మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Oct 11, 2020 , 06:08:59

ప్రజాహితం.. ప్రగతిపథం

ప్రజాహితం.. ప్రగతిపథం

  • కొత్త జిల్లాలు కొలువుదీరి నేటికి నాలుగేండ్లు
  • వికేంద్రీకరణతో ప్రజల చెంతకు సుపరిపాలన 
  • తగ్గిన దూరభారం, వ్యయ ప్రయాసలు.. 
  • పజల వద్దకే వెళ్తున్న అధికార యంత్రాంగం  
  • పెరిగిన పర్యవేక్షణ.. సమస్యలకు సత్వర పరిష్కారం..

కొత్త జిల్లాలు ఆవిర్భవించి ఆదివారం నాటికి నాలుగేండ్లు అవుతున్నాయి. అడవిబిడ్డల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌ విస్తీర్ణంలో విశాలమైనది. ప్రజల సౌకర్యార్థం నాలుగు జిల్లాలుగా విభజించారు. ఫలితంగా ప్రజాహితమే ధ్యేయంగా.. ప్రగతి పథమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సుపరిపాలన సాగిస్తున్నారు. వికేంద్రీకరణ నిర్ణయంతో ప్రజల చెంతకు పాలన వేగంగా చేరుకున్నది. సంక్షేమ పథకాలు అర్హులకే వేగంగా అందుతున్నాయి. అధికారుల దర్శనం కలిగితే చాలనే పరిస్థితికి తెరపడి, ప్రజలే ప్రభువులనే ఒరవడి ఏర్పడింది. సుదీర్ఘకాలంగా అభివృద్ధే ఎరుగని మారుమూల పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా ప్రతిరంగంలో దూసుకుపోతున్నది. దూరభారం, వ్యయ ప్రయాసలు తగ్గడం, అధికారులు-ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పెరగడం వంటివి ప్రగతి చిహ్నాలుగా నిలుస్తున్నాయి.  

- నిర్మల్‌/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దది. అత్యధిక అటవీ విస్తీర్ణం, గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లా ఇదే. ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంగా ఉండగా.. సిర్పూర్‌(టి), చెన్నూర్‌, ముథోల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల నియోజకవర్గాల్లోని గ్రామాలకు 150-250 కిలోమీటర్ల దూరం ఉండేది. ఈ గ్రామాల ప్రజలు మండల కేంద్రాలకు ఆటోల్లో వచ్చి.. అక్కడి నుంచి ప్రధాన పట్టణాలు, డివిజన్‌ కేంద్రాలకు బస్సుల్లో చేరుకొని.. అక్కడి నుంచి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి వస్తుండేవారు. బాసర, ముథోల్‌, బెజ్జూర్‌, దహెగాం, చెన్నూర్‌, కోటపల్లిలాంటి మండలాల నుంచి వచ్చేవారు మూడు నాలుగు బస్సులు మారాల్సి వచ్చేది. దూరభారం, వ్యయప్రయాసలు తగ్గించడం, ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచడం, పాలనలో పారదర్శకత, సమర్థవంతమైన పర్యవేక్షణ, అవినీతికి తావులేకుండా ఉండేందుకు, క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించేందుకు జిల్లాల పునర్విభజన చేశారు. 2016 అక్టోబర్‌ 11న కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లాలుగా విభజించారు.      - నిర్మల్‌/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ

పెరిగిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఉన్నప్పుడు అర్జీలు లక్షల సంఖ్యలో వచ్చేవి. వీటిని అధికారులు పరిష్కరించేందుకు చాలాకాలం పట్టేది. ఏదైనా మారుమూల ప్రాంతంలో ప్రమాదం, నేరం జరిగినపుడు పోలీసులు వెళ్లడానికి అవస్థలు పడేవారు. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలంటే సాధ్యం కాకపోయేది. ప్రస్తుతం జిల్లాస్థాయి అధికారులు కూడా వారానికో సారి ప్రతి మండలానికి వెళ్తుండగా.. కలెక్టర్‌, ఎస్పీ కూడా పది రోజులకోసారి అన్ని మండలాలు చుట్టి వస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ బాగా పెరిగింది. దీంతో నిర్లక్ష్యంగా పనిచేసే కిందిస్థాయి సిబ్బంది ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. కలెక్టర్లు కొత్త కొత్త కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. చిన్న జిల్లాలు అయ్యాక పోలీసింగ్‌పై ప్రశంసలు పెరిగాయి. జిల్లా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, విజిబుల్‌ పోలీసింగ్‌, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమల్లోకి వచ్చాయి.

ప్రగతి పరుగులు..

ప్రతి జిల్లాలో లీడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకావడంతో ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు దగ్గరయ్యా యి. రుణ ప్రణాళిక అమలు సులువైంది. వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, డ్వాక్రా మహిళలకు రుణాలు, డిపాజిట్లు బాగా పెరిగాయి. కొత్త జిల్లా కేంద్రాల్లోనే జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కావడంతో ఉన్నతాధికారులు రావడం, వ్యాపార సముదాయాలు కూడా పెరగడంతో అభివృద్ధికి చిరునామాగా మారాయి. ఆయా జిల్లాకేంద్రాలతోపాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో కూడా భూముల ధరలు రెట్టింపయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా బాసర, ఆసిఫాబాద్‌లకు నవోదయ విద్యాలయాలు వచ్చాయి. బాసర, కుంటాల, పొచ్చెర లాంటి దేవాలయాలు, జలపాతాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో 30-35 లక్షల మంది జనాభా ఉండగా.. ప్రస్తుతం జిల్లాకు 7-8 లక్షల జనాభా ఉంది. జనాభా తక్కువగా ఉండడంతో పేదలను గుర్తించి పథకాలు అమలు చేస్తున్నారు. కలెక్టర్‌, ఎస్పీ, జడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులకు జిల్లా వివరా లు తెలుస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఒకేరకమైన విధులు నిర్వర్తించే వివిధ శాఖలను కలిపేశారు. ఎస్‌ఈలు, డీడీలు, ఈడీలు, సంరక్షణా ధికారులను జిల్లా అభివృద్ధి అధికారులుగా మార్చారు.


అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, బతుకమ్మ చీరెల పంపిణీ, రైతులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక కూడా పారదర్శకంగా సాగుతున్నది. ప్రధానంగా ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ పథకాలకు భూసేకరణ  వేగవంతంగా జరుగుతున్నది. గతంలో పెద్ద జిల్లాలు కావడంతో భూమి సేకరించడానికి చాలా సమయం పట్టేది. జిల్లాల ఆవిర్భావం తర్వాత ఒక్కో జిల్లా కలెక్టర్‌ పరిధి చాలా చిన్నది కావడం, సేకరించాల్సిన భూమి కూడా స్వల్ప విస్తీర్ణమే కావడంతో కలెక్టర్లు నేరుగా రైతులతో మాట్లాడి భూసేకరణ చేస్తున్నారు. జిల్లాకు రెండు, మూడు నియోజకవర్గాలే కావడంతో చాలాచోట్ల ఎమ్మెల్యేలు కలెక్టర్ల మధ్య సయోధ్య పెరిగింది. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండున్నర నియోజకవర్గాల చొప్పున, మంచిర్యాల జిల్లా మూడు నియోజక వర్గాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెండు నియోజకవర్గాలతో ఏర్పడింది. గతంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండడంతో అందరికీ ఒకేలా ప్రాధాన్యం ఇవ్వలేక.. ఒకరికి ప్రాధాన్యం ఇస్తే మరొకరితో ఇబ్బందులు, ఒత్తిళ్లు ఉండేవి. ఇప్పుడు ఉండేదే ఇద్దరు కావడంతో అధికారులకు వెసులుబాటుగా మారింది.

సమావేశాల్లో సమస్యలపై ప్రధాన చర్చ

కొత్త జిల్లాల ఆవిర్భావం నాటికి జడ్పీ పాలకవర్గం గడువు ముగియలేదు. రెండున్నరేళ్లపాటు ఉమ్మడిగానే కొనసాగింది. జడ్పీతోపాటు మండల పరిషత్‌లు కూడా ఉమ్మడిగా ఉండగా.. 2019 మేలో వీటికి ఎన్నికలు నిర్వహించగా.. జూన్‌ నెలలో ఫలితాలు ప్రకటించారు. జూలై నెలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో ఉమ్మడి జడ్పీ ఉండడంతో జడ్పీ సభ్యులు ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశాలకు వెళ్లాలంటే దూరభారంతో పాటు వ్యయ ప్రయాసలు ఉండేవి. చాలా మంది సభ్యులు గైర్హాజరయ్యేవారు. ప్రస్తుతం నాలుగు జిల్లాలకూ జడ్పీలు ఉండగా.. కొత్త పాలక వర్గాలు రావడంతో దూరభారం, వ్యయప్రయాస తగ్గడంతో పూర్తిస్థాయిలో సభ్యులు సమావేశాలకు వస్తున్నారు. గతంలో విస్తీర్ణం, మండలాలు ఎక్కువ ఉండడంతో సమస్యలు, వివిధ శాఖలపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేది కాదు. కొత్త జడ్పీల ఏర్పాటుతో పరిధి తగ్గడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం, సమస్యలకు పరిష్కారం చూపడం సులభమవుతున్నది. అన్ని శాఖలపై చర్చకు అవకాశం లభించడంతో పాటు సభ్యులందరూ తమ ప్రాంత సమస్యలు సమావేశం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఏర్పడింది. ఇటీవల చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి విజయవంతం కావడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంతో పాటు అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతున్నది. చిన్న జిల్లాలతో ప్రగతి ముమ్మరమై.. ప్రజల వద్దకు పాలన చేరింది.

దూరభారం, వ్యయం తగ్గింది..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాలు, పోటీ పరీక్షలకు రావాలంటే ఒక రోజు ముందుగానే బయలుదేరాల్సి వచ్చేది. అక్కడే లాడ్జీలు బుక్‌ చేసుకోవడం.. లేదంటే స్నేహితులు, బంధువుల ఇండ్లలో ఉండేవారు. మరుసటి రోజు పనులు చూసుకొని రావాల్సి వచ్చేది. రెండు నుంచి మూడు నియోజకవర్గాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో భౌగోళిక, ప్రజా సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించింది. ప్రస్తుతం జిల్లాకేంద్రాలు అన్ని మండలాలకు దగ్గరగా వచ్చాయి. చివరి మండలం కూడా 60-70 కిలోమీటర్ల లోపే ఉంది. గతంలో బెజ్జూర్‌ నుంచి బాసర వరకు 300 కిలోమీటర్లకుపైగా దూరం ఉండగా.. ప్రస్తుతం దూరభారం తగ్గింది. అన్ని జిల్లాల్లోనూ మారుమూల గ్రామం నుంచి కూడా జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బందులు తొలిగిపోయాయి. ఉదయం వచ్చి పనులు ముగించుకొని మధ్యాహ్నం వరకు తిరిగిపయనం అవుతున్నారు. జిల్లాల విభజన ప్రజలకు సౌలభ్యంగా మారింది.
logo