గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Oct 18, 2020 , 02:34:10

‘ధరణి’ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి

‘ధరణి’ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలి

తహసీల్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలి    

అధికారులకు శిక్షణ ఇవ్వాలి    

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

మంచిర్యాల అగ్రికల్చర్‌ : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్‌ను  దసరా రోజున ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశించారు. ధరణి పోర్టల్‌ ప్రారంభంపై శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ నెల 19న ముందస్తుగా తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌ నిర్వహణపై శిక్షణ ఇవ్వడంతో పాటు కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతనిస్తూ పర్యవేక్షించాలన్నారు. ఈ పోర్టల్‌ పూర్తి బయోమెట్రిక్‌ ఉంటుందని, వ్యవసాయేతర భూముల లాండ్‌ కన్వర్షన్‌ అవుతుందని, వేలిముద్ర స్కానర్‌, సీసీ కెమెరా ఇతరత్రా పూర్తి సౌకర్యాలతో కార్యక్రమ నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హోళికేరి మాట్లాడుతూ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్‌ అధికారులు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.  రిజిస్ట్రేషన్‌ సమయంలో స్లాట్‌ బుకింగ్‌, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, స్టాంప్‌ డ్యూటీ, వేలిముద్ర స్కాన్‌, ఫొటో, డిజిటల్‌ సైన్‌, రిజిస్ట్రేషన్‌లో పాల్గొనే వారి పూర్తి వివరాలు, భూమి వివరాలు, తదితర వాటిపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రతి మండలంలో 10 డమ్మి రిజిస్ట్రేషన్లు చేయించి, అధికారులకు సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. 

అధికారులకు శిక్షణ తరగతులు...

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టరేట్‌లోని హాలులో మండలాల తహసీల్లార్లకు, రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ధరణి పోర్టల్‌ నిర్వహణపై కలెక్టర్‌ భారతీ హోళికేరి శిక్షణ తరగతులు నిర్వహించారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు రమేశ్‌, శ్యామలాదేవి, మండలాల తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo