శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Sep 26, 2020 , 02:06:30

గాన గంధర్వుడికి నివాళి

గాన గంధర్వుడికి నివాళి

  •  ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణ వార్తతో  జిల్లాలో దిగ్భ్రాంతి   
  •  సంతాపం ప్రకటించిన మంత్రి అల్లోల, విప్‌ సుమన్‌

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : స్వర శిఖరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మృతి చెందగా, జిల్లాకు చెందిన పలువురు కవులు, గాయకులు, కళాకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం..’ బాధ పెట్టినా.. ‘మాటేరాని చిన్నదాని కళ్లుపలికే..’ అంటూ మైమరపించినా, ‘జో పాప లాలీ’ అంటూ లాలపాడినా.. అది ఆయనకే చెల్లిందని కొనియాడారు. ఆయన మృతి సంగీత లోకానికి తీవ్ర విషాదాన్ని నింపిందని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్పీ బాలు మరణం సింగరేణియులను ఎంతో బాధకు గురి చేసింది. నేపథ్యగాయకుడిగా ఎంతో బిజీగా ఉన్న కాలంలోనే ఆయన ‘జై సింగరేణి.. జై సింగరేణి, జై సిరులవేణి, జై కల్పవల్లి, జైజై కన్నతల్లి’ అనే స్ఫూర్తిదాయకమైన గీతాన్ని ఆలపించారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ప్రారంభం సందర్భంగా సింగరేణికి ఒక గీతం ఉండాలని, దానిని ఎస్పీ బాలుతో పాడించాలని అప్పటి సీఎండీ ఆర్‌హెచ్‌ ఖ్వాజా సూచించగా, అప్పటి ఈడీ మార్కెటింగ్‌, పీఆర్‌ డాక్టర్‌ టీఆర్‌కే రావు, డైరెక్టర్‌(పా) తరణికంటి శ్రీరాం, దత్తాత్రేయులు, ప్రస్తుత డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలో అంకురార్పణ జరిగింది. కవి, గాయకుడు, కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌ గణాశంకర్‌ పూజారీ సింగరేణి గీతాన్ని నాలుగు చరణాలతో ఎంతో భావగర్షితంగా రచించి, స్వరపరచారు. 2003, డిసెంబర్‌ 18న బాలుతో హైదరాబాద్‌లోని కీర్తన స్టూడియోలో రికార్డు చేశారు. ఆయనతో పాటు ప్రముఖ గాయని ఉషా కూడా పాడారు. ఈ పాటను 2003, డిసెంబర్‌ 23న కొత్తగూడంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అప్పటి సింగరేణి సీఎండీ ఆర్‌హెచ్‌ ఖ్వాజా కార్మికుల మధ్య విడుదల చేశారు. ప్రతి ఉత్సవంలో, సింగరేణి రన్‌లో ఈ పాట మంచి స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇదే పాటలోని పల్లవిని సింగరేణి గ్రూపు మొబైల్‌ ఫోన్స్‌కు రింగ్‌ టోన్‌గా కూడా యాజమాన్యం ఏర్పాటు చేసింది. దీని పాట రచయిత, స్వరకర్త గణాశంకర్‌ పూజారి(కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌) మాట్లాడుతూ బాలు పాడిన ఈ పాట రెండు దశాబ్దాల కాలమైనా సరే ఇప్పటికీ గొప్ప స్ఫూర్తిదాయక గీతంగానే ఉంటోందన్నారు.

లుతో పాట పాడించాలని అనుకున్నా..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన సాయిబాబా పాటలు మా కుటుంబానికి ఎంతో ఇష్టం. అందుకే ఆయన పాడి న హాయి హాయి వెన్నెలమ్మ.. అనే పాట తర్జులో ఒక మంచి పా ట రాశాను. ఆ పాట బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాలని అనుకున్నా. ఆయన స్మృతిలో ఒక కందపద్యం రాశాను. 

‘బాలుని గళమే మధురము.. బాలుడే ప్రతి యింటా యమర పాటలరేడున్‌.. బాలుడే ఈనాడు లేడు భరియించుడెలా ..’

- నేరెళ్ల రంగాచార్యులు , తెలుగు పండితుడు,కవి, ఆదిలాబాద్‌

త్యాగరాజ గానసభలో కలిశాను 

2001లో హైదరాబాద్‌లో నేను త్యాగరా జగానసభలో బాలు గారిని కలిశాను. ఆయన ఇచ్చిన ప్రేరణ, ఉత్సాహంతోనే జిల్లా లో సా హితీ సంగీత సంస్థ నెలకొల్పాను. వర్ధమాన కళాకారు ల ను ప్రోత్సహిస్తున్న. దేశం, తెలుగుజాతి ఒక మంచి గాయకుడిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలి.

- మల్లెల కభీర్‌దాస్‌, తెలంగాణ సంగీత, సాహిత్య అకాడమీ జిల్లా అధ్యక్షుడు ఆదిలాబాద్‌


logo