శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Sep 10, 2020 , 03:39:34

భూసమస్యలు, వివాదాలకు సరికొత్త పరిష్కారం

 భూసమస్యలు, వివాదాలకు సరికొత్త పరిష్కారం

  • n తగ్గనున్న దూరభారం, వ్యయప్రయాసలు..  n మ్యుటేషన్‌ కోసం తప్పనున్న తిప్పలు
  • n భూమి రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌  n అసెంబ్లీలో రెవె‘న్యూ’ బిల్లు ప్రవేశపెట్టిన సీఎం  n ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు..
  • n ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు   n పటాకలు కాల్చి ఊరూరా సంబరాలు చేసుకున్న రైతులు  n ఊరూవాడా పండుగ వాతావరణం.. 

నిర్మల్‌/మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : రెవెన్యూ ప్రక్షాళనకు నడుంబిగించిన తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్నది. బుధవారం భూమిపై హక్కులు, పాసుపుస్తకాల చట్టం-2020, రెవెన్యూ అధికారుల రద్దు చట్టం-2020లను శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ చట్టాల ద్వారా కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రే స్వయంగా వివరించారు. గతంలో ఉన్న లోపాలు.. వాటి ద్వారా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి మాటున జరిగిన అవినీతి, అక్రమాలు, గుండాయిజం, ఆక్రమణలు ఈ తరహా వాటికి కొత్త చట్టం ఎలా అడ్డుకట్ట వేస్తుందో వివరించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా దూరమవుతాయో విపులంగా తెలిపారు. రెండు రకాల రిజిస్ట్రేషన్లు అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇక నుంచి తహసీల్దార్లు చేస్తారని, వీరికి సబ్‌రిజిస్ట్రార్‌ అధికారాలు కల్పిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని, ఆ సమయం ప్రకారం వస్తే అదేరోజు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి పంపేలా కొత్త చట్టం ఉంటుందని చెప్పారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ గతంలో మాదిరిగానే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతాయన్న ముఖ్యమంత్రి.. రిజిస్ట్రేషన్‌తో పాటు.. మ్యుటేషన్‌ కూడా ఇక ముందు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతాయని స్పష్టం చేశారు. వీటితోపాటు కొత్త చట్టం అమల్లోకి వస్తే ఎటువంటి ప్రయోజనాలు సమకూరుతాయో సవివరంగా తెలిపారు.

ట్రిబ్యునల్‌ ద్వారా సత్వర పరిష్కారం..

రెవెన్యూ నూతన చట్టంలో భాగంగా రెవెన్యూ కోర్టులను తీసేసి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. రెవెన్యూ అధికారులకు న్యాయవ్యవస్థపై అంతగా అవగాహన ఉండదు. కేసుల్లో భాగంగా మేము సూచించిన విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారు. ట్రిబ్యునల్‌లో రిటైర్డ్‌ జడ్జీలను నియమించడం కూడా మంచి నిర్ణయం. ఎందుకంటే వారికి కేసుల విషయంలో పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. దీంతో కేసులు సత్వరమే పరిష్కారమవుతాయి. రైతులు రెవెన్యూ కోర్టుల చుట్టూ చాలాకాలంగా తిరిగినా సమస్య పరిష్కారమయ్యేది కాదు. ఇప్పుడు కక్షీదారులకు ఆ ఇబ్బందులుండవు. వారికి సరైన న్యాయం త్వరగా జరుగుతుంది. భూ సమస్యల విషయంలో గతంలో ఏజెన్సీ కోర్టు ఏర్పాటు చేయాలని బార్‌ అసోసియేషన్‌ తరఫున కోరాం. కొత్త రెవెన్యూ చట్టంలో పనులన్నీ పారదర్శకంగా జరుగుతాయి.

- కేమ శ్రీకాంత్‌, న్యాయవాది(ఆదిలాబాద్‌) 

రైతులకు ఇబ్బందులు దూరం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టంతో రైతుల ఇబ్బందులు దూరమవుతయ్‌. భూములకు సంబంధించిన చిన్న, చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలంటే వీఆర్వోలు, తహసీల్‌ కార్యాలయాల చుట్టూ ఏళ్లతరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అమలు చేయనున్న రెవెన్యూ చట్టంలో ఇలాంటి ఇబ్బందులుండయ్‌. డిజిటల్‌ విధానంలో రికార్డుల నిర్వహణ చేయడం చాలా గొప్ప విషయం. రైతులకు పాసు పుస్తకాలు లేకుండానే ఈ విధానం ద్వారా బ్యాంకు రుణాలు అందించడం మంచి పరిణామం. ఆస్తి బదిలీ అనంతరం ఆన్‌లైన్‌ విధానంలో హక్కులు కల్పించడం, రికార్డుల అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం లాంటి విషయాల వల్ల భూముల వ్యవహారంలో పారదర్శకత పెరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులు సంతోషంగా ఉన్నరు.

- బాలూరి గోవర్ధన్‌ రెడ్డి, రైతు సంఘం నాయకుడు

రైతులకు మేలు

సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది రైతులకు మేలు జరుగుతుంది. మూడేండ్ల కసరత్తుకు బుధవారం మోక్షం లభించింది. న్యూ రెవెన్యూ బిల్లు-2020ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం నిజంగా సంతోషదాయకం. సమైక్య పాలనలో రెవెన్యూ వ్యవస్థ అవినీతికి కేరాఫ్‌గా మారింది. భూ వివాదాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. చాలా మంది రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా లాభం లేకపోయింది. వీటిని గమనించిన కేసీఆర్‌ మొదటిసారిగా నిర్ణయం తీసుకున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన తీసుకొచ్చారు. అనంతరం ప్రక్షాళన చేయాలని సంకల్పించారు. అవినీతి అధికారుల భరతం పట్టి సాధారణ ప్రజలు, రైతులకు న్యాయం చేసేందుకు అంతఃకరణశుద్ధితో ముందడుగు వేశారు. దీనికి మనందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రవేశపెట్టిన బిల్లుతో భూ సమస్యలకు ఆస్కారం ఉండదనే నమ్మకం ఉంది. మేము పని చేసినప్పటి వ్యవస్థకు, ప్రస్తుత వ్యవస్థకు చాలా తేడా ఉంది. మా కాలంలో ఇంత అవినీతి లేకుండే, ఎలాంటి భయం లేకుండా అక్రమార్జనే ధ్యేయంగా నేడు పనిచేస్తున్న వీఆర్వోలు ప్రజల ను పీడించుకు తిన్నారు. నేను పట్వారీ వ్యవస్థను చూశా. ఎన్టీ రామా రావు సంస్కరణల తర్వాత రెవెన్యూ శాఖలో విధులు నిర్వహించా. ఇప్పటి వీఆర్వోలు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఇది వారు చేసుకున్న పాపమే. నేటి కంప్యూటర్‌ యుగంలో రెవెన్యూశాఖలో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నారు. వారిని ఉపయోగించుకొని పేద ప్రజలకు సరియైన న్యాయం అందించేలా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామం.

- ఎండీ గులాం హుస్సేన్‌, విశ్రాంత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, తాండూర్‌