శనివారం 24 అక్టోబర్ 2020
Mancherial - Sep 21, 2020 , 01:31:47

రైతు వేదికలతో ఎంతో మేలు

 రైతు వేదికలతో ఎంతో మేలు

మంచిర్యాలటౌన్‌ : మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని అన్నారు. మంచిర్యాల పట్టణంలోని 32వ వార్డు రాంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కూడా నీటి కోసం బిందెతో బయటకు రావద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని రూపొందించారన్నారు. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని, రావాల్సిన నిధులను మంజూరుచేయడం లేదని ఆరోపించారు. జీఎస్టీ బకాయిలు కూడా ఇవ్వడంలేదన్నారు. అయినప్పటికీ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషిచేస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ పథకం పూర్తయినప్పటికీ మంచిర్యాలలో కొన్ని కారణాల వల్ల వెనుకబడి ఉన్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పథకం కింద రూ.58 కోట్లతో మంచిర్యాల పట్టణంలో 158 కిలోమీటర్ల మేర పైపులైన్లను విస్తరించనున్నామన్నారు. మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకం రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు, వార్డు కౌన్సిలర్‌ గాదె సత్యం, కౌన్సిలర్లు హరికృష్ణ, మహేశ్వరి, వేములపల్లి సంజీవ్‌, బానేశ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బొలిశెట్టి విజయ్‌, చంద్రశేఖర్‌ హండే, కొండాల్‌రావు, జగన్‌, గడప రాకేశ్‌, కార్కూరి చంద్రమౌళి, రవీందర్‌రావు, బింగి రమేశ్‌, శ్రీపతి రవి, అప్పాసు కిషన్‌, శంకరయ్య, కుమార్‌, భూమయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

రైతు వేదిక పనుల పరిశీలన..

దండేపల్లి : మండలంలోని మేదరిపేటలో రైతు వేదిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజు చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే రైతు వేదికల నిర్మాణాలు చేపట్టారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో నిర్మాణాల పురోగతిని చూసేందుకే స్వయంగా ఇక్కడికి వచ్చానన్నారు. సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో ప్రతి క్లస్టర్‌ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం.. రైతాంగంపై కక్షతో వ్యవసాయ బిల్లు తీసుకొస్తున్నదన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ లింగన్న, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గురువయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ కే లింగన్న, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్‌, బండారి వెంకటేశ్‌, సర్పంచ్‌ డాంక లక్ష్మణ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

రైతులకు ఎంతో మేలు..

దండేపల్లి(లక్షెట్టిపేట రూరల్‌) : రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో ఎంతో మేలు కలుగుతుందని ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. మండలంలోని సూరారంలో రైతు వేదిక పనులను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, స్థానిక సర్పంచ్‌ శంకరయ్య, ఎంపీటీసీ దావూద్‌, నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

కర్నమామిడిలో..

హాజీపూర్‌ : మండలంలోని కర్నమామిడి క్లస్టర్‌ పరిధిలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనం పనులను ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి ఎంపీ వెంకటేశ్‌నేతకాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులంతా ఒక్కచోట చేరి, సమస్యలు చర్చించుకొని పరిష్కరించుకునేందుకు వీలుగా రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వారి బాగుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిషలు కృషిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా పేదరికంలోకి నెట్టేందుకు చూస్తున్నదని ఆరోపించారు. ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు. వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, సర్పంచ్‌ కొట్టె మహేందర్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు కొట్టె సత్తయ్య, సందెల వెంకటేశ్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు నయీం పాషా, మండల కో ఆప్షన్‌ సభ్యులు రఫీక్‌, సునీల్‌ రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్‌, మండల వ్యవసాయ అధికారి రజిత, మాజీ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


logo