మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Oct 19, 2020 , 02:20:00

లాభాల బంతి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం

లాభాల బంతి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతున్న ఘన్‌పూర్‌ రైతు నర్సయ్య

ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి

కిలోకు రూ. 50 నుంచి రూ. 70 వరకు ధర

రూ. లక్షన్నర దాకా ఆదాయం

నెన్నెల : మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు మెండె నర్సయ్య బంతి పూలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. గతేడాది తనకున్న కొద్దిపాటి భూమిలో బంతిపూలు సాగు చేయగా, మంచి ఆదాయం వచ్చింది. దీంతో ఈ యేడాది ఎకరంలో బంతిపూలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. విత్తనాలు వేస్తే ఆలస్యమవుతుందని కరీంనగర్‌కు వెళ్లి నర్సరీ నుంచి మూడు వేల పూల మొక్కలు (రెండు రకాలు) తీసుకువచ్చాడు. ఒక్కో మొక్కకు రూపాయి చొప్పున చెల్లించాడు. జూన్‌లో వాటి ని నాటగా.. ప్రస్తుతం పంట చేతికి వస్తున్నది. పూల తోట లో సస్యరక్షణ చర్యలు చేపడితే 60 నుంచి 70 రోజుల వ్యవధిలో పంట కోతకు వస్తుంది. దినం తప్పి దినం పం ట కోతకు వస్తూనే ఉంటుందని, ఎకరంలో దాదాపు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చని రైతు చెబుతున్నా డు. కిలోకు రూ. 50 నుంచి రూ. 70 వరకు ధర ఉంటుం ది. ఈ లెక్కన ఎకరానికి రూ. లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల దాకా ఆదాయం పొందవచ్చని ఆయన చెబుతున్నాడు. తక్కువ సమయం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే వీలుంటుందని, అదే మిగతా పంటలు సాగు చేస్తే ఖర్చు అధికంగా ఉంటుందని, దానికంటే పూల సాగే లాభదాయకమని రైతు చెబుతున్నాడు.

మార్కెట్‌లో మంచి డిమాండ్‌..

ఈ సీజన్‌లో బంతిపూలకు మంచి గిరాకీ ఉంటుంది. బతుకమ్మ పండుగ.. ఆ తర్వాత అయ్యప్ప స్వాముల దీక్షలు, దీపావళి పండుగ ఉంటుంది. ఇందుకోసం రైతులు పండుగలకు పంట అందేలా ప్రణాళికతో సాగు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలోకు రూ. 70 దాకా ధర పలుకుతుంది.logo