శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Sep 30, 2020 , 02:08:28

సర్కారు బడికి జై

సర్కారు బడికి జై

  • ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 10,945 మంది చేరిక
  • కరోనా నేపథ్యంలో సర్కారు స్కూళ్లకు డిమాండ్‌
  • ప్రైవేట్‌ బడుల నుంచి తరలివస్తున్న విద్యార్థులు
  • దూరదర్శన్‌ చానల్‌లో ఆన్‌లైన్‌ క్లాసుల ప్రసారం
  • టీవీలు, మొబైల్స్‌లో వీక్షణ..ఉపాధ్యాయుల పర్యవేక్షణ..  

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరుగుతున్నది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 10,945 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. కొత్త ప్రవేశాలతోపాటు ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు తరలివస్తుండడం శుభపరిణామం. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆన్‌లైన్‌ బోధన ఉండడం, ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహిస్తుండడం, పుస్తకాలు ఇస్తుండడం, దూరభారం తగ్గడం వంటి వాటితో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయులు కూడా రోజు విడిచి రోజు విధులకు హాజరుకావడం, ప్రతి విద్యార్థిపై పర్యవేక్షణ ఉండడంతో పాటు మెరుగైన బోధన అందుతుండడంతో పిల్లలను సర్కారు స్కూళ్లలో చేర్పిస్తున్నారు.

నిర్మల్‌/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 3,891 ఉన్నాయి. వీటిలో గతేడాది 2,41,964 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. మార్చి నెలలో కరోనా వ్యాప్తి చెందడంతో సర్కారు ముందస్తుగా మార్చి 15(ఆదివారం) నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన అన్ని తరగతుల వార్షిక పరీక్షలు రద్దు చేసి  విద్యార్థులను ఎగువ తరగతులకు ప్రమోట్‌ చేసింది. అదేవిధంగా పదో తరగతికి సంబంధించి తెలుగు, హిందీ పరీక్షలు నిర్వహించాక.. మిగతా సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించకుండా పైతరగతులకు ప్రమోట్‌ చేసి జీపీఏ ప్రకటించింది. జూన్‌లో విద్యాలయాలు ప్రారంభించాలని భావించినా.. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.

ప్రవేశాలకు విశేష స్పందన..

ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహించే పరిస్థితి లేకపోగా.. కొత్త వారికి ప్రవేశాలు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు 27 నుంచి బడులకు ఉ పాధ్యాయులు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా ప్రవేశాలు తీసుకోవాలని సూచించడంతో అడ్మిషన్లు ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆగస్టు 27 నుంచి ఇప్పటివరకు 10,945 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఇందులో అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 4,758 మంది,  కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 4,499, ఆదిలాబాద్‌లో 682, మంచిర్యాలలో 1,006 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు

ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులు వస్తుండగా తర్వా త స్వల్ప మార్పులు చేశారు. సెప్టెంబర్‌ 11 నుంచి రోజు విడిచి రోజు విధులకు హాజరుకావాలని ఆదేశాలు వచ్చా యి. ఏకోపాధ్యాయుడు ఉన్న పాఠశాలలకు.. ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి ఒకరిని సర్దుబా టు చేశారు. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు..  హైస్కూళ్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త అడ్మిషన్లు తీసుకోవడంతోపాటు పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేశారు. ఒకటో తరగతిలో కొత్త విద్యార్థులతోపాటు మిగతా తరగతుల్లో నూ విద్యార్థులు చేరుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తయిన వారికి ఆరో తరగతిలో.. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి పూర్తయిన వారికి ఎనిమిదో తరగతిలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులే తీసుకున్నారు. ఈ విద్యార్థుల టీసీ(ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌) ని ఉపాధ్యాయులే తీసి.. తల్లిదండ్రుల ఇష్టం మేరకు సమీ ప ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాలలకు రాకున్నా.. టీసీ తీసి చేర్పిస్తున్నారు. 

