మంగళవారం 27 అక్టోబర్ 2020
Mancherial - Sep 28, 2020 , 02:07:40

నూతన రెవెన్యూ చట్టంపై కర్షకలోకం హర్షం

నూతన రెవెన్యూ  చట్టంపై కర్షకలోకం హర్షం

నూతన రెవెన్యూ  చట్టంపై కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తూనే సంపూర్ణ మద్దతు పలుకుతున్నది. ఈ మేరకు బెల్లంపల్లిలో ఆదివారం 600కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీసింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలిరావడంతో ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన యాత్ర.. ప్రధాన వీధుల గుండా సాగింది. డప్పు చప్పుళ్లు.. గుస్సాడీ నృత్యాలు.. జై తెలంగాణ.. జైజై కేసీఆర్‌.. నినాదాలతో పట్టణం మారుమోగింది. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలంగాణ తల్లికి పూలమాల వేయడంతో పాటు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.      - బెల్లంపల్లి టౌన్‌

బెల్లంపల్లి టౌన్‌ : కొత్త రెవెన్యూ చట్టంపై కర్షకులు హర్షం వ్యక్తం చేస్తూనే సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తాండూర్‌, కాసిపేట, నెన్నెల, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు 600కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ట్రాక్టర్‌ నడిపి ర్యాలీని ప్రారంభించారు. పోచమ్మ చెరువు నుంచి పాత జీఎం కార్యాలయం, ఏఎంసీ ఏరియా, కాల్‌టెక్స్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా ప్రభుత్వ దవాఖాన రాష్ట్రీయ రహదారి, కన్నాల ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి, కొత్తబస్టాండ్‌, పాత బస్టాండ్‌, బజార్‌ ఏరియా, కాంటా చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా ‘జై కేసీఆర్‌.. జైజై తెలంగాణ’ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఆదివాసులు డప్పు చప్పుళ్ల, గుస్సాడీ నృత్యాలతో హోరెత్తించారు. పాత బస్టాండ్‌ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ పూలమాల వేశారు. కాంటా చౌరస్తా వద్ద సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రైతు వేషధారణలో కనిపించారు. దోవతి కట్టుకొని.. తలకు పచ్చని కండువా చుట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. 

రైతు సంక్షేమమే ధ్యేయం : ఎంపీ వెంకటేశ్‌

రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని కొనియాడారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం రైతుల నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పాలిటశాపంగా మారితే.. కార్పొరేట్‌ గద్దలకు మాత్రం మేలు చేకూర్చేలా ఉందని మండి పడ్డారు. రైతులు కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను దళారులకు అంటగట్టేలా బిల్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 70 ఏండ్ల దరిద్రం పోయిందని, మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. 

అది గొప్ప చట్టం : ఎమ్మెల్యే చిన్నయ్య

భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ గొప్ప చట్టాన్ని తీసుకువచ్చారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. రైతులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారని, వారి తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ మాట్లాడుతూ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర రైతుల అదృష్టమన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు గడ్డం పావని కల్యాణి మాట్లాడుతూ భూ ప్రక్షాళన, రైతుబంధు, రైతు బీమావంటి వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సిలువేరు నర్సిం గం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, కౌన్సిలర్‌ గెల్లి రాజలింగు, నాయకులు గడ్డం భీమాగౌడ్‌, కలాలి నర్సయ్య, అనుముల సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్‌, మైదం వీరస్వామి, ఎంపీపీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo