ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Oct 11, 2020 , 06:09:01

సర్కారు దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం

 సర్కారు దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం

‘నమస్తే’ ఇంటర్వ్యూలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నీరజ

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లా ఏర్పడిన తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మకంగా మార్పులు చోటు చేసుకున్నాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి నీరజ పేర్కొన్నారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేశారని తెలిపారు. సర్కారు దవాఖానల్లో కార్పొరేటు స్థాయిలో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. 

నమస్తే : ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందా?

డీఎంహెచ్‌వో : నాటికి, నేటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానకు రావాలంటే ప్రజలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం ప్రతి రోజూ 300 ఓపీ ఉంటుందంటే ఏ మేరకు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

నమస్తే : దవాఖానల్లో సౌకర్యాలు ఏమైనా మెరుగయ్యాయా?

డీఎంహెచ్‌వో : జిల్లా ఏర్పడిన తర్వాత ఈ నా లుగేళ్లలో ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌక ర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్‌ స్థాయిలో సిటీ స్కాన్‌, ప్రత్యేకంగా ఐసీయూ గది ఏర్పాటు చేశాం. జిల్లాలో డయాలసిస్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

నమస్తే : రోగులకు సక్రమంగా సేవలు అందుతున్నాయా?

డీఎంహెచ్‌వో : 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. గతంలో వైద్యుల కొరత ఉండేది. ప్రస్తుతం వైద్య పోస్టులన్నీ భర్తీ చేశారు. దీంతో ఎంతో మంది పేద వారికి మెరుగైన వైద్యం అందుతుంది.

నమస్తే : పల్లెల్లో సేవలు ఎలా అందిస్తున్నారు?

డీఎంహెచ్‌వో : జిల్లా కేంద్రంతో పాటు బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట, మంచిర్యాల యూపీహెచ్‌సీలు, అన్ని పీహెచ్‌సీలలో వైద్యుల నియామకం చేపట్టడంతో అందరికీ వైద్యం అందుబాటులోకి వచ్చింది. పల్లెల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ పేదలకు సేవల అందిస్తున్నాం.

నమస్తే : ఏఎన్‌ఎంలు అందించే సేవలు గురించి చెబుతారా?

డీఎంహెచ్‌వో : జిల్లాలోని ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌లు ఇచ్చి రోగుల వివరాలు నమోదు చేయిస్తున్నాం. హెల్త్‌ప్రొఫైల్‌తో దీర్ఘకాలిక రోగాలకు సరైన సమయంలో మందులు అందజేస్తున్నాం. పల్లెల్లోకి వెళ్లి సేవలు వేగంగా అందించేందుకు ఏఎన్‌ఎంలకు సబ్సిడీపై స్కూటీలు సైతం ప్రభుత్వం అందజేసింది.

నమస్తే : గర్భిణులకు అందిస్తున్న సేవలు ?

డీఎంహెచ్‌వో : జిల్లాలో 104, 108 వాహనాల సంఖ్య పెరిగింది. గర్భిణులను పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చేందుకు అమ్మ ఒడి(102) వాహనాలను అందుబాటులో ఉంచాం. దవాఖానకు తీసుకురావడం, తిరిగి ఇంటి వద్ద దింపేందుకు ఇవి ఉపయోగిస్తున్నాం. పాఠశాలలకు వెళ్లి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆర్‌బీఎస్‌కే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

నమస్తే : ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య పెరిగిందా.. తగ్గిందా?

డీఎంహెచ్‌వో : గతంతో పోల్చితే ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందుతుండడంతో డెలివరీల కోసం వచ్చే వారి సంఖ్య అమాంతంగా పెరిగింది. మరోవైపు డెలివరీ అయిన వారికి ప్రభుత్వం రూ. 2500 విలువ గల కిట్‌ (కేసీఆర్‌ కిట్‌) ఇవ్వడమే కాకుండా గర్భం దాల్చిన నాటినుంచి డెలివరీ అయిన తర్వాత కూడా పోషకాహారం, పండ్లు ఇతర ఖర్చుల కోసం రూ. 12 వేలు అందజేస్తున్నది. జిల్లా ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి.logo