బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Oct 11, 2020 , 06:09:01

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి పెద్దపీట

‘నమస్తే’ ఇంటర్వ్యూలో డీఏవో వినోద్‌కుమార్‌

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లా ఏర్పాటు తర్వాత ఈ నాలుగేళ్లలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వుల్లోజు వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లండించారు. ఉమ్మడి జిల్లాలో రైతు సమస్యలు పరిష్కరించడం ఇబ్బందిగా ఉండేదని, కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత అధికారులు వారికి అందుబాటులో ఉంటూ సలహాలు.. సూచనలు అందిస్తున్నారని తెలిపారు. 

నమస్తే : జిల్లా ఏర్పాటు వల్ల రైతులకేమైనా మేలు జరుగుతుందా?

డీఏవో : జిల్లాగా ఏర్పడిన తర్వాత పాలన పరంగా ఎం తో మేలు జరుగుతుంది. అధికారులు రైతులకు అందు బాటులోకి వచ్చారు. క్లస్టర్ల వారీగా ఏఈవోలు రైతుల కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ.. వారు ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నారు.

నమస్తే : ఎరువులు, విత్తనాల సమస్య ఉందా?

డీఏవో : జిల్లాకు కావాల్సిన ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎలాంటి జాప్యం ఉండడం లేదు. గతంలో ఆదిలాబాద్‌ మార్క్‌ఫెడ్‌ నుంచి ఎరువులు వచ్చేవి. దూరంగా ఉండడం వల్ల రవాణాకు ఇబ్బంది అయ్యేది. ప్రస్తుతం జిల్లాలోనే మార్క్‌ఫెడ్‌ ఏర్పాటైంది. దీంతో ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలు ఏర్పడడంతో రైతులకైతే అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంటున్నాయి.

నమస్తే : సాగు విస్తీర్ణం పెరిగిందా?

డీఏవో : గతంలోకంటే జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. వరి పంట సాగు గతంలో ఎన్నడూ లేనివిధంగా రెట్టింపైంది. అలాగే పండించిన పంటను సైతం అమ్ముకునేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగడం లేదు.

నమస్తే : రైతు వేదికలతో ఎలాంటి మేలు జరుగనున్నది?

డీఏవో : క్లస్టర్‌కు ఒక రైతు వేదిక ఏర్పాటవుతుంది. క్లస్టర్‌ పరిధిలో ఐదు వేల ఎకరాల సాగు భూమికి సంబంధించిన రైతులుంటారు. గతంలో ఏఈవోకు ఎలాంటి కార్యాలయంగాని, రైతులు పంటల గురించి చర్చించుకునేందుకు ఎలాంటి వేదికలుగాని లేవు. ఈ రైతు వేదికలు అందుబాటులోకి వస్తే రైతులు వారి సమస్యల గురించి మాట్లాడుకునే వీలుంటుంది. వ్యవసాయ అధికారులు సైతం అందుబాటులోకి రానున్నారు.

నమస్తే : పంటల సాగులో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా?

డీఏవో : రైతులు పంటలు సాగు చేయడంలో ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. సాగుకు ఎలాంటి సమస్య రాకుండా 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు ప్రాజెక్టుల ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో సాగు శాతం రెట్టింపైంది. పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావద్దనే ఉద్దేశంతో రైతుబంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలు, ఏదేని ప్రమాదంలో రైతు మృతి చెందితే ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల ప్రమాద బీమా అందజేస్తుంది. 

నమస్తే : నియంత్రిత సాగు విధానం అమలవుతుందా?

డీఏవో : ఈ ఏడాది నియంత్రిత సాగు విధానం అమలు చేశారు. ఇది వంద శాతం సక్సెస్‌ అయ్యింది. దీంతో మూస విధానానికి పులిస్టాప్‌ పడినైట్లెంది. అన్ని రకాల పంటలను భూమి స్వభావాన్ని, నీటి ఆధారంగా సాగు చేస్తున్నారు.logo