌), బీపీ డిజిటల్‌ మీటర్‌, బీపీ ఆపరేటర్‌, షుగర్‌, జ్వరానికి సంబంధించిన పరికరాలు, విషం విరుగుడుకు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన నెబిలైజర్‌, ఇంజిక్షన్లు, ట్యాబ్లెట్లు, సిరప్‌లు, రక్తస్రావ గాయాలకు డ్రెస్సింగ్‌, రక్తాన్ని కంట్రోల్‌ చేసే డ్రెస్సింగ్‌ ప్యాడ్‌లు, కాళ్ల పట్టీలు, మెడ పట్టీలు, ఫైర్‌ సేఫ్టీ బుడ్డి, అన్ని రకాల గ్లూకోజ్‌లు ఈ అంబులెన్సులో అందుబాటులో ఉంటాయి. పాత అంబులెన్సుల్లో ఒక రోగిని మాత్రమే తరలించే అవకాశం ఉండగా, దీనిలో ఒకేసారి ఇద్దరిని తరలించే అవకాశం ఉంది. 

జీవీకే ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో...

జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ అంబులెన్సులు పని చేయనున్నాయి. ఈ అంబులెన్సుల్లో పైలెట్‌తో పాటు అన్ని అత్యవసర ప్రమాదాలపై అవగాహన కలిగిన ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌(ఈఎంటీ) అందుబాటులో ఉంటారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకొని బాధితుల పరిస్థితిని అంచనా వేసి ప్రథమ చికిత్స అందిస్తారు. అవసరమైతే 108 సంస్థ డాక్టర్‌ను ఫోన్‌లో సంప్రదించి అక్కడి నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా క్షతగాత్రులకు ఉపశమన 

చర్యలు చేపడుతారు. 

ఫ్లించ్‌ : కాలి, చేతి బొక్కలు విరిగినప్పుడు ఫ్లించ్‌ను ఉపయోగిస్తారు. దీని ద్వారా బొక్కలు అటు, ఇటు కదలకుండా ఉంటాయి.

ఫైర్‌ సేప్టీ బుడ్డి : అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

డెలివరీ కిట్‌ : సాధారణ కాన్పు సమయంలో ఉపయోగించేందుకు డెలివరీ కిట్‌ అందుబాటులో ఉంటుంది. ఇందులో గ్లౌజ్‌లు, మాస్కులు, వార్మ్‌ టవళ్లు, బొడ్డు తాడుకు వేసే క్లాంపులు, బ్లేడ్లు, స్పాంజర్స్‌, గాజు ప్యాడ్స్‌, బేబీ టవల్స్‌, బేబీని వేడిగా ఉంచేందుకు బ్లాంకెట్స్‌తో పాటు తల్లి కోసం సురక్షితమైన దుస్తులు ఉంటాయి.

అందుబాటులో ఉండే మందులు : గుండె నొప్పికి సంబంధించినవి, బీపీ, విషం విరుగుడు, శ్వాస కోశ ఇబ్బందులతో ఉన్న వారికి, నొప్పులకు, జ్వరాలకు, ఫిట్స్‌(మూర్చ), డయేరియా వారికి గ్లూకోజ్‌లు, ఎక్కువ రక్తస్రావం జరుగకుండా, వాంతులు, విరేచనాలకు మందులు అందుబాటులో ఉంటాయి. అలాగే సిరంజీలు, సిరప్‌లు కూడా ఉంటాయి.

వీటితో పాటు వెహికిల్‌ ఎమర్జెన్సీ టూల్‌ కిట్‌ ఉం టుంది. ఈ కిట్‌లో గొడ్డలి, రంపం, గడ్డపార, నైలాన్‌ తాడు, ఛావర్‌, వైర్‌ కట్టర్‌ అందుబాటులో ఉంటాయి.

నెబిలైజర్‌ : దీనిని ఆస్తమా రోగులకు ఉపయోగిస్తారు. బ్రీతింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి దీని ద్వారా వైద్యం అందిస్తారు. ఇది చిన్న పిల్లలకు, పెద్దలకు వేర్వేరు మాస్కులు ఉంటాయి.

