గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Sep 30, 2020 , 02:08:30

‘వాన’కాలం.. పంటలు పైలం

‘వాన’కాలం.. పంటలు పైలం

  • ఈ సారి సాధారణం కంటే అధికంగా వర్షాలు   
  • ఉత్తర తెలంగాణలోని ప్రధాన పంటలకు కొంత లాభం.. నష్టం 
  • మరింత కురిస్తే ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు  
  •  సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచన

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే ఈసారి అధికంగా నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఎక్కువగా ఉన్నది. జూన్‌లో 72.1, జూలైలో 216.7, ఆగస్టులో 311.7, సెప్టెంబర్‌లో 230.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్‌, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా, ఆగస్టు నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆగస్టులో సగటున 185.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ యేడాది ఏకంగా 311.7 మిల్లీమీటర్లు నమోదైంది. ఇక సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 145.4 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా, మరో మూడు రోజులు ఉండగానే 230.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల సగటు సాధారణ వర్షపాతం 662.4 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 830.5 మిల్లీమీటర్ల్లు నమోదైంది. వర్షపాతం కంటే సగటు ఎక్కువగా నమోదు కావడంతో పంటలకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని ప్రధాన పంటలకు కొంత నష్టం వాటిల్లే ముప్పు ఉన్నది. ఈ పరిస్థితుల్లో నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  ‘నమస్తే’ కథనం..                   

సస్యరక్షణ చర్యలపై దృష్టి పెట్టాలి..

రైతులు సస్యరక్షణ చర్యలపై దృష్టి పెడితేనే ఈ వానకాలం పంట దిగుబడి బాగుంటుంది. ఈ సారి ఉత్తర తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఎక్కువ కురిసింది. దీని వల్ల పంటలకు కొంత లాభం, కొంత నష్టం జరిగిందని చెప్పక తప్పదు. వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు పూర్తిగా నిండాయి. భూగర్భజలాలు పెరిగాయి. ఇవన్నీ మంచి అంశాలే. అయితే.. వరి, పత్తి, పసుపు, కంది పంటలకు కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పొలం, చేన్లలో చేరాల్సిన దాని కంటే ఎక్కువగా నీరు వచ్చింది. దీంతో కొంత నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో పత్తి, కంది పంటలు దెబ్బతింటాయి. ఇంకా వర్షం కురిస్తే మాత్రం పూర్తిగా పాడైపోతాయి. ప్రస్తుతం అన్ని చోట్ల నాలుగు పంటలు శాఖీయ దశ (పూత దశలో)లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. నాలుగు పంటలను ఆశించే చీడపీడలను గుర్తించి, వెంటనే వాటిని అరికట్టే కార్యక్రమాలు చేపట్టాలి. శాస్త్రవేత్తలందరూ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. వ్యవసాయాధికారులు, సిబ్బంది సైతం వీటిపై దృష్టి సారించాలి.  

- ఉమారెడ్డి, ఏడీఆర్‌ (పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం) 

వరిలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో సన్నాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. అధిక వర్షపాతం సన్నాలపై ప్రభావం చూపే అవకాశమున్నది. బీపీటీ, సాంబమసూరి పంటలు ప్రస్తుతం కంకి బయటకు వచ్చే స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే పడిన వర్షాలతో వరికి ఒక ప్రయోజనం చేకూరింది. గతంలో అయితే ఈ సమయానికి దోమపోటు అధికంగా ఆశించే పరిస్థితి ఉండేది. వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో దోమపోటు రాలేదు. ఉల్లికోడు, సుడిదోమ, పాముపొడ వంటి తెగుళ్లు పంటను ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మున్ముందు మరిన్ని వర్షాలు కురిస్తే మాత్రం పంటకు తీవ్రనష్టం వాటిల్లవచ్చు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వర్షం కురిస్తే పరాన్న జీవులు నశించి, పంట తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తున్నది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరిలో నష్టం రాకుండా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుడిదోమ ఉధృతి తొలి దశలో ఉంటే ఎసిఫేట్‌ 300 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటిప్యూరాన్‌ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఉల్లికోడు గమనించినట్లయితే ఫిప్రోనిల్‌ 400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పాముపొడ తెగులు  గమనించినట్లయితే ప్రొపికానజోల్‌ 200 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.

అధిక వర్షాలు పడుతున్నందున పసుపు, కంది పంటల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అత్యంత ఖరీదైన పసుపు పంటకు వర్షాలు తీవ్ర ఇబ్బంది  పెడుతున్నాయి. ముఖ్యంగా ఎత్తయిన భూమిపై పెట్టిన పసుపు పంట మొదట్లో నీళ్లు నిలిచే పరిస్థితి ఉండదు కనుక దానికి ఇబ్బందులు ఉండవు. నీరు నిలిచే పరిస్థితి ఉన్న చోట మాత్రం అధిక నష్టం కలిగే ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా పసుపులో దుంపకుళ్లు తెగులు, మర్రి ఆకు తెగులు వచ్చే ప్రమాదం ఉన్నది. దుంపకుళ్లుతో పంటకు ఎక్కువ నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వేర్లు నల్లబడిపోతాయి. దుంపలు, కొమ్ములు కుళ్లిపోతాయి. పసుపు రంగు బదులుగా మట్టిరంగు వస్తుంది.


logo