మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Oct 03, 2020 , 05:29:25

ఉపాధిలో ‘ఉన్నతి’

ఉపాధిలో ‘ఉన్నతి’

 మంచిర్యాల, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు, నిరుద్యోగులకు ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దాదాపు అన్ని గ్రామాల్లో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పూర్తి స్థాయిలో వంద రోజుల పని కల్పించింది.

‘ఉన్నతి’ ద్వారా శిక్షణ

ఉపాధి హామీ పథకంలో భాగంగా వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు ఉన్నతి కార్యక్రమం ద్వారా పలు అంశాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు స్కిల్డ్‌ కేటగిరీలో, చదువురాని వారిని అన్‌స్కిల్డ్‌ కేటగిరీలో చేర్చారు. జాబ్‌కార్డు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరిచి అందులో వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారిని ఎంపిక చేశారు. జిల్లాలో 35 మందిని ఎంపిక చేశారు. వారికి శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. 

ప్రతి రోజూ రూ. 237..

చదువుకున్న, చదువు మధ్యలో ఆపేసిన వారికి సాప్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌కు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఎంఎస్‌ ఆఫీస్‌, టైపింగ్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌పై తర్ఫీదునిస్తారు. శిక్షణ అనంతరం ప్రైవేట్‌ యార్డులు, షాపింగ్‌ మాల్స్‌, వివిధ ప్రైవేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనునున్నారు. చదువకోని వారికి వ్యవసాయ రంగంలో వర్మి కంపోస్టు తయారీ, పాడి, వ్యవసాయం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, పుట్టగొడుగుల సాగు, కార్పెంటర్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు రోజు రూ. 237 చొప్పున ఉపకార వేతనాలు అందించనున్నారు. ఇప్పటికే ఎంపికైన వారి వివరాలు అధికారులు సేకరించి పంపించారు. మరోవారం రోజుల్లో వీరికి శిక్షణ ఇస్తామని డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.


logo