స్ట్రెచర్‌ : రోగులను సురక్షితంగా అంబులెన్సులోకి ఎక్కించేందుకు, దించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూడు రకాల స్ట్రెచర్స్‌ ఉంటాయి. ఆటో రీల్‌ లోడెబుల్‌, ఎస్‌ఎంఆర్‌డీ(స్పైనల్‌ మోషన్‌ రిఫ్లెక్షన్‌ డివైజ్‌), స్కూప్స్‌ స్ట్రెచర్‌ ఉంటాయి.

వీల్‌ చైర్‌ : రోగి నడువలేని పరిస్థితిలో ఉంటే ఈ వీల్‌ చైర్‌ను ఉపయోగిస్తారు.

మెడపట్టీలు : మూడు విధాలుగా మెడ పట్టీలుంటాయి. మెడకు, తలకు దెబ్బలు తాకినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. 

సక్షన్‌ ఆపరేటర్‌ : పాయిజన్‌, రక్తం గడ్డ కట్టడం, పాము కాటు తదితర సమయాల్లో దీనిని ఉపయోగించి రోగికి గాలి సరఫరా సక్రమంగా జరిగేలా  చూడవచ్చు. 

గ్లూకో మీటర్‌ : షుగర్‌ వ్యాధిగ్రస్తులకు, అన్‌కండీషన్‌లో ఉన్న రోగుల కోసం దీనిని ఉపయోగిస్తారు. షుగర్‌ 100 టూ 110 ఉండాలి. 

థర్మా మీటర్‌ : రోగి ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. సాధారణ 

ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారన్‌హీట్స్‌ ఉండాలి. 101, 102 డిగ్రీలుంటే జ్వరంతో బాధపడుతున్నట్లు 

పరిగణలోకి తీసుకుంటారు.

ఆక్సిజన్‌ సిలిండర్‌ : దీని సామర్థ్యం 150 కేజీసీఎం2 ఉంటుంది. దాదాపు 15 గంటల వరకు ఆక్సిజన్‌ను అందించగలదు.

మానిటర్‌ : దీనిలో రోగి బీపీ, పల్స్‌, టెంపరేచర్‌, ఈసీజీ, ఎస్‌బీఓటును తెలుసుకోవచ్చు. ఎస్‌బీఓటు ద్వారా కొవిడ్‌ (దమ్ము, దగ్గు ఉన్న) రోగులను గుర్తించవచ్చు. 

అంబూ బ్యాగ్స్‌ : రోగికి శ్వాస అందని సమయంలో అంబూ బ్యాగ్స్‌ను ఉపయోగిస్తారు. గాలి సరిగా వెళ్లేందుకు శ్వాస నాళాలను వెడల్పు చేస్తుంది. ఇవి పెద్ద వారికి, చిన్న వారికి ప్రత్యేకంగా ఉంటాయి.

బీపీ ఆపరేటర్‌ : రోగి యొక్క బ్లడ్‌ ప్రెషర్‌(రక్త పీడనం)ను తెలుసుకోవచ్చు. దీని ద్వారా హైపర్‌ టెన్షన్‌(అధిక), హైపో(లో) టెంపరేచర్‌ను తెలియజేస్తుంది.

ఈసీజీ : దీని ద్వారా రోగిగుండె వేగం, గుండె పని తీరును తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇది బీపీ, చాతి నొప్పి, గుండెనొప్పి సమస్యలతో వచ్చే వారికి ఉపయోగిస్తారు.

ఏసీ : ఈ అంబులెన్సులో ఏసీ ఉంటుంది. అగ్నిప్రమాదంలో శరీరం కాలినప్పుడు వారికి ఉపయోగకరంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి బీపీ, హార్ట్‌ ఎటాక్‌, తదితర ఇతర రోగులకు సైతం ఉపయోగిస్తుంటారు.

లారింజెస్‌ స్కోప్‌ : శ్వాస ఆడక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఈ లారింజెస్‌ స్కోప్‌ను ఉపయోగిస్తారు. గొంతు నుంచి శ్వాసనాళం వరకు ట్యూబ్‌ వేయడం వల్ల శ్వాస సక్రమంగా ఆడుతుంది. దీనిని ఇంక్యుబేషన్‌ అంటారు.
తాజావార్తలు