శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Sep 18, 2020 , 01:22:31

ప్రాణ రక్షకులు

ప్రాణ రక్షకులు

  • గతేడాది గోదావరి బ్రిడ్జిపై రివర్‌ పోలీసింగ్‌ ఏర్పాటు
  • సీపీ సత్యనారాయణ ఆలోచనతో నిలుస్తున్న కుటుంబాలు
  • ఇప్పటి వరకు 66 మందిని కాపాడిన సిబ్బంది
  • కౌన్సెలింగ్‌తో వెనక్కి వెళ్తున్న బాధితులు
  • పోలీసుల సేవలకు సలాం అంటున్న ప్రజలు

ప్రేమ విఫలమై ఒకరు.. పరీక్షల్లో ఫెయిలై మరొకరు.. ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్యం.. అత్తింటి వేధింపులతో ఇంకొందరు.. ఇలా ఏవేవో కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలని వచ్చే వారికి పోలీసులు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. గతేడాది పెద్దపల్లి-మంచిర్యాల జిల్లాల సరిహద్దులోని గోదావరి బ్రిడ్జిపై రివర్‌ పోలీసింగ్‌ ఏర్పాటు చేయగా, నిత్యం పహారాకాస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ‘జీవితంలో ఒడిదొడుకులు సహజమని, క్షణికావేశంలో అర్ధాంతరంగా తనువు చాలించి కుటుంబాలకు తీరని వ్యథ మిగిలించవద్దని, ఆత్మస్థయిర్యంతో ముందుకెళ్తేనే భవిష్యత్‌ బాగుంటుందని కౌన్సెలింగ్‌ ఇచ్చి మరీ తిప్పి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 66 మందిని రక్షించగా, రామగుండం సీపీ సత్యనారాయణ సిబ్బందిని అభినందించారు.

- మంచిర్యాల, నమస్తే తెలంగాణ

జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఓ మహిళ తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది. ఇటీవల ఇందారం వద్ద ఉన్న గోదావరి బ్రిడ్జి వద్దకు చేరుకున్నది. ఇది గమనించిన పోలీసులు ఆమెను, బాబును కాపాడారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావని ప్రశ్నించారు. తన భర్త మద్యానికి బానిసై నిత్యం మానసికంగా వేధిస్తున్నాడని, ఈ విషయం ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకే చావాలనుకుంటున్నట్లు చెప్పింది. అనంతరం శ్రీరాంపూర్‌ సీఐ కోటేశ్వర్‌ ఆమె భర్తను పిలిపించారు. ఇద్దరిని కూర్చుండ బెట్టుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపించారు. 

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని రెండు జిల్లాల సరిహద్దులో గోదావరి తీరం ఉంది. అటు పెద్దపల్లి జిల్లాతో పాటు ఇటు మంచిర్యాల జిల్లా సరిహద్దుగా కొనసాగుతోంది. ఈ గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకి అనేక మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. దీనిని గమనించిన రామగుండం కమిషనర్‌ సత్యనారాయణ రివర్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చే వారిని గుర్తించడం, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తిరిగి వెనక్కి పంపించడం వీరి విధి. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదని, ఆలోచించి అర్థం చేసుకొని ముందుకు సాగితే జీవితం బాగుంటుందని వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.

66 మంది ప్రాణాలు కాపాడారు..

గతేడాది సెప్టెంబర్‌ 26న రివర్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ప్రారంభించారు. గోదావరి బ్రిడ్జిపైన పోలీసు సిబ్బంది నిత్యం పహారా కాస్తుంటారు. దాదాపు యేడాదిలో 66 మంది ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు. ఇందులో 43 మంది మహిళలు, 23 మంది మగవారు ఉన్నారు. కుటుంబ సమస్యలతో కొందరు, చదువులో వెనుకబడ్డామని మరికొందరు ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ రివర్‌ పోలీసింగ్‌ ఏర్పాటు చేయకముందు యేటా 100 నుంచి 130 మంది వరకు చనిపోయేవారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ యేడాది కేవలం 11 మంది మాత్రమే ప్రాణాలు తీసుకున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ మదిలో మెదిలిన ఈ ఆలోచనతో అనేక ప్రాణాలు నిలుస్తున్నాయని పలువురు చెబుతున్నారు. 

కౌన్సెలింగ్‌తో వెనక్కి వెళ్తున్నారు..

ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చే వారిని నిలువరిస్తూనే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఇక్కడి పోలీసులు కృషి చేస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకుని.. వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఆత్మహత్యల వల్ల పరిష్కారం దొరకదని, ఆ నిర్ణయం వల్ల మీపై ఆధారపడే వారు రోడ్డున పడాల్సి వస్తుందని, జీవితంలో ఒడిదొడుకులు సహజమని, అర్థం చేసుకొని ముందుకు సాగితేనే భవిష్యత్‌ బాగుంటుందని మనోధైర్యం నింపి వెనక్కి పంపించేస్తున్నారు.

ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావు..

అనేక మంది చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. క్షణికావేశంలో అర్ధాంతరంగా తనువు చాలిస్తూ వారి కుటుంబాలకు తీరని వేదన మిగులుస్తున్నారు. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్లాలే తప్ప ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, కుటుంబ కలహాలు, చదువుల్లో వెనుకబడిపోవడంవంటి కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాలి. కచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనోధైర్యంతో ముందుకెళ్తేనే జీవితానికి విలువ ఉంటుంది. అవసరమైతే పోలీసులను, మానసిక వ్యక్తిత్వ నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. రివర్‌ పోలీసింగ్‌ ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడాం. ఇందుకు సిబ్బందికి అభినందిస్తున్నా.

- సత్యనారాయణ, రామగుండం సీపీ