శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Oct 14, 2020 , 01:46:17

సమస్యలు పరిష్కరించండి

సమస్యలు పరిష్కరించండి

  • దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఎంపీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు వినతి

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లాలో రైల్వే శాఖ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు విన్నవించారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యాను మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే కలిశారు. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ వరకు అదనంగా రైలు వేయాలని కోరారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫాంపై మరో టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. మంచిర్యాల పట్టణంలో హమాలీ జెండా నుంచి వసంత టాకీస్‌ వరకు రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని, నస్పూర్‌ కోల్‌బెల్డ్‌ ఏరియా నుంచి జైపూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వరకు నిర్మించిన సింగిల్‌ రైల్వే ట్రాక్‌పై కృష్ణ కాలనీ వద్ద రైల్వే గేట్‌ను ఏర్పాటు చేసి గార్డును నియమించాలని విన్నవించారు. భద్రాచలం రోడ్డు నుంచి సిర్పూర్‌ వరకు వెళ్లే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌లో అదనంగా టాయిలెట్లతో కూడిన కోచ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. మంచిర్యాలలో ట్రాఫిక్‌ పెరుగుతున్న దృష్ట్యా రాజీవ్‌నగర్‌ వద్ద ఉన్న అండర్‌ కల్వర్ట్‌ నంబర్‌ 150 గురించి జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో పలు ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్‌ గురించి ఆయనను అడిగారు. దీనికి జీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు.