బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Oct 06, 2020 , 00:12:30

ఆపత్కాలంలో సేవలందిస్తున్న పార్థివ వాహన సిబ్బంది

ఆపత్కాలంలో సేవలందిస్తున్న పార్థివ వాహన సిబ్బంది

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పార్థివ(మార్చురీ) వాహన సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నా.. ఏ మాత్రం భయపడకుండా ముందుకు సాగుతున్నారు. వివిధ కారణాలతో మృతిచెందిన వారి శవాలను స్వగ్రామాలకు తరలిస్తున్నారు. దీనికితోడు కొవిడ్‌-19, అనాథ శవాలకు ఆ నలుగురై.. అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయినవారే దగ్గరకు వచ్చేందుకు వెనుకడుగు వేస్తుండగా, అన్నీతామై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరితో వాహనంలో ఉండే ఆ ఇద్దరు అటెండర్లు, ఇద్దరు పైలెట్లు శభాష్‌  అనిపించుకుంటున్నారు.        - మంచిర్యాల అగ్రికల్చర్‌

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల జిల్లాకేంద్రంలోని దవాఖానలో వారంలో కనీసం 15 నుంచి 20 మందికి పోస్టుమార్టం నిర్వహించే వారు. ఈ దవాఖానకు మంచిర్యాల జిల్లా వాసులే కాకుండా సమీప కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి కూడా వివిధ ప్రమాదాల్లో గాయపడ్డవారితో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన వారిని తీసుకువచ్చే వారు. ఆ క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినా, దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందినా ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించే వారు. అనంతరం సదరు మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించాలంటే వేలాది రూపాయలు ఖర్చు అయ్యేవి. స్థానిక ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు ఇదే అదనుగా భావించి బేరాలు ఆడేవారు. అందినకాడికి దండుకునేవారు. ఒక్కోసారి వైద్యానికయ్యే ఖర్చుకంటే.. పార్థివ దేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చే ఎక్కువగా ఉండేది. కొన్ని సందర్భాల్లో మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులు లేకుంటే స్థానిక వైద్యులు, సిబ్బందే చందాలు వేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. పార్థివ వాహనం రాకతో..తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదల దీనస్థితిని గమనించి పార్థివ(మార్చురీ) వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 2016, నవంబర్‌ 16న మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖానలో జీవీకే-ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్థివ వాహనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు ప్రారంభించారు. ఈ వాహనంలో ఇద్దరు అటెండర్లు, ఇద్దరు పైలెట్లు సేవలందిస్తున్నారు.

1400 మృతదేహాల తరలింపు..

జీవీకే-ఈఎంఆర్‌ఐ పార్థివ వాహనంలో జిల్లా ప్రభుత్వ దవాఖాన నుంచేగాకుండా జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టుమార్టం చేసిన మృత దేహాలను వారి స్వగ్రామాలకు ఉచితంగా చేరవేస్తున్నారు. అంతేగాకుండా వివిధ కారణాలతో వైద్యం పొందుతూ మృతి చెందిన అనాథ శవాలనూ సమీప గోదావరి నది తీరానికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకు సుమారు 1400 మృతదేహాలను తరలించారు.

కరోనా సమయంలో 162 మందిని..

కొవిడ్‌-19తో మృతి చెందిన వారి పార్థివ దేహాల వద్దకు రావడానికి కుటుంబ సభ్యులు సైతం భయపడుతుండగా.. ‘ఆ నలుగురే’ అన్నీ తామై దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌లో 31 మందిని, మేలో 33 మందిని, జూన్‌లో 29, జూలైలో 35, ఆగస్టులో 34 మంది వివిధ కారణాలతో మృతి చెందగా.. వారి మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చారు. మరోవైపు పలువురు కరోనా పాజిటివ్‌తో మృతి చెందగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకు తెలియజేసి దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం పార్థివ వాహనంతో పాటు చనిపోయిన ప్రాంతంలో పూర్తిగా శానిటైజ్‌ చేసి ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

గర్వంగా ఉంది..

ఇది వరకు మృతదేహాలను బంధువులు చెప్పిన చోటికి తీసుకెళ్లి అప్పగించేవాళ్లం. కానీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటి నుంచి చాలా భయమేస్తుంది. తర్వాత వైద్యులు, జీవీకే ఈఎంఆర్‌ఐ అధికారులు చెప్పిన సూచనల మేరకు విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు సేవలు అందిస్తున్నాం. ఆపత్కాలంలో సేవలందిస్తున్నందుకు గర్వంగా ఉంది.- పెట్టం సత్తయ్య, పైలెట్‌, పార్థివ వాహనం

ఈ సేవలు మరచిపోలేం

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అందిస్తున్న సేవలను ఎన్నటికీ మర్చిపోలేం. బాధిత కుటుంబ సభ్యులు మా సేవలను గుర్తుంచుకుంటారు. తల్లిదండ్రులకు దహన సంస్కారాలు చేసే గొప్ప భాగ్యం వారి కుటుంబ సభ్యులకు ఉంటుంది. కానీ కరోనాతో మృతి చెందిన వారికి దహన సంస్కారాలు చేసే బాధ్యత ప్రభుత్వం మాపై ఉంచింది.- బియ్యాల మల్లేశ్‌, పైలెట్‌, పార్థివ వాహనం

మొదట భయపడ్డాం

కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి. తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్లతోనే మరొకరికి వ్యాపిస్తుంది. మొదట వారిని తాకాలంటే చాలా భయపడ్డాం. ఈ కరోనా సమయంలో సాధారణంగా చనిపోయిన వారి మృతదేహాలను సైతం వారి కుటుంబ సభ్యులే ముట్టుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇలాంటి సమయంలో సేవలందిస్తూ మెప్పు పొందుతున్నాం.       - ఆనంద్‌, అటెండర్‌

ఇది గొప్ప సేవగా భావిస్తున్నా

సాధారణంగా ఎవరైనా చనిపోతే వారి పాడె మోసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వెళ్తుంటారు. దహనసంస్కారాలయ్యేం త వరకు వారి వెంట ఉం టారు. కానీ కరోనా సమయంలో సొంత వారే రావడం లేదు. ఈ సమయంలో వారికి దహ నసంస్కారాలు చేయడం గొప్ప సేవగా భావిస్తున్నా. ఎవరైనా ఒక నాటికి పోక తప్పదు. అలాగని ప్రాణానికి భయపడితే పని కాదు.- అప్పని కొమురయ్య, అటెండర్‌

పీపీఈ కిట్లు అందిస్తున్నాం..

జిల్లాలో ఒకే ఒక్క పార్థివ వాహనం ఉంది. రెండు షిప్టులుగా ఇద్దరు పైలెట్లు, ఇద్దరు అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారిని తాకేందుకుగాని, వారి అంత్యక్రియలు నిర్వహించేందుకుగాని వెనుకాడుతున్నారు. మా సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చి ఈ నలుగురితోనే పనులు చేయిస్తున్నాం. అలాగే వాహనాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసి ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం.- వసంత్‌, ఈఎంఈ, మంచిర్యాల

 ప్రత్యేక అభినందనలు..

జిల్లాలో మృతుల కేసుల సంఖ్య పెరుగుతున్నది. సేవలందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మూడు మండలాలకు ఒక పార్థివ వాహనం ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులకు నివేదించాం. కరోనా సమయంలో వీరు చేస్తున్న సేవలు మరువలేనివి. సొంత వారు చేయలేని పనులు అంతా ఆ నలుగురే అయి చేస్తున్నారు. వారికి జీవీకే-ఈఎంఆర్‌ఐ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా.- విజయ్‌, ప్రోగ్రాం మేనేజర్‌, జీవీకే ఈఎంఆర్‌ఐ ఉమ్మడి జిల్లాlogo