ఉపాధ్యాయుల పర్యవేక్షణ

ప్రైవేట్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థులు భారీ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. నిర్మల్‌ జిల్లాలోని భైంసా, నిర్మల్‌, ఖానాపూర్‌ పట్టణాల్లో ప్రైవేట్‌ పాఠశాలల వారు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. మం డల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు దూరదర్శన్‌, టీ-శాట్‌ వంటి చానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులు సర్కారు బడిబాట పడుతున్నట్లు స్పష్టమవుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు టీవీలు, మొబైల్‌ ఫోన్లలో చూస్తూ వింటున్నారు. 3-5 వ తరగతి వరకు ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు వారానికి నా లుగైదు రోజులు క్లాసులు ఉంటున్నాయి. 6-10వ తరగతి వారికి ఉదయం 11.30 నుంచి తరగతులు ఉంటున్నాయి. పిల్లలతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి.. ఏ రోజు ఏ టైం లో ఏ సబ్జెక్టు ఉందో సమాచారం ఇ స్తున్నారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప ర్యవేక్షిస్తున్నారు. టీవీలు, ఫోన్లు లేని వారికి పక్కన ఇండ్లలో చూసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆదేశాల ప్ర కారం వర్క్‌ షీట్‌ తయారు చేసి విద్యార్థులకు హోంవర్క్‌ ఇస్తున్నారు.

ప్రవేశాలు పెరుగుతున్నాయి..

గతంలో కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఒకటో తరగతితోపాటు వివిధ తరగతుల్లోనూ విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నం. ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటున్నాయి. టీవీ, ఫోన్లలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తుండగా.. ఈ సౌకర్యం లేని విద్యార్థులకు పక్కన ఉన్న ఇంట్లో సర్దుబాటు చేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి ఆన్‌లైన్‌ క్లాసులపై పర్యవేక్షణ చేస్తున్నాం. సందేహాలు, అర్థం కాని వారికి అక్కడే నివృత్తి చేస్తున్నాం. ఎన్‌సీఈఆర్‌టీ ఇచ్చిన వర్క్‌ షీట్‌ తయారు చేసి హోం వర్క్‌ కూడా ఇస్తున్నాం.

- రవీందర్‌రెడ్డి, హెచ్‌ఎం, పీఎస్‌, సావర్గాం(బాసర)

మెరుగైన విద్యాబోధన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. ఆన్‌లైన్‌ బోధనలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నాం. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకుంటున్న ఎక్కువ మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. గ్రామాల్లో ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు స్థానికంగా ఉన్న సర్కారు బడికి పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నం.

- రవీందర్‌రెడ్డి, డీఈవో, ఆదిలాబాద్‌ 

 సర్కారు స్కూళ్లలో బాగా చెబుతున్నారు..

మా కొడుకు హర్షిత్‌ ఐదో తరగతి వరకు ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదివేవాడు. రోజూ బస్సులో స్కూలుకు పోయివచ్చేటోడు. కరోనా కారణంగా స్కూల్‌ ఇంకా ప్రారంభం కాలేదు. మా గ్రామంలో ఉన్న సర్కారు పాఠశాలలో ఇంగ్లిషు మీడియం ఉంది. ప్రైవేటుకు దీటుగా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతున్నారు. ప్రైవేట్‌కు సర్కారు స్కూళ్లకు తేడా ఏమీ లేదు. ఊళ్లో మంచి చదువులు ఉండగా.. ప్రైవేట్‌కు ఎందుకని మా బాబును ఆరో తరగతిలో ఇక్కడే చేర్పించా.

- సోమన్‌పల్లి సంతోష్‌, విద్యార్థి తండ్రి, తలమడుగు

 70 మంది విద్యార్థులు చేరారు..

మా కజ్జర్ల ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరంలో 70 మంది విద్యార్థులు చేరారు. హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా మా స్కూల్‌లో అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాం. తరగతుల ప్రారంభంలో ఫోన్‌లు, టీవీలు లేని కొంత మంది విద్యార్థులకు స్కూల్‌లో ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా పాఠాలు వినేలా చర్యలు తీసుకుకున్నాం. పాఠశాల పరిసరాల్లో మాబడి తోట, తాగునీరు, విద్యార్థులకు మరుగుదొడ్లు, మూత్రశాల వంటి వసతులు ఉన్నాయి. విద్యార్థులకు వాట్సాప్‌ గ్రూపులో యూట్యూబ్‌ పాఠాలను పెడుతున్నాం.

- రమాకాంతరావు. ఉపాధ్యాయుడు, కజ్జర్ల, తలమడుగు


logo